Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ఎస్తేరు 1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


వష్తి రాణి బహిష్కరణ

1 ఇండియా నుండి కూషు దేశం వరకు 127 సంస్థానాలను పరిపాలించిన రాజైన అహష్వేరోషు కాలంలో జరిగిన సంఘటనలు ఇవి.

2 ఆ సమయంలో అహష్వేరోషు రాజ సింహాసనం ఉన్న షూష కోట నుండి పరిపాలించాడు.

3 అతని పరిపాలనలోని మూడవ సంవత్సరంలో తన సంస్థానాధిపతులకు, అధికారులకు అందరికి విందు ఏర్పాటు చేశాడు. పర్షియా, మెదీయ సేనాధిపతులు, రాకుమారులు, సంస్థానాధిపతులు విందుకు హాజరయ్యారు.

4 నూట ఎనభై రోజులు పాటు అతడు తనకున్న విస్తారమైన రాజ్య ఐశ్వర్యం, వైభవం, ఘనత, తేజస్సు ప్రదర్శించాడు.

5 ఈ రోజులు గడిచిన తర్వాత, ఏడు రోజులపాటు రాజభవన తోటలో రాజు విందు చేశాడు, షూషనులో ఉన్న అల్పుల నుండి ఘనుల వరకు, ప్రజలందరికి అతడు విందు చేశాడు.

6 ఆ తోటలో పాలరాతి స్తంభాలకున్న వెండి ఉంగరాలకు తెలుపు నార త్రాళ్లు ఊదా రంగు పట్టీలతో తగిలించి ఉన్నాయి. తెరలు కట్టడానికి వాటి మీద వెండి కమ్ములు, అవిసెనార త్రాళ్లకు తెరలు వ్రేలాడుతున్నాయి. చలువ రాయి పాల రాయి ముత్యం ఇతర విలువైన రాళ్లు పరచిన నేల మీద వెండి బంగారాలతో అలంకరించబడిన పరుపులు ఉన్నాయి.

7 అతిథులకు బంగారు పాన పాత్రల్లో ద్రాక్షరసం వడ్డించారు, ఒక్కో పాత్ర ఒక్కో దానికి భిన్నమైనది, రాజు ధారాళ స్వభావం గలవాడు కాబట్టి ద్రాక్షరసం సమృద్ధిగా ఉంది.

8 రాజు ఆజ్ఞను బట్టి ప్రతి అతిథి కూడా ఎలాంటి పరిమితి లేకుండా త్రాగవచ్చు ఎందుకంటే వారందరికి కోరినంతగా ద్రాక్షరసం అందించమని వడ్డించే వారిని రాజు ఆదేశించాడు.

9 వష్తి రాణి కూడా తన రాజైన అహష్వేరోషు యొక్క రాజ్య భవనంలో ఉన్న స్త్రీలందరికి విందు ఏర్పాటు చేసింది.

10-11 ఏడవ రోజున, రాజైన అహష్వేరోషు ద్రాక్షరసంతో ఉల్లాసంగా ఉన్నప్పుడు, తనకు సేవచేసే మెహుమాను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, అబగ్తా, జేతరు, కర్కసు అనే ఏడుగురు నపుంసకులకు రాణియైన వష్తిని తన రాజకిరీటాన్ని ధరింపజేసి తన అందాన్ని ప్రజలకు, సంస్థానాధిపతులకు చూపించడానికి, తన ముందుకు తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. ఆమె చూడటానికి చాలా అందంగా ఉంటుంది.

12 అయితే ఆ నపుంసకులు రాజు ఆజ్ఞను రాణియైన వష్తికి తెలియజేసినప్పుడు, ఆమె రావడానికి ఒప్పుకోలేదు. అప్పుడు రాజు ఆగ్రహంతో, కోపంతో మండిపడ్డాడు.

13 చట్టం, న్యాయం విషయాల్లో రాజు నిపుణులను సంప్రదించడం ఆచారం కాబట్టి, కాలాలను అర్థం చేసుకునే జ్ఞానులతో,

14 కర్షెనా, షెతారు, అద్మాతా, తర్షీషు, మెరెసు, మర్సెనా మెముకాను అనే ఏడుగురు రాజుకు సన్నిహితులు. రాజు దగ్గర ప్రత్యేక హోదాలో రాజ్యంలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్న పర్షియా, మెదీయకు చెందిన ఈ ఏడుగురు సంస్థానాధిపతులతో రాజు మాట్లాడాడు.

15 “చట్టం ప్రకారం రాణియైన వష్తిపై ఏం చర్య తీసుకోవాలి?” అని రాజు అడిగాడు. “రాజైన అహష్వేరోషు అనే నేను నపుంసకుల ద్వారా పంపిన ఆజ్ఞకు రాణియైన వష్తి లోబడలేదు.”

16 అప్పుడు మెముకాను రాజు ఎదుట సంస్థానాధిపతుల ఎదుట జవాబిస్తూ, “వష్తి రాణి తప్పు చేసింది, రాజు పట్ల మాత్రమే కాదు కాని అహష్వేరోషు రాజు పరిపాలిస్తున్న అన్ని సంస్థానాధిపతుల ఎదుట, ప్రజలందరి ఎదుట తప్పు చేసింది.

17 రాణి ప్రవర్తన స్త్రీలందరికి తెలిసిపోతుంది, అప్పుడు వారు తమ భర్తలను చులకన చేస్తూ, ‘రాజైన అహష్వేరోషు తన రాణియైన వష్తిని తన ముందుకు రమ్మని ఆజ్ఞాపిస్తే ఆమె రాలేదు’ అంటారు.

18 రాణి ప్రవర్తన గురించి విన్న పర్షియా మెదీయ సంస్థానాధిపతుల భార్యలు ఈ రోజే రాణి అన్నట్లే రాజ అధిపతులందరితో అంటారు. దీనివలన అంతులేని తిరస్కారం కోపం కలుగుతుంది.

19 “కాబట్టి రాజుకు ఇష్టమైతే, రాజైన అహష్వేరోషు ముందుకు వష్తి రాణి ఇక ఎన్నడూ రాకూడదని రాజాజ్ఞ జారీ చేయండి. అది రద్దు కాకుండా ఉండడానికి దానిని పర్షియా మెదీయ శాసన గ్రంథాల్లో వ్రాయాలి. అంతేకాక, ఆమెకంటే యోగ్యురాలికి రాణి స్థానాన్ని ఇవ్వాలి.

20 అప్పుడు రాజు నిర్ణయాన్ని అతని మహారాజ్యమంతా ప్రకటిస్తే, అల్పుల నుండి ఘనుల వరకు స్త్రీలందరూ తమ భర్తలను గౌరవిస్తారు” అన్నాడు.

21 ఈ సలహా రాజుకు, అతని సంస్థానాధిపతులకు నచ్చింది, కాబట్టి మెముకాను ప్రతిపాదించినట్లు రాజు చేశాడు.

22 అప్పుడు రాజు, ప్రతి పురుషుడు తన కుటుంబానికి తానే యజమానిగా ఉండాలని ఆజ్ఞాపిస్తూ తన రాజ్యంలోని అన్ని ప్రాంతాలకు ప్రతి సంస్థానానికి ప్రజలందరికి వారివారి భాషల్లో వ్రాయించి తాకీదులు పంపాడు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan