Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ఎఫెసీయులకు 4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


క్రీస్తు శరీరంలో ఐక్యత పరిపూర్ణత

1 మీరు పిలువబడిన పిలుపుకు యోగ్యులుగా నడుచుకోవాలని ప్రభువు యొక్క ఖైదీనైన నేను మిమ్మల్ని కోరుతున్నాను.

2 ప్రేమలో ఒకరిని ఒకరు సహించుకుంటూ పూర్ణ వినయంతో సాత్వికంతో, దీర్ఝశాంతంతో ఉండండి.

3 మీరు సమాధాన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోడానికి ప్రయాసపడండి.

4 శరీరం ఒక్కటే; ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే మీరు పిలువబడినప్పుడు ఒకే నిరీక్షణ కోసం పిలువబడ్డారు;

5 ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే;

6 అందరికి తండ్రియైన దేవుడు ఒక్కరే, ఆయనే అందరికి పైగా ఉన్నవారు, అందరి ద్వారా వ్యాపించి అందరిలో ఉన్నారు.

7 అయితే అందరికి క్రీస్తు నిర్ణయించిన పరిమాణం చొప్పున కృప ఇవ్వబడింది.

8 అందుకే, ఈ విధంగా చెప్పబడింది: “ఆయన ఆరోహణమైనప్పుడు, ఆయన అనేకమందిని చెరపట్టి తీసుకెళ్లి, తన ప్రజలకు బహుమానాలను అనుగ్రహించారు.”

9 ఆయన ఆరోహణం అయ్యారంటే ఆయన క్రిందకు, భూమి మీదకు దిగివచ్చారని దాని అర్థం కాదా?

10 క్రిందకు దిగివచ్చినవాడే, సమస్త ప్రపంచాన్ని నింపడానికి ఆకాశ మండలాలన్నింటి కంటే పైగా ఆరోహణమయ్యారు.

11-13 మనం విశ్వాసంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఐక్యతను పొందేవరకు, క్రీస్తు యొక్క పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత గల వారం అయ్యేవరకు క్రీస్తు శరీరమైన సంఘం కట్టబడేలా తన ప్రజలను పరిచర్య కోసం సిద్ధపరచడానికి, క్రీస్తే అపొస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, బోధకులను అనుగ్రహించారు.

14 మనం ఇంకా పసిపిల్లలం కాదు కాబట్టి, మనుష్యులు మోసపూరిత యోచనలతో వంచనలతో కుయుక్తితో చేసే బోధలు అనే ప్రతీ గాలికి ఇటు అటు ఎగిరిపోతూ, అలలచే ముందుకు వెనుకకు కొట్టుకొనిపోయేవారంగా ఉండకూడదు.

15 ప్రేమ కలిగి సత్యం మాట్లాడుతూ క్రీస్తును శిరస్సుగా కలిగిన పరిపూర్ణ శరీరంలా ఉండడానికి మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము.

16 ఆయన సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతీ అవయవం దాని పనిని చేస్తుండగా, ప్రతి కీలు సహాయంతో ఒకటిగా అతుకబడి ప్రేమలో తనకు అభివృద్ధి కలుగునట్లు శరీరాన్ని వృద్ధి చేసుకుంటుంది.


వెలుగు సంబంధమైన పిల్లలుగా జీవించుట

17 కాబట్టి మీరు, ఇకమీదట దేవుని భయంలేని యూదేతరులు నడుచుకొనునట్లు వ్యర్థమైన ఆలోచనలతో నడుచుకొనకూడదని ప్రభువు ఇచ్చిన అధికారంతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.

18 వారు తమ హృదయ కాఠిన్యాన్ని బట్టి తమలో ఉన్న అజ్ఞానం కారణంగా దేవుని నుండి వచ్చే జీవం నుండి వేరుపరచబడి గ్రహించుటలో గ్రుడ్డివారిగా ఉన్నారు.

19 వారు సిగ్గును వదిలి అత్యాశతో నానా విధాలైన అపవిత్ర కార్యాలను జరిగిస్తూ, తమను తామే కాముకత్వానికి అప్పగించుకున్నారు.

20-21 అయితే మీరు క్రీస్తు గురించి విన్నప్పుడు యేసులో ఉన్న సత్యానికి అనుగుణంగా ఆయనలో బోధించబడినప్పుడు మీరు నేర్చుకున్న జీవన విధానం ఇది కాదు.

22 మీ పాత స్వభావాన్ని, మీకు బోధించబడిన ప్రకారం, మీ ఆలోచనా వైఖరి నూతనపరచబడటానికి,

23 మీ మోసపూరిత కోరికలతో చెడిపోతున్న, మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి;

24 నిజమైన నీతి, పరిశుద్ధత గల దేవుని పోలికగా ఉండడానికి సృజించబడిన క్రొత్త స్వభావాన్ని ధరించుకోవాలి.

25 కాబట్టి మీలో ప్రతి ఒక్కరు తమ పొరుగువారితో అబద్ధమాడడం మాని సత్యమే మాట్లాడాలి. ఎందుకంటే, మనమందరం ఒకే శరీరంలోని అవయవాలమై ఉన్నాము.

26 “మీ కోపంలో పాపం చేయకండి”: సూర్యుడు అస్తమించే వరకు మీరు ఇంకా కోపంతో ఉండకండి.

27 అలాగే అపవాదికి అడుగుపెట్టే అవకాశం ఇవ్వకండి.

28 దొంగతనం చేసేవారు ఇకమీదట దొంగతనం చేయకూడదు, కానీ తమ చేతులతో అవసరమైన మంచి పనులను చేస్తూ, కష్టపడుతూ అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి.

29 మీ నోటి నుండి ఏ చెడు మాటలు రానివ్వకండి, వినేవారికి మేలు కలిగేలా అవసరాన్ని బట్టి, ముందు వారు బలపడడానికి సహాయపడే మంచి మాటలే మాట్లాడండి.

30 విమోచన దినం కోసం మీరు ఎవరితో ముద్రించబడ్డారో ఆ దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి.

31 అదే విధంగా, ద్వేషమంతటిని, కోపాన్ని, క్రోధాన్ని, అల్లరిని, దూషణను, ప్రతి విధమైన దుష్టత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టండి.

32 క్రీస్తులో దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరిని ఒకరు క్షమిస్తూ, ఒకరిపట్ల ఒకరు దయా, కనికరం కలిగి ఉండండి.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan