ఎఫెసీయులకు 2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంక్రీస్తులో సజీవం 1 మీరైతే, మీ అతిక్రమాలలో పాపాల్లో చచ్చినవారిగా ఉండి, 2 మీరు వీటిలో జీవిస్తున్నప్పుడు ఈ లోక మార్గాలను, అవిధేయులైన వారిలో ఇప్పుడు పని చేస్తున్న ఆత్మయైన వాయుమండల అధిపతిని అనుసరించేవారు. 3 మనమందరం కూడా ఒకప్పుడు లోకస్థులతో కలిసి జీవిస్తూ శరీరేచ్ఛలను మనస్సులోని కోరికలను నెరవేర్చుకొంటూ, ఇతరుల్లా మన శరీరాశలను అనుసరించి ప్రవర్తిస్తూ దేవుని ఉగ్రతకు పాత్రులంగా ఉండేవారము. 4 అయినప్పటికీ, దేవుడు తన మహా ప్రేమను బట్టి, ఆయన కరుణాసంపన్నతను బట్టి 5 మనం మన అతిక్రమాలలో పాపాల్లో చచ్చినవారిగా ఉండగా, క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించారు. ఆయన కృప చేత మీరు రక్షించబడ్డారు. 6 దేవుడు క్రీస్తుతో పాటు మనల్ని కూడా లేపి, పరలోకం మండలాల్లో క్రీస్తు యేసుతో పాటు కూర్చోబెట్టారు. 7 రాబోయే యుగాలలో ఆయన తన కృప యొక్క సాటిలేని ఐశ్వర్యాన్ని చూపించటానికి, క్రీస్తు యేసునందు మన పట్ల ఆయన దయలో వ్యక్తపరిచారు. 8 మీరు మీ విశ్వాసం ద్వారా కృపను చేత రక్షించబడి ఉన్నారు. ఇది మీ నుండి వచ్చింది కాదు, గాని ఇది దేవుడు మీకిచ్చిన బహుమానము. 9 అది క్రియల వలన కాదు, కాబట్టి ఎవరు గొప్పలు చెప్పుకోలేరు. 10 ఎందుకంటే దేవుడు మన కోసం ముందుగా సిద్ధపరచిన మంచి క్రియలు చేయడానికి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన మనం దేవుని చేతిపనియై ఉన్నాము. క్రీస్తు ద్వారా యూదులు, యూదేతరులు సమాధానపరచబడుట 11 కాబట్టి, పుట్టుకతోనే యూదేతరులైన మీరు, తమను తాము “సున్నతి” అంటే మానవ హస్తాలతో శరీరంలో చేయబడేది అని పిలుచుకునే వారి చేత “సున్నతి చేయబడనివారు” అని గతంలో ఎలా పిలువబడ్డారో జ్ఞాపకం చేసుకోండి. 12 ఆ సమయంలో మీరు క్రీస్తు నుండి వేరుగా ఉన్నారు, ఇశ్రాయేలులో పౌరసత్వం లేనివారిగా, వాగ్దాన నిబంధనలకు విదేశీయులుగా, నిరీక్షణ లేనివారిగా, లోకంలో దేవుడు లేనివారిగా ఉండేవారు. 13 ఒకప్పుడు దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసు రక్తాన్ని బట్టి దేవునికి దగ్గరయ్యారు. 14 రెండు సమూహాలను ఒకటిగా చేసి, శత్రుత్వం యొక్క అడ్డు గోడను నాశనం చేసిన ఆయనే మన సమాధానం. 15 అంటే, యేసు క్రీస్తు తన శరీరంలో మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను నియమాలను కొట్టివేసారు. ఈ ఇద్దరిని కలిపి తనలో ఒక నూతన మానవున్ని సృజించి ఆ విధంగా సమాధానపరచడం ఆయన ఉద్దేశము. 16 ఈ ఇరువురిని తన సిలువ ద్వారా ఏక శరీరులుగా దేవునితో సమాధానపరచి, వారి మధ్య ఉన్న శత్రుత్వాన్ని చంపేశారు. 17 ఆయన వచ్చి, దూరంగా ఉన్న మీకు, దగ్గరగా ఉన్నవారికి సమాధాన సువార్తను ప్రకటించారు. 18 ఆయన ద్వారానే మనం ఇద్దరం ఒక్క ఆత్మలో తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాము. 19 దీన్ని బట్టి మీరు ఇకమీదట పరాయి వారు లేదా విదేశీయులు కారు, దేవుని ప్రజలతో తోటి పౌరులుగా ఆయన కుటుంబ సభ్యులుగా ఉన్నారు. 20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు. 21 ఆ కట్టడమంతా ఆయనలో ఒకటిగా అమర్చబడి ప్రభువులో పరిశుద్ధాలయంగా వృద్ధిపొందుతూ ఉంది. 22 ఈ విధంగా ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాసస్థలంగా కట్టబడుతున్నారు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.