Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ప్రసంగి 7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


జ్ఞానం

1 చక్కని పరిమళం కంటే మంచి పేరు మంచిది, జన్మదినం కంటే మరణ దినం మంచిది.

2 విందు జరిగే వారి ఇళ్ళకు వెళ్లే కంటే ఏడ్చేవారి ఇళ్ళకు వెళ్లడం మంచిది. ఎందుకంటే మరణం ప్రతి ఒక్కరికీ వస్తుంది; జీవించి ఉన్నవారు దీనిని హృదయపూర్వకంగా స్వీకరించాలి.

3 నవ్వడం కంటే దుఃఖపడడం మేలు, ఎందుకంటే విచారంగా ఉన్న ముఖం గుండెకు మంచిది.

4 జ్ఞానుల హృదయం దుఃఖపడే వారి గృహంలో ఉంటుంది కాని బుద్ధిహీనుల మనస్సు సంతోషించే వారి ఇంట్లో ఉంటుంది.

5 మూర్ఖుల పాటలు వినడంకంటే, జ్ఞానుల గద్దింపు వినడం మేలు.

6 కుండ క్రింద చిటపటమనే ముండ్ల కంప మంట ఎలాంటిదో, మూర్ఖుల నవ్వు అలాంటిదే. అది కూడా అర్థరహితమే.

7 అన్యాయం జ్ఞానంగల వానిని మూర్ఖునిగా మారుస్తుంది, లంచం హృదయాన్ని పాడుచేస్తుంది.

8 ఆరంభం కంటే అంతం మేలు, అహంకారం కంటే సహనం మేలు.

9 తొందరపడి కోపపడవద్దు ఎందుకంటే కోపం మూర్ఖుల ఒడిలో ఉంటుంది.

10 “ఇప్పుడు ఉన్న రోజుల కన్నా గడిచిపోయిన రోజులే ఎందుకు మంచివి?” అని అనవద్దు అలాంటి ప్రశ్నలు అడగడం తెలివైనది కాదు.

11 జ్ఞానం ఒక వారసత్వంలా ఒక మంచి విషయమే అది సూర్యుని క్రింద బ్రతికి ఉన్నవారికి ప్రయోజనం కలిగిస్తుంది.

12 డబ్బుతో భద్రత లభించినట్లే, జ్ఞానంతో కూడా భద్రత లభిస్తుంది, ప్రయోజనం ఏంటంటే: జ్ఞానం తనను కలిగినవారిని కాపాడుతుంది.

13 దేవుడు చేసిన వాటిని పరిశీలించండి: ఆయన వంకరగా చేసిన దానిని ఎవరు సరిచేయగలరు?

14 సమయం మంచిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండండి; కానీ సమయం చెడుగా ఉన్నప్పుడు ఇలా ఆలోచించండి: దేవుడు దీన్ని చేశారు అలాగే దాన్ని చేశారు. అందువల్ల, తమ భవిష్యత్తు గురించి ఎవరూ ఏమీ తెలుసుకోలేరు.

15 నా ఈ అర్థరహిత జీవితంలో నేను ఈ రెండు చూశాను; నీతిమంతులు తమ నీతిలో నశించారు, దుష్టులు తమ దుష్టత్వంలో దీర్ఘకాలం జీవించారు.

16 మరీ ఎక్కువ నీతిమంతునిగా ఉండకు, మరీ ఎక్కువ జ్ఞానిగా ఉండకు, నిన్ను నీవే ఎందుకు నాశనం చేసుకొంటావు?

17 మరీ ఎక్కువ దుర్మార్గంగా ఉండకు, మూర్ఖునిగా ఉండకు. సమయం రాకముందే ఎందుకు చనిపోవాలి?

18 ఒకదాన్ని పట్టుకోవడం మరొకదాన్ని విడిచిపెట్టకపోవడం మంచిది. దేవునికి భయపడేవారు అన్ని విపరీతాలను అధిగమిస్తారు.

19 పట్టణంలోని పదిమంది అధికారుల కంటే తెలివైన వ్యక్తికి ఉన్న జ్ఞానం శక్తివంతమైనది.

20 ఎప్పుడూ పాపం చేయకుండా మంచినే చేస్తూ ఉండే, నీతిమంతులు భూమిపై ఒక్కరు లేరు.

21 ప్రజలు చెప్పే ప్రతి మాటను వినవద్దు, లేకపోతే మీ సేవకుడు మిమ్మల్ని శపించడం మీరు వింటారు.

22 ఎందుకంటే మీరే చాలాసార్లు ఇతరులను శపించారని మీకు తెలుసు.

23 నా జ్ఞానంతో ఇదంతా నేను పరిశోధించాను, “నేను జ్ఞానిని కావాలని నిశ్చయించుకున్నాను” కాని అది నావల్ల కాలేదు.

24 జ్ఞానం దూరంగా లోతుగా ఉంది దానిని ఎవరు కనుగొనగలరు?

25 జ్ఞానాన్ని, సంగతుల మూలకారణాన్ని వెదకి తెలుసుకోడానికి, దుష్టత్వంలోని బుద్ధిహీనతను, మూర్ఖత్వంలోని వెర్రితనాన్ని గ్రహించడానికి, నేను నా హృదయాన్ని నిలుపుకున్నాను.

26 నేను మరణం కన్నా దుఃఖకరమైనది తెలుసుకున్నాను, అది వల వంటిది, ఉచ్చులాంటి మనస్సు కలిగి సంకెళ్ల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని సంతోషపరిచేవారు ఆమె నుండి తప్పించుకుంటారు. కాని ఆమె పాపులను పట్టుకుంటుంది.

27 ప్రసంగి ఇలా అంటున్నాడు, “నేను తెలుసుకున్నది ఇదే: “సంగతుల మూలకారణాలను తెలుసుకోడానికి ఒక దానికి మరొకదాన్ని జోడించాను.

28 నేను ఇంకా వెదకుతున్నాను కాని దొరకడం లేదు, వేయిమంది పురుషులలో ఒక్క యథార్థవంతుడు దొరికాడు, కానీ స్త్రీలందరిలో ఒక్క యథార్థవంతురాలు కూడా దొరకలేదు.

29 నేను తెలుసుకున్నది ఇది ఒక్కటే; దేవుడు మనుష్యజాతిని యథార్థవంతులుగానే సృజించారు, కానీ వారు అనేక చెడు పథకాల వెంటపడుతున్నారు.”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan