Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ప్రసంగి 5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


దేవునికి నీ మ్రొక్కుబడిని చెల్లించు

1 నీవు దేవుని ఆలయానికి వెళ్లినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. తాము దుర్మార్గపు పనులు చేస్తున్నామని తెలుసుకోకుండా మూర్ఖుల్లా బలి అర్పించడం కన్నా దగ్గరకు వెళ్లి వినడం మంచిది.

2 దేవుని ముందు అనాలోచితంగా మాట్లాడటానికి, నీ హృదయం తొందరపడకుండ నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశంలో ఉన్నారు నీవు భూమిపై ఉన్నావు, కాబట్టి నీ మాటలు తక్కువగా ఉండాలి.

3 విస్తారమైన పనుల వల్ల కలలు వస్తాయి. ఎక్కువ మాటలు మాట్లాడేవారు మూర్ఖునిలా మాట్లాడతారు.

4 నీ దేవునికి చేసుకున్న మ్రొక్కుబడిని చెల్లించడంలో ఆలస్యం చేయవద్దు. మూర్ఖుల గురించి దేవుడు సంతోషించరు, నీ మ్రొక్కుబడిని చెల్లించు.

5 మ్రొక్కుబడి చేసి చెల్లించక పోవడం కంటే మ్రొక్కుబడి చేయకపోవడమే మంచిది.

6 నీ మాటలు నిన్ను పాపంలోకి పడవేయకుండా చూసుకో. ఆలయ దూతకు, “పొరపాటున మొక్కుబడి చేశాను” అని చెప్పవద్దు. నీ మాటలకు దేవుడు కోప్పడి నీ చేతిపనిని నాశనం చేయడం అవసరమా?

7 ఎక్కువ కలలు ఎక్కువ మాటలు అర్థరహితమే. కాబట్టి దేవునికి భయపడు.


ధనం అర్థరహితం

8 ఒక ప్రాంతంలో పేదలను అణచివేయడం, న్యాయాన్ని హక్కులను పాటించకపోవడం లాంటివి నీవు చూస్తే ఆశ్చర్యపడవద్దు; ఎందుకంటే ఒక అధికారి మీద పైఅధికారులు ఉంటారు, వారందరిపైన ఉన్నతాధికారులు ఉంటారు.

9 దేశం అభివృద్ధి చెందినప్పుడు అందరు పంచుకుంటారు; స్వయాన రాజు పొలాల నుండి లబ్ది పొందుతారు.

10 డబ్బును ప్రేమించేవారు ఆ డబ్బుతో తృప్తి పడరు; సంపదను ప్రేమించేవారు తమ ఆదాయంతో ఎప్పుడూ సంతృప్తి చెందరు. ఇది కూడా అర్థరహితము.

11 ఆస్తి ఎక్కువవుతూ ఉంటే, దాన్ని దోచుకునేవారు కూడా ఎక్కువవుతారు. యజమానులకు తమ ఆస్తిని కళ్లతో చూడడం తప్ప, దానివల్ల వారికేమి ప్రయోజనం?

12 శ్రమజీవులు కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా, సుఖంగా నిద్రపోతారు, కానీ ధనికులకున్న సమృద్ధి వారికి నిద్రపట్ట నివ్వదు.

13 సూర్యుని క్రింద బాధాకరమైన ఒక చెడ్డ విషయాన్ని నేను చూశాను: దాచి ఉంచిన సంపద యజమానునికి హాని తెస్తుంది,

14 లేదా దురదృష్టవశాత్తూ వారి సంపద పోతుంది, వారికి పిల్లలు కలిగినప్పుడు వారికి వారసత్వంగా ఏమీ మిగలదు.

15 ప్రతి ఒక్కరు తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చినట్లే దిగంబరిగానే వెళ్లిపోతారు. తాము కష్టపడిన దానిలో నుండి వారు తమ చేతుల్లో ఏమి మోసుకు వెళ్లరు.

16 మరొక చెడ్డ విషయం: ప్రతి ఒక్కరూ ఎలా వస్తారో, వారు అలాగే వెళ్లిపోతారు, వారు గాలికి ప్రయాసపడుతున్నారు కాబట్టి వారు ఏమి పొందుతారు?

17 వారు చాలా నిరాశతో, బాధలతో, కోపంతో, తమ దినాలన్ని చీకటిలో భోజనం చేస్తారు.

18 నేను గమనించిన వాటిలో మంచిది ఏదనగా: దేవుడు తనకిచ్చిన రోజులన్నిటిలో ఒక వ్యక్తి తిని, త్రాగుతూ సూర్యుని క్రింద తాను చేసిన శ్రమతో సంతృప్తి చెందాలి. ఎందుకంటే ఇదే వారు చేయవలసింది.

19 అంతేకాక, దేవుడు ఒక వ్యక్తికి సంపదను ఆస్తులను వాటిని అనుభవించగల సామర్థ్యాన్ని ఇచ్చినప్పుడు, వారు తమ భాగాన్ని తీసుకుని వారి కష్టార్జితంలో వారు ఆనందంగా ఉండాలి; ఇది దేవుని వరము.

20 దేవుడతనికి హృదయంలో ఆనందం కలిగిస్తారు కాబట్టి అతడు తన గతాన్ని సులభంగా మరిచిపోగలుగుతాడు. వారు వారి జీవితపు రోజులను చాలా అరుదుగా ప్రతిబింబిస్తారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan