Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ప్రసంగి 2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


సంతోషాలు అర్థరహితం

1 “ఇప్పుడు, మంచి ఏమిటో తెలుసుకోవడానికి సంతోషం చేత నిన్ను పరీక్షిస్తాను” అని నాలో నేను అనుకున్నాను. కాని ఇది కూడా అర్థరహితమేనని తెలిసింది.

2 నవ్వుతో, “నీది వెర్రితనమని”, ఆనందంతో, “నీవు ఏమి సాధిస్తావు?” అని నేను అన్నాను.

3 నా మనస్సు ఇంకా నన్ను జ్ఞానంతో నడిపిస్తూ ఉండగానే, ద్రాక్షరసంతో నన్ను నేను తృప్తిపరుచుకోవాలని, బుద్ధిహీనత వలన ఉపయోగం తెలుసుకోవాలని అనుకున్నాను. ఆకాశం క్రింద తాము జీవించే కొన్ని రోజుల్లో మనుష్యులు ఏమి చేస్తే మంచిదో చూడాలనుకున్నాను.

4 నేను గొప్ప పనులు మొదలుపెట్టాను: నా కోసం భవనాలు కట్టించుకున్నాను ద్రాక్షతోటలు నాటించాను.

5 తోటలు, ఉద్యానవనాలు వేయించి వాటిలో అన్ని రకాల పండ్లచెట్లు నాటించాను.

6 పెరుగుతున్న చెట్లకు నీరు అందించడానికి నేను చెరువులను త్రవ్వించాను.

7 దాసదాసీలను నేను వెల చెల్లించి కొన్నాను, నా ఇంట్లోనే పుట్టిపెరిగిన దాసులు కూడా నాకున్నారు. యెరూషలేములో నాకన్నా ముందు నుండి ఉన్న వారందరికంటే ఎక్కువ పశుసంపద గొర్రెల మందలు నాకున్నాయి.

8 నా కోసం వెండి బంగారం సమకూర్చుకున్నాను. విదేశాల నుండి రాజ సంపదను సేకరించాను. గాయనీ గాయకులను, మనుష్యుల హృదయాన్ని సంతోషపరిచే వాటిని సంపాదించాను; స్త్రీలు కూడా నా దగ్గర ఉన్నారు.

9 నాకన్నా ముందు యెరూషలేములోని వారందరికంటే నేనెంతో గొప్పవాడినై ఎంతో వృద్ధి చెందాను. వీటన్నిటిలో నా జ్ఞానం నాతోనే ఉంది.

10 నా కళ్లు కోరినవాటిలో దేన్ని చూడకుండ నేను నిరాకరించలేదు; సంతోషాలను అనుభవించకుండా నా హృదయాన్ని ఆటంకపరచలేదు. నా పనులన్నిటిని బట్టి నా హృదయం సంతోషించింది. నా శ్రమంతటికి కలిగిన ఫలితం ఇదే.

11 అయితే, నా చేతులు చేసిన పనులన్నిటిని వాటికోసం నేను పడిన శ్రమనంతటి పరిశీలిస్తే, అవన్నీ అర్థరహితమే అని, గాలికి ప్రయాసపడినట్లే అని తెలుసుకున్నాను. సూర్యుని క్రింద లాభకరమైనదేదీ లేదని నేను గ్రహించాను.


జ్ఞానం బుద్ధిహీనత రెండూ అర్థరహితమే

12 నేను జ్ఞానం, పిచ్చితనం, బుద్ధిహీనతల గురించి ఆలోచించాలని నిర్ణయించుకున్నాను. రాజు ఇంతకుముందే చేసిన దానికంటే, రాజు తర్వాత వచ్చేవాడు అధికంగా ఇంకేమి చేయగలడు? అనుకున్నాను.

13 చీకటి కంటే వెలుగు మేలు అని, బుద్ధిహీనత కంటే జ్ఞానం మేలు అని నేను చూశాను.

14 జ్ఞానికి తలలో కళ్లు ఉంటాయి. మూర్ఖుడు చీకటిలో నడుస్తాడు. అయినా అందరి విధి ఒకటే అని నేను గ్రహించాను.

15 నాలో నేను అనుకున్నాను మూర్ఖుడికి సంభవించేదే నాకూ సంభవిస్తుంది. నేను ఇంత జ్ఞానం సంపాదించి నాకేం లాభం? “ఇది కూడా అర్థరహితం” అని నాలో నేననుకున్నాను.

16 ఎందుకంటే మూర్ఖుల్లాగే జ్ఞానులు కూడా ఎక్కువకాలం జ్ఞాపకం ఉండరు; ఇరువురిని మరచిపోయే రోజులు ఇప్పటికే వచ్చాయి. మూర్ఖుల్లాగే జ్ఞానులు కూడ చస్తారు.


శ్రమ అర్థరహితం

17 ఇదంతా చూస్తూ ఉంటే సూర్యుని క్రింద జరుగుతున్న దాన్ని బట్టి నాకెంతో విచారం కలిగింది, కాబట్టి నేను నా జీవితాన్ని అసహ్యించుకున్నాను. అంతా అర్థరహితమే గాలికి ప్రయాసపడడమే.

18 సూర్యుని క్రింద నేను కష్టపడి సాధించినవన్నీ నా తర్వాత వచ్చే వారికి చెందుతాయని తెలుసుకొని నేను వాటన్నిటిని అసహ్యించుకున్నాను.

19 నా తర్వాత వచ్చేవాడు ఎలాంటివాడో ఎవరికి తెలుసు? అతడు జ్ఞాని కావచ్చు, మూర్ఖుడు కావచ్చు. ఎలాంటి వాడైనా సూర్యుని క్రింద నా శ్రమతో నైపుణ్యతతో సంపాదించినదంతా అతని స్వాధీనమౌతుంది. ఇది కూడా అర్థరహితమే.

20 కాబట్టి సూర్యుని క్రింద నేను పడిన కష్టమంతటి గురించి నేను నిరాశ చెందాను.

21 ఒకరు జ్ఞానంతో తెలివితో నైపుణ్యంతో శ్రమించి పని చేస్తారు, కాని తర్వాత వారు దానిని శ్రమించని మరొకరికి వదిలేయాల్సి వస్తుంది. ఇది కూడా అర్థరహితమే, గొప్ప దురదృష్టకరమే.

22 సూర్యుని క్రింద మనుష్యులు కష్టపడి చేస్తున్న పనులకు వారి శ్రమకు పొందుతున్నది ఏంటి?

23 వారి రోజులన్నిటిలో వారు చేసే పనులన్నీ దుఃఖంతో బాధతో నిండి ఉన్నాయి; రాత్రి కూడా వారి మనస్సులు విశ్రాంతి తీసుకోవు. ఇది కూడా అర్థరహితమే.

24 మనుష్యులు అన్నపానాలు పుచ్చుకుని తమ కష్టార్జితంతో మేలుపొందడం కంటే క్షేమం ఇంకేముంది? అయినా ఇది కూడా దేవుని వలనే కలుగుతుందని నేను తెలుసుకున్నాను.

25 ఆయన అనుమతి లేకుండా, ఎవరు తినగలరు ఆనందాన్ని పొందగలరు?

26 తనను సంతోషపెట్టే వారికి దేవుడు జ్ఞానం, తెలివి, సంతోషాన్ని ఇస్తారు, కాని దేవున్ని సంతోషపెట్టే వారికి కోసం సంపదను పోగుచేసే పని ఆయన పాపికి ఇస్తారు. ఇది కూడా అర్థరహితమే, గాలికి ప్రయాసపడడమే.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan