Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ద్వితీ 9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


ఇశ్రాయేలీయుల నీతిని బట్టి కాదు

1 ఇశ్రాయేలూ, విను: ఇప్పుడు మీరు ఆకాశాన్నంటే ఎత్తైన గోడలున్న పెద్ద పట్టణాలు గల మీకన్నా గొప్ప బలమైన దేశాలను, స్వాధీనం చేసుకోవడానికి మీరు యొర్దాను దాటబోతున్నారు.

2 అక్కడి ప్రజలు బలవంతులు పొడవైనవారు, వారు మీకు తెలిసిన అనాకీయుల వంశస్థులు. వారి గురించి, “అనాకీయుల ఎదుట ఎవరు నిలబడగలరు?” అని చెప్పడం మీరు విన్నారు కదా.

3 అయితే దహించే అగ్నిలా మీ దేవుడైన యెహోవా మీకు ముందుగా దాటి వెళ్తారని మీరు నమ్మండి. ఆయన వారిని నాశనం చేస్తారు; మీ ఎదుట వారిని అణచివేస్తారు. యెహోవా మీకు ప్రమాణం చేసిన ప్రకారం, మీరు వారిని వెళ్లగొట్టి త్వరగా వారిని నిర్మూలం చేస్తారు.

4 మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి వారిని వెళ్లగొట్టిన తర్వాత, “మా నీతిని బట్టే ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి యెహోవా మమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చారు” అని మీ హృదయంలో అనుకోవద్దు. ఈ జనాంగాల దుర్మార్గాన్ని బట్టే యెహోవా మీ ఎదుట నుండి వారిని వెళ్లగొట్టబోతున్నారు.

5 మీ నీతి, నిష్కపటమైన మీ హృదయం కారణంగా మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకోవడంలేదు కాని ఈ జనాంగాల దుర్మార్గాన్ని బట్టే యెహోవా మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణాన్ని నెరవేర్చడానికి మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి వారిని వెళ్లగొడతారు.

6 మీరు మొండి ప్రజలు కాబట్టి, మీ దేవుడైన యెహోవా స్వాధీనం చేసుకోవడానికి ఈ మంచి దేశాన్ని మీకు ఇవ్వడానికి మీ నీతి కారణం కాదని మీరు గ్రహించండి.


బంగారు దూడ

7 అరణ్యంలో మీరు మీ దేవుడైన యెహోవాకు ఎలా కోపం పుట్టించారో జ్ఞాపకం చేసుకోండి. మీరు ఈజిప్టు విడిచిన రోజు నుండి ఇక్కడకు వచ్చిన కాలం వరకు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.

8 హోరేబులో యెహోవా మిమ్మల్ని నాశనం చేసేంతగా ఆయనకు కోపం పుట్టించారు.

9 రాతిపలకలు అనగా, యెహోవా మీతో చేసిన నిబంధనకు సంబంధించి పలకలను తీసుకోవడానికి నేను పర్వతం మీదికి ఎక్కి వెళ్లినప్పుడు, ఆ పర్వతం మీద నేను నలభై పగళ్లు, నలభై రాత్రులు ఉన్నాను; నేను ఆహారం తినలేదు, నీళ్లు త్రాగలేదు.

10 దేవుని వ్రేలితో వ్రాయబడిన రెండు రాతిపలకలను యెహోవా నాకు ఇచ్చారు. మీరందరు సమావేశమైన రోజున పర్వతం మీద అగ్ని మధ్యలో నుండి యెహోవా మీకు ప్రకటించిన ఆజ్ఞలు ఆ పలకల మీద ఉన్నాయి.

11 నలభై పగళ్లు, నలభై రాత్రులు గడిచినప్పుడు, యెహోవా రెండు రాతిపలకలు అనగా, నిబంధనకు సంబంధించిన పలకలు నాకు ఇచ్చారు.

12 అప్పుడు యెహోవా నాతో, “నీవు వెంటనే ఇక్కడినుండి క్రిందికి వెళ్లు, నీవు ఈజిప్టు నుండి తీసుకువచ్చిన నీ ప్రజలు చెడిపోయారు. నేను వారికి ఆజ్ఞాపించిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి తమ కోసం ఒక విగ్రహాన్ని తయారుచేసుకున్నారు” అని చెప్పారు.

13 ఇంకా యెహోవా నాతో, “నేను ఈ ప్రజలను చూశాను, వారు నిజంగా మొండి ప్రజలు.

14 నన్ను విడిచిపెట్టు, నేను వారిని నాశనం చేసి, ఆకాశం క్రింద వారి పేరు ఉండకుండా తుడిచివేస్తాను. నిన్ను వారికంటే బలమైన దేశంగా, సంఖ్యలో వారికంటే ఎక్కువ ఉండేలా చేస్తాను” అని అన్నారు.

15 కాబట్టి నేను పర్వతం అగ్నితో మండుతున్నప్పుడు తిరిగి పర్వతం దిగి వచ్చాను. రెండు నిబంధన పలకలు నా చేతిలో ఉన్నాయి.

16 నేను చూసినప్పుడు, మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా మీరు పాపం చేశారని నేను చూశాను; దూడ రూపంలో తయారుచేసిన విగ్రహాన్ని మీ కోసం తయారుచేసుకున్నారు. యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి త్వరగా తొలగిపోయారు.

17 కాబట్టి నా చేతుల్లో ఉన్న రెండు పలకలను విసిరి, మీ కళ్లముందే వాటిని ముక్కలు చేశాను.

18 యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించి చేసిన పాపాలన్నిటిని బట్టి మీరు ఆయనకు కోపం పుట్టించిన కారణంగా మళ్ళీ నేను నలభై పగళ్లు నలభై రాత్రులు ఆహారం తినకుండా నీళ్లు త్రాగకుండా యెహోవా ఎదుట సాష్టాంగపడ్డాను.

19 మిమ్మల్ని నాశనం చేయాలన్నంతగా కోప్పడిన యెహోవా కోపాన్ని ఉగ్రతను చూసి నేను భయపడ్డాను. కాని యెహోవా మరలా నా మనవి ఆలకించారు.

20 అహరోనును కూడా నాశనం చేసేంతగా యెహోవా అతనిపై కోప్పడ్డారు, కాని నేను అప్పుడు అహరోను కోసం కూడా ప్రార్థన చేశాను.

21 అలాగే మీరు చేసిన పాపిష్ఠి పని, అనగా దూడ విగ్రహాన్ని తీసుకుని అగ్నిలో కాల్చివేశాను. తర్వాత నలగ్గొట్టి దుమ్ము అంత మెత్తగా దానిని పొడిచేసి, ఆ పర్వతం నుండి ప్రవహిస్తున్న వాగులో పడేశాను.

22 తబేరా, మస్సా, కిబ్రోతు హత్తావాలలో కూడా మీరు యెహోవాకు కోపం పుట్టించారు.

23 యెహోవా మిమ్మల్ని కాదేషు బర్నియాలో నుండి పంపిస్తున్నప్పుడు ఆయన మీతో, “మీరు వెళ్లి నేను మీకు ఇచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి” అని చెప్పారు. కాని మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞకు తిరుగుబాటు చేశారు. మీరు ఆయనను నమ్మలేదు, లోబడలేదు.

24 మీరు నాకు తెలిసినప్పటినుండి మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.

25 యెహోవా మిమ్మల్ని నాశనం చేస్తానని చెప్పిన కారణంగా నేను ఆ నలభై పగళ్లు నలభై రాత్రులు యెహోవా ఎదుట సాష్టాంగపడ్డాను.

26 నేను యెహోవాకు ఇలా ప్రార్థన చేశాను, “ప్రభువైన యెహోవా! మీ గొప్ప బలంతో విడిపించి, మీ బలమైన హస్తంతో ఈజిప్టులో నుండి బయటకు తీసుకువచ్చిన మీ స్వాస్థ్యమైన మీ ప్రజలను నాశనం చేయవద్దు.

27 మీ సేవకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రజల మొండితనాన్ని చెడుతనాన్ని పాపాన్ని పట్టించుకోకండి.

28 లేకపోతే మీరు మమ్మల్ని ఏ దేశం నుండి బయటకు తీసుకువచ్చారో ఆ ప్రజలు, ‘యెహోవా వారికి వాగ్దానం చేసిన దేశంలోనికి వారిని తీసుకెళ్లలేక పోయారు, వారిని ద్వేషించారు కాబట్టి అరణ్యంలో చంపడానికి వారిని బయటకు తీసుకెళ్లారు’ అని చెప్పుకుంటారు.

29 అయితే వారు మీ ప్రజలు, మీ అధిక బలం చేత, మీ చాచిన చేతి చేత మీరు బయటకు తీసుకువచ్చిన మీ స్వాస్థ్యము.”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan