Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ద్వితీ 31 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


మోషే తర్వాతి నాయకుడు యెహోషువ

1 మోషే బయటకు వెళ్లి ఇశ్రాయేలీయులతో ఈ మాటలు చెప్పాడు:

2 “నాకు ఇప్పుడు నూట ఇరవై సంవత్సరాలు, నేను ఇకపై మిమ్మల్ని నడిపించలేను. ‘నీవు యొర్దాను దాటవు’ అని యెహోవా నాకు చెప్పారు.

3 మీ దేవుడైన యెహోవా స్వయంగా మీకు ముందుగా దాటి వెళ్లి మీ ముందు ఉండకుండ ఈ దేశాలను నాశనం చేస్తారు. మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. యెహోవా చెప్పినట్టుగా, యెహోషువ కూడా మీకు ముందుగా దాటివెళ్తాడు.

4 అమోరీయుల రాజులైన సీహోను, ఓగులను వారి దేశంతో పాటు నాశనం చేసినట్టుగా, యెహోవా వారికి చేస్తారు.

5 యెహోవా వారిని మీకు అప్పగిస్తారు, నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ మీరు వారికి చేయాలి.

6 నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. వారికి మీరు భయపడవద్దు దిగులుపడవద్దు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో వెళ్తారు; ఆయన మిమ్మల్ని ఎన్నడూ వదిలేయరు, మీ చేయి విడువరు.”

7 తర్వాత మోషే యెహోషువను పిలిపించి, ఇశ్రాయేలీయులందరి సమక్షంలో అతనితో ఇలా అన్నాడు: “నిబ్బరంగా, ధైర్యంగా ఉండు, ఈ ప్రజలకు ఇస్తానని వారి పూర్వికులకు యెహోవా ప్రమాణం చేసిన దేశంలోకి నీవు ఈ ప్రజలతో పాటు వెళ్లి దానిని వారికి వారసత్వంగా ఇవ్వాలి.

8 యెహోవాయే స్వయంగా మీ ముందు వెళ్తారు మీతో ఉంటారు; ఆయన నిన్ను ఎన్నడూ వదిలేయరు, నిన్ను చేయి విడువరు. భయపడవద్దు; నిరుత్సాహపడవద్దు.”


బహిరంగంగా ధర్మశాస్త్రాన్ని చదువుట

9 కాబట్టి మోషే ఈ ధర్మశాస్త్రాన్ని వ్రాసి, లేవీయులైన యాజకులకు అంటే యెహోవా నిబంధన మందసాన్ని మోసేవారికి, ఇశ్రాయేలీయుల పెద్దలందరికి ఇచ్చాడు.

10 తర్వాత మోషే, “ప్రతి ఏడు సంవత్సరాల చివరిలో, అప్పులు రద్దు చేసే సంవత్సరంలో, గుడారాల పండుగ సమయంలో,

11 ఇశ్రాయేలీయులందరు మీ దేవుడైన యెహోవా ఎదుట ఆయన ఎంచుకున్న స్థలంలో కనబడినప్పుడు, మీరు వారందరికి ఈ ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించాలి.

12 మీ పట్టణాల్లో నివసిస్తున్న పురుషులు, స్త్రీలు, పిల్లలు, విదేశీయులను సమకూర్చండి. అప్పుడు వారు విని మీ దేవుడైన యెహోవాకు భయపడటం, ఈ ధర్మశాస్త్రంలోని అన్ని మాటలను జాగ్రత్తగా పాటించడం నేర్చుకుంటారు.

13 ఈ ధర్మశాస్త్రం తెలియని వారి పిల్లలు తప్పక విని, మీరు స్వాధీనం చేసుకోవడానికి యొర్దాను దాటి వెళ్లబోయే దేశంలో మీరు నివసించినంత కాలం మీ దేవుడైన యెహోవాకు భయపడటం నేర్చుకోవాలి.”


ఇశ్రాయేలీయుల తిరుగుబాటును గురించి ముందుగానే చెప్పబడుట

14 ఆ తర్వాత యెహోవా మోషేతో, “నీవు చనిపోయే రోజు దగ్గరలో ఉంది. యెహోషువను పిలిచి, సమావేశ గుడారం దగ్గరకు రండి, అక్కడ నేను అతన్ని నియమిస్తాను” అని చెప్పారు. కాబట్టి మోషే, యెహోషువ వచ్చి సమావేశ గుడారం దగ్గర ఉన్నారు.

15 అప్పుడు యెహోవా గుడారం దగ్గర మేఘస్తంభంలో ప్రత్యక్షమయ్యారు, మేఘం గుడార ద్వారం మీద నిలిచింది.

16 యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు నీ పూర్వికులతో విశ్రాంతి తీసుకోబోతున్నావు, ఈ ప్రజలు త్వరలో తాము ప్రవేశించే దేశంలోని పరదేశి దేవతలకు వేశ్యగా మారతారు. వారు నన్ను విడిచిపెట్టి నేను వారితో చేసుకున్న నిబంధనను ఉల్లంఘిస్తారు.

17 ఆ రోజున నేను వారిపై కోప్పడి వారి చేయి విడిచిపెడతాను; నేను వారి నుండి నా ముఖాన్ని దాచుకుంటాను, వారు నాశనమవుతారు. అనేక విపత్తులు, ఆపదలు వారి పైకి వస్తాయి, ఆ రోజు వారు, ‘ఈ విపత్తులు మనపైకి రావడానికి కారణం మన దేవుడు మనతో లేకపోవడం కాదా?’ అని అనుకుంటారు.

18 వారు ఇతర దేవుళ్ళ వైపు తిరిగి చేసిన దుష్టత్వాన్ని బట్టి నేను ఆ రోజు ఖచ్చితంగా నా ముఖాన్ని దాచుకుంటాను.

19 “ఇప్పుడు ఈ పాటను వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పించి వారితో పాడించండి, అది వారికి వ్యతిరేకంగా నాకు సాక్ష్యంగా ఉంటుంది.

20 నేను వారి పూర్వికులకు ప్రమాణం చేసిన ప్రకారం వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకువచ్చినప్పుడు, వారు తృప్తిగా తిని లావెక్కినప్పుడు, వారు ఇతర దేవుళ్ళ వైపు తిరిగి వాటిని సేవించి, నన్ను తిరస్కరిస్తూ, నా నిబంధనను ఉల్లంఘిస్తారు.

21 వారి మీదికి అనేక విపత్తులు, ఆపదలు వచ్చి పడతాయి. ఈ అనుభవాలకు సాక్ష్యంగా ఈ పాట పాడుకుంటారు. దీన్ని వారి సంతతివారు ఎన్నడూ మరచిపోరు. ప్రమాణం చేసిన వాగ్దాన దేశంలో నేను ఇంకా వారిని తీసుకురాకముందే, ఈ రోజే వారేం ఆలోచన చేస్తున్నారో నాకు తెలుసు.”

22 కాబట్టి మోషే ఆ రోజు ఈ పాటను వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పించాడు.

23 యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఈ ఆజ్ఞ ఇచ్చారు: “నిబ్బరంగా, ధైర్యంగా ఉండు, ఎందుకంటే నేను ఇశ్రాయేలీయులకు ప్రమాణంతో వాగ్దానం చేసిన దేశంలోకి నీవు వారిని తీసుకువస్తావు, నేను నీతో ఉంటాను.”

24 మోషే ఈ ధర్మశాస్త్రం యొక్క మాటలన్నీ మొదటి నుండి చివరి వరకు ఒక గ్రంథంలో వ్రాయడం పూర్తి చేశాక,

25 యెహోవా నిబంధన మందసాన్ని మోసే లేవీయులకు మోషే ఇలా ఆజ్ఞాపించాడు:

26 “ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసం ప్రక్కన ఉంచండి. అది మీమీద సాక్షిగా ఉంటుంది.

27 ఎందుకంటే మీ తిరుగుబాటుతనం, మొండితనం నాకు తెలుసు. నేను ఇంకా మీతో బ్రతికి ఉన్నప్పుడే మీరు యెహోవాపై తిరుగుబాటు చేస్తే, నేను చనిపోయిన తర్వాత మీరు ఇంకెంత ఎక్కువ తిరుగుబాటు చేస్తారు కదా!

28 గోత్ర పెద్దలందరినీ, మీ అధికారులందరినీ సమావేశపరచండి. ఆకాశాన్ని భూమిని వారి మీద సాక్షులుగా ఉంచి వారు వింటుండగా నేను మాట్లాడతాను.

29 ఎందుకంటే నేను చనిపోయాక మీరు పూర్తిగా అవినీతిపరులై నేను ఆజ్ఞాపించిన మార్గం నుండి మీరు తొలగిపోతారని నాకు తెలుసు. రాబోయే రోజుల్లో, మీరు యెహోవా దృష్టికి చెడు చేసి, మీ చేతులు చేసిన వాటి వల్ల ఆయనకు కోపం పుట్టిస్తారు కాబట్టి రాబోయే రోజుల్లో విపత్తు మీ మీదికి వస్తుంది.”


మోషే పాట

30 ఇశ్రాయేలు సమాజమంతా వింటుండగా మోషే ఈ పాటలోని పదాలను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చదివాడు:

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan