Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ద్వితీ 24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 ఒక వ్యక్తి ఒక స్త్రీని పెళ్ళి చేసుకున్న తర్వాత ఆమె అంతకుముందే వేరొకనితో సంబంధం కలిగి ఉన్నట్లు అనుమానం కలిగి ఆమె మీద ఇష్టం తొలగిపోతే, అతడు ఆమెకు విడాకుల ధృవీకరణ పత్రం వ్రాసి ఆమెకు ఇచ్చి తన ఇంట్లోనుండి పంపివేయాలి.

2 ఒకవేళ ఆమె అతని ఇంటి నుండి వెళ్లిన తర్వాత ఆమె మరొక వ్యక్తికి భార్య అయితే,

3 ఆమె రెండవ భర్త కూడా ఆమెను ఇష్టపడలేదు, ఆమెకు విడాకుల ధృవీకరణ పత్రం వ్రాసి ఆమెకు ఇచ్చి అతని ఇంటి నుండి పంపిస్తే లేదా అతడు చనిపోతే,

4 అప్పుడు ఆమె విడాకులు తీసుకున్న ఆమె మొదటి భర్త, ఆమె అపవిత్రమైన తర్వాత ఆమెను మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి అనుమతించబడలేదు. అది యెహోవా దృష్టిలో అసహ్యకరమైనది. మీ దేవుడైన యెహోవా మీకు వారసత్వంగా ఇస్తున్న దేశం మీదికి మీరు దోషం తీసుకురావద్దు.

5 ఒక వ్యక్తి క్రొత్తగా పెళ్ళి చేసుకున్నట్లయితే, అతన్ని యుద్ధానికి పంపకూడదు, ఏ ఇతర భారాన్ని మోపకూడదు. ఒక సంవత్సరం పాటు అతడు స్వేచ్ఛగా ఇంట్లో ఉండి పెళ్ళి చేసుకున్న భార్యను సంతోషపెట్టాలి.

6 అప్పు కోసం పూచీకత్తుగా ఒక తిరగలిని గాని, తిరగలి పై రాతిని గాని తాకట్టు పెట్టకూడదు. ఎందుకంటే అది మనిషి జీవనాధారాన్ని తాకట్టు పెట్టినట్లవుతుంది.

7 ఎవరైనా తోటి ఇశ్రాయేలును ఎత్తుకెళ్లి, బానిసగా చూస్తూ లేదా అమ్ముతూ పట్టుబడినా, ఎత్తుకెళ్లిన వాడు మరణించాలి. మీ మధ్య నుండి చెడును ప్రక్షాళన చేయాలి.

8 అపవిత్రం చేసే కుష్ఠు లాంటి వ్యాధి విషయాల్లో, లేవీయ యాజకులు మీకు సూచించిన విధంగా ఖచ్చితంగా చేయండి. నేను వారికి ఆజ్ఞాపించిన వాటిని మీరు జాగ్రత్తగా పాటించాలి.

9 మీరు ఈజిప్టు నుండి ప్రయాణమై వస్తూ ఉండగా మీ దేవుడైన యెహోవా మిర్యాముకు ఏమి చేశారో జ్ఞాపకం ఉంచుకోండి.

10 మీరు మీ పొరుగువానికి ఏదైనా అప్పు ఇచ్చినప్పుడు, వారు తాకట్టుగా పెట్టిన దాన్ని తెచ్చుకోడానికి ఇంట్లో చొరబడకూడదు.

11 బయటనే నిలవాలి, ఇంట్లోనుండి వచ్చి అతడే స్వయంగా ఆ వస్తువు తెచ్చి ఇవ్వాలి.

12 పొరుగువాడు పేదవాడైతే, వాని తాకట్టును మీ దగ్గర పెట్టుకుని నిద్రపోవద్దు.

13 సూర్యాస్తమయానికి వారి వస్త్రాన్ని తిరిగి ఇవ్వండి, తద్వారా మీ పొరుగువారు దానిపై నిద్రపోవచ్చు. అప్పుడు వారు మిమ్మల్ని దీవిస్తారు, అది మీ దేవుడైన యెహోవా దృష్టిలో నీతిగా లెక్కించబడుతుంది.

14 మీ తోటి ఇశ్రాయేలీయులలో గాని మీ పట్టణాల్లో నివసిస్తున్న విదేశీయులలో గాని పేదవారై అవసరంలో ఉన్న కూలివారిని బాధించవద్దు.

15 ప్రతిరోజు సూర్యాస్తమయానికి ముందు వారి వేతనాలు చెల్లించండి, ఎందుకంటే వారు పేదవారు దానిని లెక్కిస్తున్నారు. లేకపోతే వారు మీకు వ్యతిరేకంగా యెహోవాకు మొర పెట్టవచ్చు, అప్పుడు మీరు దోషులుగా పరిగణించబడతారు.

16 తల్లిదండ్రులు తమ పిల్లల కోసం మరణశిక్ష పొందకూడదు, లేదా వారి తల్లిదండ్రుల కోసం పిల్లలు మరణశిక్ష పొందకూడదు; ప్రతి ఒక్కరూ తమ సొంత పాపం కోసం చనిపోతారు.

17 న్యాయం విషయంలో విదేశీయులను గాని తండ్రిలేనివారిని గాని వంచించకండి లేదా విధవరాలి యొక్క వస్త్రాన్ని తాకట్టుగా తీసుకోకండి,

18 మీరు ఈజిప్టులో బానిసలుగా ఉన్నారని, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అక్కడినుండి విడిపించారని జ్ఞాపకముంచుకోండి. అందుకే ఇలా చేయండని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

19 మీరు మీ పొలంలో పంట కోసినప్పుడు, మీరు ఒక పనను పట్టించుకోకపోతే, దాన్ని తెచ్చుకోడానికి తిరిగి వెనుకకు వెళ్లవద్దు. మీ చేతుల యొక్క అన్ని పనులలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించేలా విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం వదిలేయండి.

20 మీరు మీ చెట్ల నుండి ఒలీవలను కొట్టినప్పుడు, రెండవసారి కొమ్మలపైకి వెళ్లవద్దు. విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం మిగిలి ఉన్నవాటిని వదిలేయండి.

21 మీరు మీ ద్రాక్షతోటలో ద్రాక్షను కోసినప్పుడు, మళ్ళీ తీగెల మీద వెదకవద్దు. మిగిలి ఉన్నవాటిని విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం వదిలేయండి.

22 మీరు ఈజిప్టులో బానిసలుగా ఉంటిరని జ్ఞాపకముంచుకోండి. అందుకే ఇలా చేయండని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan