Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ద్వితీ 22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 మీ తోటి ఇశ్రాయేలీయుల ఎద్దు లేదా గొర్రెలు దారితప్పినట్లు మీరు చూస్తే దానిని విస్మరించవద్దు. కానీ దానిని తిరిగి దాని యజమాని దగ్గరకు తీసుకెళ్లండి.

2 ఒకవేళ వారు మీ దగ్గర నివసించకపోయినా లేదా దాని యజమాని ఎవరో మీకు తెలియకపోయినా, దానిని మీతో ఇంటికి తీసుకెళ్లి, వారు దానిని వెదుక్కునే వరకు ఉంచి, తర్వాత తిరిగి ఇచ్చేయండి.

3 గాడిద గాని వస్త్రం గాని మరి ఏ వస్తువైనా దొరికితే ఇలాగే చేయాలి. దాన్ని విస్మరించవద్దు.

4 మీ తోటి ఇశ్రాయేలీయుని గాడిద గాని ఎద్దు గాని దారిలో పడి ఉండడం మీరు చూస్తే, దానిని విస్మరించవద్దు. అది తిరిగి లేచి నిలబడేలా దాని యజమానికి సహాయం చేయండి.

5 స్త్రీలు పురుషుల దుస్తులు వేసుకోకూడదు, పురుషులు స్త్రీల వస్త్రాలు వేసుకోకూడదు, ఎందుకంటే అలా చేసేవారిని మీ దేవుడైన యెహోవా అసహ్యించుకుంటారు.

6 రోడ్డు ప్రక్కన, చెట్టు ప్రక్కన లేదా నేలపై పక్షుల గూడు కనిపిస్తే, తల్లి చిన్నపిల్లలపై లేదా గుడ్లపై కూర్చుంటే, తల్లిని పిల్లలతో తీసుకెళ్లవద్దు.

7 మీరు పిల్లలను తీసుకెళ్లవచ్చు, కాని తల్లిని వదిలేయాలి, తద్వార మీరు బాగుంటారు దీర్ఘాయువు కలిగి ఉంటారు.

8 మీరు ఒక క్రొత్త ఇంటిని కట్టుకున్నప్పుడు, మీ పైకప్పు చుట్టూ ఒక పిట్టగోడను కట్టుకోండి, తద్వారా ఎవరైనా పైకప్పు నుండి క్రింద పడితే మీ ఇంటిపైకి రక్తపాతం యొక్క అపరాధం తీసుకురాదు.

9 మీ ద్రాక్షతోటలో రెండు రకాల విత్తనాలను నాటవద్దు; మీరు అలా చేస్తే, మీరు వేసే పంటలు మాత్రమే కాకుండా ద్రాక్షతోట యొక్క పండు కూడా అపవిత్రమవుతుంది.

10 ఒక ఎద్దును ఒక గాడిదను జతచేసి దున్నకూడదు.

11 ఉన్ని జనపనార కలిపి నేసిన బట్టలు ధరించకూడదు.

12 మీరు ధరించే వస్త్రం యొక్క నాలుగు మూలల్లో కుచ్చులు చేయండి.


పెళ్ళి ఉల్లంఘనలు

13 ఒకవేళ ఒక వ్యక్తి భార్యను తీసుకుని, ఆమెతో పడుకున్న తర్వాత, ఆమెను ఇష్టపడక,

14 ఆమెను దూషించి, ఆమె పేరు చెడ్డ చేసి, “నేను ఈ స్త్రీని పెళ్ళి చేసుకున్నాను, కానీ నేను ఆమె దగ్గరకు వెళ్లినప్పుడు, ఆమె కన్యత్వానికి రుజువు దొరకలేదు” అని చెప్తే,

15 అప్పుడు ఆ యువతి తల్లిదండ్రులు ఆమె కన్య అనే రుజువును పట్టణ పెద్దల దగ్గరకు తీసుకురావాలి.

16 ఆమె తండ్రి పెద్దలతో, “నేను నా కుమార్తెను ఈ వ్యక్తికిచ్చి పెళ్ళి చేశాను, కాని అతనికి ఆమెపై ఇష్టం లేదు.

17 ఇప్పుడు అతడు ఆమెను దూషించి, ‘మీ కుమార్తె కన్యగా నాకు కనిపించలేదు’ అని అంటున్నాడు. కానీ, నా కుమార్తె కన్యత్వానికి ఇది రుజువు” అని ఆమె తల్లిదండ్రులు పట్టణ పెద్దల ముందు వస్త్రాన్ని ప్రదర్శించాలి,

18 పట్టణ పెద్దలు ఆ వ్యక్తిని తీసుకెళ్లి అతన్ని శిక్షించాలి.

19 వారు అతనికి వంద షెకెళ్ళ వెండి జరిమానా విధించి, ఆ యువతి తండ్రికి ఇవ్వాలి, ఎందుకంటే ఈ వ్యక్తి ఇశ్రాయేలు కన్యకు చెడ్డ పేరు పెట్టాడు. ఆమె అతని భార్యగా ఉంటుంది; అతడు బ్రతికున్నంత కాలం అతడు ఆమెకు విడాకులు ఇవ్వకూడదు.

20 ఒకవేళ, ఆరోపణ నిజమైతే ఆ యువతి కన్యత్వానికి రుజువు దొరకనట్లైతే,

21 ఆమెను తన తండ్రి ఇంటి తలుపు దగ్గరకు తీసుకురావాలి; అక్కడ ఆ పట్టణ పురుషులు ఆమెను రాళ్లతో కొట్టి చంపుతారు. ఆమె తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు వేశ్యావృత్తి చేయడం ద్వారా ఆమె ఇశ్రాయేలులో తప్పుడు పని చేసింది. మీరు మీ మధ్య నుండి చెడును ప్రక్షాళన చేయాలి.

22 ఒక వ్యక్తి మరొకరి భార్యతో పడుకున్నట్లు కనిపించినట్లయితే, ఆమెతో పడుకున్న వ్యక్తి, ఆ స్త్రీ ఇద్దరూ మరణించాలి. మీరు ఇశ్రాయేలు నుండి చెడును ప్రక్షాళన చేయాలి.

23 ఒకవేళ ఒక పురుషుడు ఒక పట్టణంలో పెళ్ళి నిశ్చయమైన ఒక కన్యను కలవడం జరిగి, అతడు ఆమెతో పడుకున్నట్లైతే,

24 మీరు వారిద్దరిని ఆ పట్టణ ద్వారం దగ్గరకు తీసుకెళ్లి, ఆ యువతి పట్టణంలో ఉండి కూడా సహాయం కోసం కేకలు వేయనందుకు తనను, మరొక వ్యక్తి భార్యను చెరిపినందుకు అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి. ఆ విధంగా మీరు మీ మధ్య నుండి చెడును ప్రక్షాళన చేయాలి.

25 అయితే దేశంలో ఒకడు అనుకోకుండ పెళ్ళి నిశ్చయమైన ఒక యువతిని కలిసినప్పుడు, వాడు ఆమెను పాడు చేస్తే, అది చేసిన వ్యక్తి మాత్రమే చావాలి.

26 స్త్రీని ఏమీ చేయవద్దు; ఎందుకంటే ఆమె చంపబడేంత పాపం చేయలేదు. ఈ దావా ఒక పొరుగువాని మీద దాడి చేసి హత్యచేసిన దానిలా ఉంది,

27 ఎందుకంటే ఆ పురుషుడు దేశంలో ఆ యువతిని చూశాడు, నిశ్చితార్థమైన ఆ యువతి కేకలు వేసింది, కాని ఆమెను రక్షించడానికి ఎవరూ రాలేదు.

28 ఒకవేళ ఒక పురుషుడు పెళ్ళి నిశ్చయం కాని ఒక కన్యను కలవడం జరిగి ఆమెను బలత్కారం చేసి వారు పట్టుబడితే,

29 అతడు ఆమె తండ్రికి యాభై షెకెళ్ళ వెండి చెల్లించాలి. అతడు ఆ యువతిని అవమానించాడు కాబట్టి ఆమెను పెళ్ళి చేసుకోవాలి. అతడు బ్రతికున్నంత కాలం ఆమెకు విడాకులు ఇవ్వకూడదు.

30 ఒక పురుషుడు తన తండ్రి భార్యను పెళ్ళి చేసుకోకూడదు; అతడు తన తండ్రి పడకను అగౌరపరచకూడదు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan