Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ద్వితీ 2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


అరణ్యంలో సంచారం

1 యెహోవా నాతో చెప్పిన ప్రకారం మనం వెనుకకు తిరిగి ఎర్ర సముద్ర మార్గంలో అరణ్యంలోనికి ప్రయాణమై వెళ్లి చాలా రోజులు శేయీరు కొండ ప్రాంతం చుట్టూ తిరిగాము.

2 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు,

3 “మీరు ఈ కొండ ప్రాంతం చుట్టూ తిరిగింది చాలు; ఉత్తరం వైపు తిరగండి.

4 ప్రజలకు ఈ ఆదేశాలు ఇవ్వు: ‘శేయీరులో నివసిస్తున్న ఏశావు సంతానమైన మీ బంధువుల భూభాగం గుండా వెళ్లబోతున్నారు. వారు మీకు భయపడతారు, కానీ చాలా జాగ్రత్తగా ఉండండి.

5 వారితో ఘర్షణ పడకండి, ఎందుకంటే నేను వారి భూమిలో ఒక్క అడుగు కూడా మీకు ఇవ్వను. నేను ఏశావుకు స్వాస్థ్యంగా శేయీరు కొండ ప్రాంతాన్ని ఇచ్చాను.

6 మీరు వారికి వెండి ఇచ్చి తినడానికి ఆహారం, త్రాగడానికి నీరు కొనుక్కోవాలి.’ ”

7 మీ దేవుడైన యెహోవా మీ చేతి పనులన్నిటిని ఆశీర్వదించారు, ఈ గొప్ప అరణ్యం గుండా మీ ప్రయాణాన్ని ఆయన చూసుకున్నారు. ఈ నలభై సంవత్సరాలు మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉన్నారు, మీకు ఏది తక్కువ కాలేదు.

8 శేయీరులో నివసిస్తున్న మన బంధువులైన ఏశావు సంతతివారిని విడిచిపెట్టి ముందుకు సాగాము. ఏలతు, ఎసోన్-గెబెరు నుండి వచ్చే అరాబా మార్గం నుండి మనం బయలుదేరి మోయాబు ఎడారి మార్గంలో ప్రయాణించాము.

9 అప్పుడు యెహోవా నాతో అన్నారు, “మోయాబీయులను బాధపెట్టకండి లేదా వారితో ఘర్షణ పడకండి, ఎందుకంటే వారి భూమిలో మీకు ఏమి ఇవ్వను. నేను లోతు సంతానానికి ఆరు దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను.”

10 గతంలో ఎమీయులు ఆ దేశంలో నివసించేవారు, వారు బలవంతులు అనేకమంది, వారు అనాకీయుల్లా పొడవైనవారు.

11 అనాకీయుల్లా వారిని కూడా రెఫాయీయులుగా పరిగణించేవారు కాని మోయాబీయులు వారికి ఎమీయులు అని పేరు పెట్టారు.

12 గతంలో హోరీయులు శేయీరులో నివసించేవారు, అయితే ఏశావు సంతతివారు, ఇశ్రాయేలీయులు యెహోవా తమకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో చేసినట్లుగా, వారిని తరిమివేశారు. వారు హోరీయులను తమ ఎదుట నుండి నాశనం చేసి వారి దేశంలో స్థిరపడ్డారు.

13 యెహోవా అన్నారు, “ఇప్పుడు మీరు లేచి జెరెదు వాగు దాటండి.” కాబట్టి మనం వాగు దాటాము.

14 మనం కాదేషు బర్నియాలో నుండి బయలుదేరి జెరెదు వాగు దాటే వరకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు గడిచాయి. యెహోవా వారికి ప్రమాణం చేసిన రీతిగా, సైనికులుగా ఉన్న వారి తరమంతా అప్పటి శిబిరం నుండి నశించిపోయింది.

15 ఆయన వారిని శిబిరంలో నుండి పూర్తిగా తొలగించే వరకు యెహోవా చేయి వారికి వ్యతిరేకంగా ఉంది.

16 ప్రజల మధ్యలో నుండి ఈ సైనికులు అందరు చనిపోయిన తర్వాత,

17 యెహోవా నాతో ఇలా చెప్పారు,

18 “ఈ రోజు మీరు మోయాబుకు సరిహద్దుగా ఉన్న ఆరు దేశాన్ని దాటబోతున్నారు.

19 మీరు అమ్మోనీయుల దగ్గరకు వచ్చినప్పుడు, మీరు వారిని బాధించవద్దు వారిని యుద్ధానికి రెచ్చగొట్టవద్దు. ఎందుకంటే అమ్మోనీయులకు చెందిన దేశంలో ఏది మీకు ఇవ్వను. ఆ దేశాన్ని నేను లోతు సంతతికి స్వాస్థ్యంగా ఇచ్చాను.”

20 అది కూడా రెఫాయీయుల దేశం అని పరిగణించబడింది; గతంలో రెఫాయీయులు అక్కడ నివసించేవారు. అయితే అమ్మోనీయులు వారికి జంజుమ్మీయులు అని పిలిచేవారు.

21 వారు బలవంతులు, అనేకమంది, అనాకీయుల్లా పొడువైనవారు. యెహోవా అమ్మోనీయుల ఎదుట నుండి వారిని వెళ్లగొట్టారు, కాబట్టి అమ్మోనీయులు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుని వారి దేశంలో స్థిరపడ్డారు.

22 శేయీరులో నివసిస్తున్న ఏశావు సంతానం కోసం కూడా యెహోవా ఇలాగే చేశారు. ఆయన వారి ఎదుట నుండి హోరీయులను నాశనం చేశారు, కాబట్టి వారు వారిని తరిమి ఇప్పటివరకు వారి దేశంలో నివసిస్తున్నారు.

23 గాజా వరకు గ్రామాల్లో నివసించిన ఆవీయులను కఫ్తోరులో నుండి వచ్చిన కఫ్తోరీయులు నాశనం చేసి వారి దేశంలో స్థిరపడ్డారు.


హెష్బోను రాజైన సీహోను యొక్క ఓటమి

24 “మీరు లేచి బయలుదేరి అర్నోను వాగు దాటండి. చూడండి, అమోరీయుడైన హెష్బోను రాజైన సీహోనును అతని దేశాన్ని మీ చేతికి అప్పగించాను. దానిని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టి అతనితో యుద్ధం చేయండి.

25 ఈ రోజే నేను ఆకాశం క్రింద ఉన్న అన్ని దేశాలకు మీరంటే భయాన్ని, వణుకుని కలిగించడం మొదలుపెడతాను. వారు మీ గురించి సమాచారాన్ని విని వణుకుతారు; మీ కారణంగా వారు కలవరపడతారు.”

26 కెదేమోతు ఎడారి నుండి నేను హెష్బోను రాజైన సీహోను దగ్గరకు దూతలను పంపి సమాధానాన్ని తెలియజేశాను,

27 “మీ దేశం మీదుగా మమ్మల్ని వెళ్లనివ్వండి. మేము కుడి ఎడమల వైపు తిరగము, రహదారి మీదనే వెళ్తాము.

28 మా దగ్గర నుండి వెండి తీసుకుని తినడానికి ఆహారం త్రాగడానికి నీళ్లు ఇవ్వండి. మమ్మల్ని కాలినడకన వెళ్లనివ్వండి.

29 శేయీరులో నివసించే ఏశావు సంతతివారు ఆరులో మోయాబీయులు మాకు చేసినట్టే మా దేవుడైన యెహోవా మాకు ఇస్తున్న దేశానికి వెళ్లడానికి కాలినడకన యొర్దాను దాటి వెళ్లనివ్వండి” అని తెలియజేశాను.

30 అయితే హెష్బోను రాజైన సీహోను మనం అతని దేశం గుండా వెళ్లడానికి అనుమతించలేదు. ఎందుకంటే ఇప్పుడు జరిగినట్లుగా అతన్ని మీ చేతికి అప్పగించడానికి మీ దేవుడైన యెహోవా అతని మనస్సు కఠినపరచి అతని హృదయాన్ని మొండిగా మార్చారు.

31 అప్పుడు యెహోవా నాతో అన్నారు, “చూడండి, నేను సీహోనును, అతని దేశాన్ని మీకు అప్పగించడం మొదలుపెట్టాను. అతని దేశాన్ని జయించి స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టండి.”

32 సీహోను అతని సైన్యమంతా యాహాజులో మనతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు,

33 మన దేవుడైన యెహోవా అతన్ని మనకు అప్పగించారు కాబట్టి అతన్ని, అతని కుమారులను, అతని సైన్యమంతటిని మనం హతం చేశాము.

34 ఆ సమయంలో అతని పట్టణాలన్నిటిని, వాటిలో ఉన్న పురుషులు, స్త్రీలు, పిల్లలు ఎవరు మిగులకుండా పూర్తిగా నాశనం చేశాము.

35 అయితే మన కోసం పశువులను, ఆ పట్టణాల సొమ్మును దోచుకున్నాము.

36 అర్నోను వాగు ఒడ్డున ఉన్న అరోయేరు నుండి, ఆ వాగు దగ్గర ఉన్న పట్టణం మొదలుపెట్టి గిలాదు వరకు మనలను మించి బలం కలిగిన పట్టణం ఒకటి కూడా లేదు. మన దేవుడైన యెహోవా వాటన్నిటిని మనకు అప్పగించారు.

37 అయితే మన దేవుడైన యెహోవా ఆజ్ఞ ప్రకారం అమ్మోనీయుల దేశాన్ని కాని యబ్బోకు వాగు లోయలోని ఏ ప్రాంతాన్ని కాని కొండల్లో ఉన్న పట్టణాలను కాని మీరు ఆక్రమించలేదు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan