ద్వితీ 18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంయాజకులకు లేవీయులకు కానుకలు 1 లేవీయులైన యాజకులకు అంటే, లేవీ గోత్రమంతటికి ఇశ్రాయేలీయులతో పాటు వాటా గాని వారసత్వం గాని ఉండదు. యెహోవాకు సమర్పించబడిన హోమబలుల పైనే వారు బ్రతకాలి, ఎందుకంటే అది వారి వారసత్వము. 2 వారి తోటి ఇశ్రాయేలీయులతో వారికి వారసత్వం ఉండదు; యెహోవా వాగ్దానం చేసినట్టుగా యెహోవాయే వారి వారసత్వము. 3 ప్రజలు అర్పణలుగా తీసుకువచ్చే పశువులు, గొర్రెలు మేకల నుండి యాజకులకు చెందవలసిన వాటా: భుజం, లోపలి అవయవాలు, చెంపలు. 4 మీ ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, ఒలీవ నూనెలలో ప్రథమ ఫలాలు, అలాగే గొర్రెబొచ్చు కత్తిరించినప్పుడు మొదటి నూలు వారికే ఇవ్వాలి. 5 యెహోవా పేర నిలిచి ఎల్లప్పుడు సేవ చేయటానికి అతని గోత్రాలన్నిటిలో అతన్ని అతని సంతానాన్ని మీ దేవుడైన యెహోవా ఎన్నుకున్నాడు. 6 ఒక లేవీయుడు అతడు నివసించే ఇశ్రాయేలులో ఎక్కడైనా మీ పట్టణాల్లో ఒకదాని నుండి వెళ్తే, యెహోవా ఎంచుకునే ప్రదేశానికి పూర్తి శ్రద్ధతో వస్తే, 7 అతడు తన దేవుడైన యెహోవా పేరిట అక్కడ సేవచేసే తన తోటి లేవీయులందరిలా సేవ చేయవచ్చు 8 కుటుంబ ఆస్తులు అమ్మిన దానిలో డబ్బు వచ్చినప్పటికీ, వారి ప్రయోజనాలలో అతడు సమానంగా పంచుకోవాలి. జనుల దుష్టత్వాన్ని అనుసరించకూడదు 9 మీ దేవుడైన యెహోవా మీకిచ్చే దేశంలో మీరు ప్రవేశించాక అక్కడి దేశాల అసహ్యకరమైన మార్గాలను అనుకరించడం నేర్చుకోకండి. 10 తమ కుమారున్ని లేదా కుమార్తెను అగ్నిలో బలి ఇచ్చే వారినైననూ, భవిష్యవాణి లేదా మంత్రవిద్య, శకునాలను చెప్పు వారినైననూ, మంత్రవిద్యలో నిమగ్నమయ్యేవారునూ మీలో ఎవరూ కనబడకూడదు. 11 మంత్రాలు జపించేవారు గాని, ఆత్మలతో మాట్లాడేవారు గాని, చనిపోయినవారిని సంప్రదించేవారు గాని మీలో ఉండకూడదు. 12 ఇలాంటివి అభ్యసించేవారు యెహోవాకు అసహ్యులు; ఇలాంటి హేయక్రియలు చేస్తారు కాబట్టే యెహోవా మీ ముందు నుండి జనాలను వెళ్లగొడుతున్నారు. 13 మీ దేవుడైన యెహోవా దృష్టిలో మీరు నిందారహితులై ఉండాలి. ప్రవక్త 14 మీరు స్వాధీనం చేసుకోబోయే జనులు మంత్రవిద్య లేదా భవిష్యవాణి పాటించేవారి మాట వింటారు. అయితే, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అలా అనుమతించలేదు. 15 మీ దేవుడైన యెహోవా నా లాంటి ఒక ప్రవక్తను మీలో నుండి మీ కోసం లేవనెత్తుతాడు, మీరు అతని మాట వినాలి. 16 ఆ సభ రోజున హోరేబు దగ్గర మీ దేవుడనైన యెహోవాను మీరు అడిగింది ఇదే, “మన దేవుడైన యెహోవా స్వరాన్ని వినవద్దు, ఈ గొప్ప అగ్నిని ఇక చూడము, చూస్తే మేము చనిపోతాము.” 17 యెహోవా నాతో, “వారన్న మాట సరియైనది. 18 వారి తోటి ఇశ్రాయేలీయులలో నుండే నీలాంటి ప్రవక్తను లేపుతాను. ఆయన నోట నా మాటలుంటాయి, నా ఆజ్ఞలన్నీ వారికి చెప్తాను. 19 నా పేరట ప్రవక్త చెప్పే మాటలకు ఎవరైనా స్పందించకపోతే వారిని నేనే లెక్క అడుగుతాను. 20 కానీ నేను ఆజ్ఞాపించనిదేదైనా నా పేరున మాట్లాడాలని భావించే ప్రవక్త లేదా ఇతర దేవుళ్ళ పేరిట మాట్లాడే ప్రవక్తను చంపాలి” అని అన్నారు. 21 “ఒక సందేశం యెహోవా మాట్లాడింది కాదు అని మనం ఎలా తెలుసుకోగలము?” అని మీలో మీరు అనుకుంటారు, 22 ఒకవేళ యెహోవా పేరెత్తి ఒక ప్రవక్త ప్రకటించి అది నెరవేరకపోయినా లేదా నిజం కాకపోయినా, అది యెహోవా మాట్లాడింది కాదు. ఆ ప్రవక్త అహంకారంతో మాట్లాడాడు, కాబట్టి భయపడవద్దు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.