Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ద్వితీ 1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


హోరేబును విడిచి వెళ్లమని ఆజ్ఞ

1 యొర్దానుకు తూర్పున ఉన్న అరణ్యంలో అనగా పారానుకు తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహబ్ అనే స్థలాలకు మధ్య సూఫుకు ఎదురుగా ఉన్న అరాబాలో మోషే ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవి.

2 (సాధారణంగా శేయీరు పర్వత దారి గుండా హోరేబు నుండి కాదేషు బర్నియాకు ప్రయాణించడానికి పదకొండు రోజులు పడుతుంది.)

3 నలభైయవ సంవత్సరం, పదకొండవ నెల మొదటి రోజున మోషే ఇశ్రాయేలీయులను ఉద్దేశించి యెహోవా ఆజ్ఞాపించినదంతా వారికి ప్రకటించాడు.

4 ఇది తాను హెష్బోనులో పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోనును ఓడించిన తర్వాత, ఎద్రెయీ దగ్గర అష్తారోతులో పరిపాలించిన బాషాను రాజైన ఓగును ఓడించిన తర్వాత వారికి ప్రకటించాడు.

5 యొర్దాను తూర్పున మోయాబు దేశంలో మోషే ఈ ధర్మశాస్త్రాన్ని వివరించడం మొదలుపెట్టి ఇలా అన్నాడు:

6 దేవుడైన యెహోవా హోరేబు దగ్గర మనతో ఇలా మాట్లాడారు, “మీరు ఈ పర్వతం దగ్గర చాలా కాలం నుండి ఉన్నారు.

7 మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల కొండ ప్రాంతం వైపు వెళ్లండి; అరాబాలో, పర్వతాల్లో, పశ్చిమ కొండ ప్రాంతంలో, దక్షిణం వైపున సముద్రతీరంలో ఉన్న అన్ని స్థలాలకు, కనాను దేశానికి, లెబానోనుకు మహానదియైన యూఫ్రటీసు వరకు ఉన్న పొరుగు దేశాలకు వెళ్లండి.

8 చూడండి, ఈ దేశాన్ని నేను మీకిచ్చాను. కాబట్టి మీరు వెళ్లి యెహోవా మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు, వారి తర్వాత వారి సంతానానికి ఇస్తానని ప్రమాణం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి.”


నాయకుల నియామకం

9 ఆ సమయంలో నేను మీతో, “నేను ఒంటరిగా మోయలేనంత భారంగా మీరున్నారు.

10 మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపజేశారు కాబట్టి ఇప్పుడు మీరు ఆకాశ నక్షత్రాల్లా లెక్కించలేనంతగా ఉన్నారు.

11 మీ పూర్వికుల దేవుడైన యెహోవా మిమ్మల్ని వెయ్యిరెట్లు ఎక్కువ చేసి ఆయన వాగ్దానం చేసినట్లుగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక!

12 అయితే నేనొక్కడినే మీ సమస్యలను మీ భారాలను మీ వివాదాలను ఎలా తీర్చగలను?

13 ప్రతి గోత్రంలో నుండి జ్ఞాన వివేకాలు కలిగిన పురుషులను ఎంపిక చేయండి, నేను వారిని మీకు నాయకులుగా నియమిస్తాను” అని చెప్పాను.

14 అందుకు మీరు, “నీవు చెప్పింది బాగుంది” అని జవాబిచ్చారు.

15 కాబట్టి మీ గోత్రాల్లో నుండి జ్ఞానం కలిగి ప్రసిద్ధులైన వారిని పిలిపించి, వారిని మీ గోత్రాలకు అధికారులుగా, వేయిమందికి, వందమందికి, యాభైమందికి, పదిమందికి ఒక అధికారి ప్రకారం అధికారులుగా నియమించాను.

16 అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో, “మీ ప్రజలమధ్య ఉన్న వివాదాలు విని, ఇద్దరు ఇశ్రాయేలీయుల మధ్య అయినా లేదా ఒక ఇశ్రాయేలీయునికి ఒక విదేశీయునికి మధ్య అయినాసరే, న్యాయంగానే తీర్పు తీర్చాలి.

17 తీర్పు తీర్చడంలో పక్షపాతం చూపించవద్దు; పేదవారైనా గొప్పవారైనా సరే ఒకే రీతిగా వినాలి, తీర్పు దేవునికి సంబంధించింది కాబట్టి ఎవరికి భయపడవద్దు. మీకు పరిష్కరించడానికి కష్టంగా ఉన్న సమస్యను నా దగ్గరకు తీసుకురండి, నేను దానిని వింటాను” అని చెప్పాను.

18 మీరు చేయవలసిందంతా ఆ సమయంలో నేను మీకు చెప్పాను.


గూఢాచారులను పంపుట

19 తర్వాత మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించిన ప్రకారం, హోరేబు నుండి బయలుదేరి మీరు చూసిన భయంకరమైన మహారణ్యం గుండా వచ్చి, అమోరీయుల కొండ ప్రాంతం ద్వారా ప్రయాణించి కాదేషు బర్నియాకు చేరుకున్నాము.

20 అప్పుడు నేను మీతో, “మన దేవుడైన యెహోవా మనకు ఇస్తున్న అమోరీయుల కొండ ప్రాంతానికి మీరు చేరుకున్నారు.

21 చూడండి, మీ దేవుడైన యెహోవా మీకు ఈ దేశాన్ని ఇచ్చారు. మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీతో చెప్పినట్లుగా, వెళ్లి దానిని స్వాధీనపరచుకోండి. భయపడకండి; అధైర్యపడకండి” అని చెప్పాను.

22 అప్పుడు మీరందరు నా దగ్గరకు వచ్చి, “ఆ దేశంలో గూఢచర్యం చేసి మనం వెళ్లవలసిన దారి, మనం వెళ్లే పట్టణాల గురించి సమాచారం తెలుసుకోవడానికి ముందుగానే కొంతమందిని పంపుదాం” అన్నారు.

23 ఈ ఆలోచన నాకు నచ్చింది కాబట్టి మీలో ప్రతి గోత్రం నుండి ఒకరు చొప్పున పన్నెండుమందిని పంపాను.

24 వారు అక్కడినుండి కొండ ప్రాంతానికి ఎక్కి వెళ్లి ఎష్కోలు లోయకు వచ్చి దాన్ని పరిశీలించారు.

25 వారు ఆ దేశపు పండ్లు కొన్ని మన దగ్గరకు తెచ్చి, “మన దేవుడైన యెహోవా మనకిస్తున్న దేశం మంచిది” అని చెప్పారు.


యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు

26 కాని మీరు వెళ్లడానికి ఇష్టపడలేదు; మీ దేవుడైన యెహోవా ఆజ్ఞకు తిరుగుబాటు చేశారు.

27 మీ గుడారాల్లో సణుగుతూ, “యెహోవా మనలను ద్వేషించి మనలను నాశనం చేయడానికి అమోరీయుల చేతికి మనలను అప్పగించడానికి ఈజిప్టు నుండి మనలను బయటకు తీసుకువచ్చారు.

28 మనం ఎక్కడికి వెళ్లగలం? మన సహోదరులు, ‘అక్కడి ప్రజలు మనకన్నా బలవంతులు, పొడవైనవారు; ఆ పట్టణాలు ఎంతో పెద్దవిగా ఆకాశమంత ఎత్తైన గోడలతో ఉన్నాయి; అక్కడ అనాకీయులను కూడా చూశాం’ అని చెప్పి మా గుండెలు భయంతో చెదిరిపోయేలా చేశారు” అన్నారు.

29 అప్పుడు నేను మీతో, “దిగులుపడకండి, వారికి భయపడకండి.

30 మీకు ముందుగా నడుస్తున్న మీ దేవుడైన యెహోవా మీ కళ్ళెదుట ఈజిప్టులోను అరణ్యంలోను మీ కోసం చేసినట్లు ఆయన మీ కోసం యుద్ధం చేస్తారు,

31 మీరు ఈ స్థలానికి చేరుకునేవరకు తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మీ మార్గమంతటిలో మిమ్మల్ని ఎలా ఎత్తుకుని వచ్చారో మీరు చూశారు” అని అన్నాను.

32-33 ఇంత చెప్పినా, మీ ప్రయాణమంతటిలో మీరు బస కోసం చోటు వెదకడానికి, మీరు వెళ్లవలసిన మార్గాన్ని మీకు చూపించడానికి రాత్రివేళ అగ్నిలో, పగటివేళ మేఘంలో మీకు ముందుగా నడిచిన మీ దేవుడైన యెహోవాయందు మీరు నమ్మకం ఉంచలేదు.

34 మీరు చెప్పిన మాటలు యెహోవా విన్నప్పుడు ఆయన కోపంతో, కాబట్టి ఆయన ప్రమాణ చేస్తూ,

35 “నేను మీ పూర్వికులకు ఇస్తానని వాగ్దానం చేసిన ఈ మంచి దేశాన్ని ఈ చెడ్డతరంలో

36 యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవరు చూడరు. అతడు హృదయమంతటితో యెహోవాను అనుసరించాడు కాబట్టి దానిని చూస్తాడు. అతడు అడుగుపెట్టిన దేశాన్ని అతనికి, అతని సంతానానికి నేను ఇస్తాను” అని ప్రమాణం చేశారు.

37 మీ కారణంగా యెహోవా నా మీద కూడా కోప్పడి, “నీవు కూడా ఆ దేశంలో అడుగుపెట్టవు.

38 కాని, నీ సహాయకుడు నూను కుమారుడైన యెహోషువ దానిలో అడుగుపెడతాడు. దానిని స్వాధీనపరచుకునేలా అతడు ఇశ్రాయేలీయులను నడిపిస్తాడు కాబట్టి అతన్ని ప్రోత్సహించు.

39 బందీలుగా వెళ్తారని మీరు చెప్పిన మంచి చెడు తెలియని మీ పిల్లలు ఆ దేశంలో అడుగుపెడతారు. నేను దానిని వారికి ఇస్తాను, వారు దానిని స్వాధీనం చేసుకుంటారు.

40 మీరైతే వెనుకకు తిరిగి ఎర్ర సముద్ర మార్గంలో అరణ్యంలోనికి ప్రయాణించండి” అని అన్నారు.

41 అప్పుడు మీరు, “మేము యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాము. మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన ప్రకారం మేము వెళ్లి పోరాడతాం” అని నాతో చెప్పి మీ ఆయుధాలను ధరించి కొండసీమ మీదికి వెళ్లడం సులభమనుకుని మీలో ప్రతి ఒక్కరు సిద్ధపడ్డారు.

42 అయితే యెహోవా నాతో, “యుద్ధానికి మీరు వెళ్లకండి. ఎందుకంటే నేను మీతో ఉండను. మీరు మీ శత్రువుల చేతిలో ఓడిపోతారు” అని చెప్పారు.

43 నేను మీతో ఆ సంగతి చెప్పాను కాని మీరు వినలేదు. యెహోవా ఆజ్ఞకు వ్యతిరేకంగా మీరు తిరుగుబాటు చేసి మీ అహంకారాన్ని బట్టి కొండసీమ ప్రాంతానికి ఎక్కి వెళ్లారు.

44 ఆ కొండల్లో నివసిస్తున్న అమోరీయులు మీ మీదికి వచ్చి కందిరీగల్లా మిమ్మల్ని శేయీరు నుండి హోర్మా వరకు తరిమికొట్టారు.

45 అప్పుడు మీరు తిరిగివచ్చి యెహోవా ఎదుట ఏడ్చారు కాని ఆయన మిమ్మల్ని లక్ష్యపెట్టలేదు మీ మొర వినలేదు.

46 కాబట్టి మీరు కాదేషులో చాలా రోజులు ఉండిపోయారు. అక్కడ ఎన్ని రోజులు నివసించారో మీకు తెలుసు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan