Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

దానియేలు 9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


దానియేలు ప్రార్థన

1 మాదీయుడును అహష్వేరోషు కుమారుడునైన దర్యావేషు బబులోను రాజ్యం మీద రాజుగా నియమించబడిన మొదటి సంవత్సరంలో

2 అతని పరిపాలన మొదటి సంవత్సరంలో, దానియేలు అనే నేను పవిత్ర గ్రంథంలోని లేఖనాల ద్వారా గ్రహించింది, యిర్మీయా ప్రవక్తకు యెహోవా పంపిన వాక్కు ప్రకారం, యెరూషలేము యొక్క నిర్జన స్థితి డెబ్బై సంవత్సరాల వరకు కొనసాగుతుంది.

3 కాబట్టి నేను ప్రభువైన దేవుని వైపు తిరిగి ప్రార్థన, విన్నపం ద్వారా ఆయనను ప్రాధేయపడ్డాను, ఉపవాసముండి, గోనెపట్ట చుట్టుకొని, బూడిద మీద పోసుకున్నాను.

4 నా దేవుడైన యెహోవాకు ఇలా ప్రార్థన చేస్తూ ఒప్పుకున్నాను: “ప్రభువా! మిమ్మల్ని ప్రేమించి, మీ ఆజ్ఞలను పాటించేవారిపట్ల ప్రేమ నిబంధనను నిలిపే మహా భీకరుడవైన దేవా,

5 మేము పాపం చేశాము, తప్పు చేశాము. మేము దుష్టులమై తిరుగుబాటు చేశాం; మీ ఆజ్ఞలు, న్యాయవిధుల నుండి తప్పిపోయాము.

6 మీ నామంలో, మా రాజులతో, అధిపతులతో, పూర్వికులతో, దేశ ప్రజలందరితో మాట్లాడిన మీ దాసులైన ప్రవక్తల మాటలు మేము వినలేదు.

7 “ప్రభువా! మీరు నీతిమంతులు, కాని ఈ రోజు మేమైతే అనగా మీ పట్ల మేము చూపిన నమ్మకద్రోహాన్ని బట్టి ఆయా దేశాలకు చెదరగొట్టబడిన యూదా ప్రజలం, యెరూషలేము నివాసులం, ఇశ్రాయేలీయులం, దగ్గరగా దూరంగా ఉన్నవారమందరం అవమానంతో నిండిపోయాము.

8 యెహోవా, మేము మీకు వ్యతిరేకంగా పాపం చేశాం కాబట్టి మేము, మా రాజులు, అధిపతులు, పూర్వికులు అవమానంతో కప్పబడ్డాము.

9 మా ప్రభువైన దేవుడు, మేము తిరుగుబాటు చేసిన కూడా, కరుణ, క్షమాపణ గలవారు;

10 దేవుడైన యెహోవాకు మేము లోబడలేదు, ఆయన తన దాసులైన ప్రవక్తల ద్వారా మాకిచ్చిన న్యాయవిధులను మేము పాటించలేదు.

11 ఇశ్రాయేలంతా మీకు విధేయత చూపడం విడిచిపెట్టి, మీ ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు, వదిలేశారు. “కాబట్టి దేవుని దాసుడైన మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న శాపాలు, ప్రమాణం చేయబడిన తీర్పులు మామీద కుమ్మరించబడ్డాయి, ఎందుకంటే మీకు విరోధంగా మేము పాపం చేశాము.

12 మమ్మల్ని ఉద్దేశించి చెప్పిన మాటలు, మా మీదికి, మా పాలకుల మీదికి గొప్ప విపత్తు తీసుకురావడం ద్వారా మీరు నెరవేర్చారు. యెరూషలేముకు జరిగినట్లు ఆకాశమంతటి క్రింద మరే స్థలంలో ఎప్పుడూ జరగలేదు.

13 మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినట్లే, ఈ విపత్తు అంతా మా మీదికి వచ్చింది, అయినా మేము పాపాలను వదిలి, మీ సత్యం వైపు దృష్టి పెట్టక, మా దేవుడైన యెహోవా చూపించు దయను కోరలేదు.

14 మా దేవుడైన యెహోవా తాను క్రియలన్నిటిలో న్యాయవంతులు కాబట్టి యెహోవా ఈ విపత్తు మా మీదికి రప్పించడానికి మొహమాట పడలేదు; అయినా మేము ఆయనకు లోబడలేదు.

15 “ప్రభువైన మా దేవా, బలమైన హస్తం ద్వారా మీ ప్రజలను ఈజిప్టు నుండి బయటకు రప్పించి నీ నామానికి ఘనత తెచ్చుకున్నావు. మేము పాపం చేశాం, దుర్మార్గంగా ప్రవర్తించాము.

16 ప్రభువా, మీ నీతిక్రియల ప్రకారం మీ పట్టణం, మీ పరిశుద్ధ కొండయైన యెరూషలేము పట్ల మీ కోపాన్ని వదిలేయండి. మా పాపాలు, మా పూర్వికుల అతిక్రమాలు, మా చుట్టూ ఉన్న ప్రజలకు, యెరూషలేమును, మీ ప్రజలను హేళన చేసే విషయంగా మార్చాయి.

17 “ఇప్పుడు, మా దేవా, మీ దాసుని ప్రార్థనలు, విన్నపాలు ఆలకించండి. ప్రభువా, మీ కోసం, పాడైపోయిన మీ పరిశుద్ధాలయం మీద దయతో చూడండి.

18 మా దేవా, చెవియొగ్గి ఆలకించండి; మీ కళ్లు తెరిచి, మీ పేరుపెట్టబడిన పట్టణం యొక్క శిథిలావస్తను చూడండి. మేము నీతిమంతులమని కాదు కాని, మీ గొప్ప కరుణను బట్టి మేము మీకు మా విన్నపాలు చేస్తున్నాము.

19 ప్రభువా ఆలకించండి! ప్రభువా క్షమించండి! నా దేవా మీ కోసం, ఆలస్యం చేయకండి, ఎందుకంటే మీ పట్టణం మీ ప్రజలు మీ పేరు కలిగి ఉన్నారు.”


డెబ్బై “ఏడులు”

20 నేను మాట్లాడుతూ, ప్రార్థన చేస్తూ, నా పాపాలు, నా ప్రజలైన ఇశ్రాయేలు పాపాలు ఒప్పుకుంటూ, నా దేవుడైన యెహోవాకు ఆయన పరిశుద్ధ కొండ గురించి వేడుకుంటూ ప్రార్థించాను.

21 నేను ఇంకా ప్రార్థనలో ఉన్నప్పుడు, ముందు చూసిన దర్శనంలో కనిపించిన వ్యక్తియైన గబ్రియేలు సాయంకాల నైవేద్య సమయంలో వేగంగా ఎగురుకుంటూ నా దగ్గరకు వచ్చాడు.

22 అతడు నాకు ఉపదేశిస్తూ నాతో అన్నాడు, “దానియేలూ, నేను నీకు వివేకమును, గ్రహింపును ఇవ్వడానికి వచ్చాను.

23 నీవు ప్రార్థన చేయడం మొదలుపెట్టిన వెంటనే, ఒక మాట బయటకు వెళ్లింది, అది నేను నీతో చెప్పాలని వచ్చాను, ఎందుకంటే నీవు ఎంతో విలువగలవాడివి. కాబట్టి, వాక్కును పరిగణించి, దర్శనాన్ని గ్రహించు:

24 “దోషం ముగించడానికి, పాపం తుదముట్టించడానికి, దుష్టత్వానికి ప్రాయశ్చిత్తం చేయడానికి, శాశ్వత నీతిని చేకూర్చడానికి, దర్శనాన్ని, ప్రవచనాన్ని ముద్రించడానికి, అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి, నీ ప్రజలకు, నీ పరిశుద్ధ పట్టణానికి డెబ్బై ‘ఏడులు’ నిర్ణయించబడ్డాయి.

25 “దీనిని తెలుసుకొని, గ్రహించు: యెరూషలేము పునరుద్ధరణ, పునర్నిర్మాణం కోసం ఆజ్ఞ ఇయ్యబడింది మొదలుకొని, అభిషిక్తుడైన అధిపతి వచ్చేవరకు ఏడు ‘వారాలు,’ అరవై రెండు ‘వారాలు’ పడుతుంది. అయితే కష్టకాలంలో యెరూషలేము నడి వీధులతో, కాలువతో పునర్నిర్మించబడుతుంది.

26 అరవై రెండు ‘సంవత్సరాల’ తర్వాత అభిషిక్తుడు హతం చేయబడతాడు, ఆయన స్వాధీనంలో ఏమీ ఉండదు. ఆ తర్వాత వచ్చే పరిపాలకుని ప్రజలు పట్టణాన్ని, పరిశుద్ధాలయాన్ని నాశనం చేస్తారు. అంతం వరదలా వస్తుంది: యుద్ధం అంతం వరకు కొనసాగుతుంది, వినాశనం జరగాలని నిర్ణయంచబడింది.

27 ఆ పరిపాలకుడు ఒక ‘ఏడు’ కోసం చాలా మందితో నిబంధన నెలకొల్పుతాడు. అయితే ఆ ‘ఏడు’ సగం గడిచాక, బలిని, నైవేద్యాన్ని నిలిపివేస్తాడు. అతని మీద శాసించబడిన అంతం కుమ్మరించబడేవరకు, మందిరం దగ్గర వినాశనం కలిగించే హేయమైన దానిని నిలుపుతాడు.”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan