Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

దానియేలు 8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


దానియేలుకు వచ్చిన పొట్టేలు, మేక దర్శనం

1 రాజైన బెల్షస్సరు పరిపాలనలోని మూడవ సంవత్సరంలో, దానియేలు అనే నాకు ముందు వచ్చిన దర్శనం కాకుండా మరో దర్శనం వచ్చింది.

2 నేను దర్శనం చూస్తూ ఉన్నప్పుడు ఏలాము సామ్రాజ్యంలోని షూషను కోటలో ఉన్న నేను, దర్శనంలో ఊలయి కాలువ దగ్గర ఉన్నట్లు చూశాను.

3 నేను కళ్ళెత్తి చూడగా ఆ కాలువ ప్రక్కన రెండు కొమ్ములున్న ఒక పొట్టేలు ఉంది, ఆ కొమ్ములు పొడువుగా ఉన్నాయి. ఆ కొమ్ములలో ఒకటి రెండవ దానికంటే పొడువుగా ఉంది కాని అది తర్వాత మొలిచింది.

4 నేను చూస్తుండగా ఆ పొట్టేలు పడమర, ఉత్తర, దక్షిణాల వైపు కొమ్ములతో పొడుస్తూ ఉంది. దాని ఎదుట ఏ జంతువు నిలబడలేక పోయింది, దాని శక్తి నుండి ఏది తప్పించుకోలేదు. అది తన ఇష్టానుసారంగా చేస్తూ గొప్పగా అయ్యింది.

5 నేను దాని గురించి ఆలోచిస్తుండగా, అకస్మాత్తుగా పడమటి నుండి కళ్ల మధ్యలో పెద్ద కొమ్ము ఉన్న ఒక మేకపోతు వచ్చి, కాళ్లు నేలను తాకించకుండా భూమంతా పరుగు పెట్టింది.

6 ఆ మేకపోతు కాలువ ఒడ్డున నేను చూసిన రెండు కొమ్ముల పొట్టేలు వైపు వచ్చి తీవ్రమైన కోపంతో బలంగా దానివైపు పరుగెత్తింది.

7 అది పొట్టేలుపై ఆవేశంగా దాడి చేసి, దాని రెండు కొమ్ములను విరగ్గొట్టింది. దాని ఎదుట పొట్టేలు నిలువలేకపోయింది; మేకపోతు దాన్ని క్రింద పడేసి త్రొక్కేసింది, దాని శక్తి నుండి పొట్టేలును ఎవరూ రక్షించలేకపోయారు.

8 మేకపోతు ఎంతో గొప్పగా అయ్యింది, కాని దాని అధికారం ఉన్నత స్థితిలో ఉండగా, దాని పెద్ద కొమ్ము విరిగిపోయింది, దాని స్థానంలో నాలుగు పెద్ద కొమ్ములు పైకి వచ్చి ఆకాశం నాలుగు వైపులకు పెరిగాయి.

9 వాటిలో ఒకదాని నుండి మరో కొమ్ము వచ్చింది, అది చిన్నగా ప్రారంభమై దక్షిణం, తూర్పుకు, సుందరమైన దేశం వైపు బలంతో వ్యాపించింది.

10 అది ఆకాశ సమూహాన్ని చేరేవరకు పెరిగి కొన్ని నక్షత్ర సమూహాలను భూమిపై పడేసి, వాటిని త్రొక్కింది.

11 యెహోవా సైన్యం యొక్క అధిపతికి సమానంగా తనను తాను హెచ్చించుకుంది; యెహోవా నుండి అనుదిన అర్పణలను నిలిపివేసింది, ఆయన పరిశుద్ధాలయాన్ని పడద్రోసింది.

12 దాని తిరుగుబాటును బట్టి, యెహోవా ప్రజలు, అనుదిన అర్పణలు దానికి ఇవ్వబడ్డాయి. అది సత్యాన్ని నేలపాలు చేసి ఇష్టం వచ్చినట్లు చేస్తూ వర్థిల్లింది.

13 అప్పుడు ఒక పరిశుద్ధుడు మాట్లాడడం నేను చూశాను, మరో పరిశుద్ధుడు అతనితో, “అనుదిన అర్పణలు, నాశనానికి కారణమైన తిరుగుబాటు, పరిశుద్ధాలయాన్ని లోబరచుకోవడం, యెహోవా ప్రజలు పాదాల క్రింద త్రొక్కబడుతున్న ఈ దర్శనం నెరవేరడానికి ఎంతకాలం పడుతుంది?” అన్నాడు.

14 అతడు నాతో, “దానికి 2,300 ఉదయ సాయంత్రాలు పడుతుంది; తర్వాత పరిశుద్ధాలయం తిరిగి పవిత్రపరచబడుతుంది.”


దర్శనం యొక్క భావం

15 దానియేలు అనే నేను ఆ దర్శనం చూసి దానిని గ్రహించుకునే ప్రయత్నం చేస్తుండగా, నా ఎదుట మనిషిలా ఉన్న ఒకడు నిలబడ్డాడు.

16 అప్పుడు ఊలయి కాలువ నుండి, “గబ్రియేలూ, ఆ దర్శనాన్ని గ్రహించేలా ఈ మనుష్యునికి చెప్పు” అని అంటూ ఒక స్వరం అనడం విన్నాను.

17 అతడు నేను నిలుచున్న చోటికి రాగానే, నేను భయపడి సాగిలపడ్డాను. “మనుష్యకుమారుడా, అంత్యకాలం గురించిన దర్శనాన్ని గ్రహించు” అని అతడు నాతో అన్నాడు.

18 అతడు నాతో మాట్లాడుతున్నప్పుడు, నేను గాఢనిద్రలో నేల మీద సాష్టాంగపడ్డాను. అప్పుడు అతడు నన్ను ముట్టి నన్ను నిలబెట్టాడు.

19 అతడు అన్నాడు: “ఉగ్రత కాలంలో ఏం జరగబోతుందో నీకు చెప్పబోతున్నాను, ఎందుకంటే, దర్శనం నిర్ణీతమైన అంత్య కాలానికి సంబంధించింది.

20 నీవు చూసిన రెండు కొమ్ముల పొట్టేలు మెదీయ, పర్షియా రాజులను సూచిస్తుంది.

21 బొచ్చుగల మేకపోతు గ్రీసు దేశపు రాజును, దాని కళ్ల మధ్య ఉన్న పెద్ద కొమ్ము దాని మొదటి రాజును సూచిస్తుంది.

22 ఆ కొమ్ము స్థానంలో వచ్చిన నాలుగు కొమ్ములు అతని దేశం నుండి లేచే నాలుగు రాజ్యాలను సూచిస్తుంది, కాని వాటికి మొదటి రాజుకు ఉన్నంత బలం ఉండదు.

23 “వారి పరిపాలనలోని చివరి భాగంలో, తిరుగుబాటుదారులు పూర్తిగా దుష్టులైనప్పుడు, భయంకరంగా కనిపించే రాజు, కుట్రలో ఆరితేరినవాడు లేస్తాడు.

24 అతడు ఎంతో బలవంతుడవుతాడు, కాని తన సొంత శక్తి ద్వారా కాదు. అతడు స్తంభింపజేసే విధ్వంసాలు చేస్తాడు, అతడు చేసే ప్రతీ దాంట్లో జయం పొందుతాడు.అతడు బలాఢ్యులను, పరిశుద్ధులను నాశనం చేస్తాడు.

25 అతడు యుక్తి గలవాడై మోసం చేసి తనకు లాభం కలిగేలా చూసుకుంటాడు. క్షేమంగా ఉన్నామని వారు అనుకున్నప్పుడు, అతడు ఎంతోమందిని నాశనం చేస్తాడు, రాజాధిరాజుతో యుద్ధం చేస్తాడు. కాని చివరకు అతడు నాశనమవుతాడు, అయితే మానవ శక్తి ద్వారా కాదు.

26 “ఉదయ సాయంత్రాల గురించి నీకు ఇవ్వబడిన దర్శనం నిజమైనది, కాని దానిని రహస్యంగా ఉంచాలి, ఎందుకంటే అది చాలా కాలం తర్వాత జరిగేది.”

27 దానియేలు అనే నేను నీరసించిపోయాను, కొన్ని రోజులు అనారోగ్యంతో ఉన్నాను. తర్వాత నేను లేచి రాజు పనులలో ఉన్నాను. దర్శనాన్ని బట్టి నేను ఆందోళన చెందాను; అది గ్రహింపుకు మించింది.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan