దానియేలు 7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథందానియేలుకు వచ్చిన నాలుగు మృగాల కల 1 బబులోను రాజైన బెల్షస్సరు పరిపాలనలోని మొదటి సంవత్సరంలో, దానియేలు తన పడక మీద పడుకుని ఉన్నప్పుడు అతనికి ఒక కల వచ్చింది, దర్శనాలు తన మనస్సులో కలిగాయి. అతడు తన కలను ఇలా సంక్షిప్తంగా వ్రాశాడు. 2 దానియేలు, “రాత్రివేళ నా దర్శనంలో నేను తేరిచూడగా నా ఎదుట ఆకాశం నాలుగు వైపుల నుండి గాలులు వీచి మహా సముద్రాన్ని కదిలించాయి. 3 అప్పుడు సముద్రంలో నుండి నాలుగు గొప్ప మృగాలు పైకి లేచాయి, ఇవి ఒక దానికి ఒకటి భిన్నంగా ఉన్నాయి. 4 “మొదటి మృగం సింహంలా ఉంది, దానికి గ్రద్ద రెక్కలవంటి రెక్కలున్నాయి. దాని రెక్కలు తీసివేయగా అది మనిషిలా రెండు కాళ్లమీద నిలబడడం చూశాను, దానికి మనిషి మనస్సు ఇవ్వబడింది. 5 “తర్వాత నా ఎదుట రెండవ మృగం ఎలుగుబంటిలా ఉంది. అది ఒకవైపు ఎత్తుగా ఉండి దాని నోటి పళ్ల మధ్యలో మూడు ప్రక్కటెముకలు ఉన్నాయి. ‘లేచి నీవు తినగలిగినంత మాంసం తిను!’ అని దానికి చెప్పబడింది. 6 “ఆ తర్వాత నాకు చిరుతపులిలా ఉన్న ఇంకొక మృగం కనిపించింది. దాని వీపుకు పక్షి రెక్కలవంటి నాలుగు రెక్కలున్నాయి. ఈ మృగానికి నాలుగు తలలు ఉన్నాయి, పరిపాలించడానికి దీనికి అధికారం ఇవ్వబడింది. 7 “దాని తర్వాత రాత్రివేళ నా దర్శనంలో నేను చూస్తుండగా నాలుగవ మృగం కనిపించింది. అది భయానకంగా, భయం కలిగించేదిగా, మహా శక్తి కలిగి ఉంది. దానికి పెద్ద ఇనుప పళ్లున్నాయి; అది దాని బాధితులను నలిపి మ్రింగివేసి, మిగిలిన దానిని కాళ్లక్రింద త్రొక్కేసింది. అంతకుముందు కనిపించిన మృగాల కంటే అది భిన్నమైనది, దానికి పది కొమ్ములున్నాయి. 8 “నేను కొమ్ముల గురించి ఆలోచిస్తుండగా వాటి మధ్య నుండి మరొక చిన్న కొమ్ము పైకి వచ్చింది. మొదటి మూడు కొమ్ములు దాని ఎదుట నుండి పెరికివేయబడ్డాయి. ఈ కొమ్ముకు మనిషిలాంటి కళ్లు, గర్వంగా మాట్లాడే నోరు ఉన్నాయి. 9 “నేను చూస్తుండగా, “సింహాసనాలు వాటి స్థానాల్లో వేయబడ్డాయి, వాటిపై మహా వృద్ధుడు కూర్చున్నారు. ఆయన వస్త్రం మంచులా తెల్లగా, ఆయన తలవెంట్రుకలు శుద్ధమైన తెల్లని గొర్రె ఉన్నిలా ఉన్నాయి. ఆయన సింహాసనం అగ్నిలా మండుతూ ఉంది, దాని చక్రాలు మండుతూ ఉన్నాయి. 10 ఆయన ఎదుట నుండి అగ్ని నది ప్రవహిస్తూ వస్తుంది, వేవేలకొలది ఆయనకు సేవ చేస్తున్నారు; పదివేలకొలది ఆయన ఎదుట నిలబడ్డారు, న్యాయసభ మొదలైంది, గ్రంధాలు విప్పారు. 11 “అప్పుడు నేను చూస్తుండగా ఆ చిన్న కొమ్ము గర్వంగా మాట్లాడినందుకు ఆ జంతువు చంపబడింది. దాని శవం నాశనం చేయబడి మండుతున్న అగ్నిలో పడవేయబడింది. 12 (ఇతర మృగాల తమ అధికారం కోల్పోయాయి, కాని కొంతకాలం వరకు బ్రతకడానికి అనుమతించబడ్డాయి.) 13 “రాత్రి దర్శనంలో నేను చూస్తుండగా మనుష్యకుమారునిలా ఉన్న ఒక వ్యక్తి మేఘాల మీద నా ముందుకు వచ్చాడు. అతడు మహా వృద్ధుని సముఖంలోకి వచ్చాడు. 14 ఆయనకు అధికారం, మహిమ, సర్వ శక్తి ఇవ్వబడ్డాయి; సర్వ దేశాలు, వివిధ భాషల ప్రజలు ఆయనను ఆరాధించారు. ఆయన అధికారం శాశ్వతమైనది అది ఎన్నడు గతించిపోదు. ఆయన రాజ్యం ఎన్నటికి నాశనం కాదు. కల భావం 15 “దానియేలు అనే నేను ఆత్మలో ఆందోళన చెందాను, నాకు వచ్చిన దర్శనాల నన్ను కలవరపరిచాయి. 16 అక్కడ నిలబడివున్న వారిలో ఒకని దగ్గరకు వెళ్లి, దీనంతటి అర్థం చెప్పమని అడిగాను. “కాబట్టి అతడు నాతో మాట్లాడి ఈ సంగతుల భావం ఇలా తెలియజేశాడు: 17 ‘ఆ నాలుగు మహా మృగాలు భూలోకాన్ని పాలించే నలుగురు రాజులు. 18 కాని, సర్వోన్నతుని పరిశుద్ధులే రాజ్యాన్ని పొందుకుంటారు, వారి రాజ్యమే యుగయుగాలకు శాశ్వతంగా నిలిచి ఉంటుంది.’ 19 “అప్పుడు నేను ఆ నాలుగవ మృగం గురించిన భావం తెలుసుకోవాలని కోరాను. అది మిగతా మృగాలన్నిటికంటే భిన్నంగా, అతి భయంకరంగా ఉంది, దాని పళ్లు ఇనుపవి, దాని పంజా ఇత్తడిది. ఆ మృగం దాని బాధితులను నలిపి మ్రింగివేసి, మిగిలిన దానిని కాళ్లక్రింద త్రొక్కేసింది. 20 దాని తలమీద ఉన్న పది కొమ్ముల గురించి, వాటి మధ్య నుండి లేచిన మొదట ఉన్న మూడు కొమ్ములను పడగొట్టిన చిన్న కొమ్ము గురించి కూడా తెలుసుకోవాలనుకున్నాను. అది ఇతర కొమ్ముల కంటే గంభీరంగా కనిపిస్తూ, కళ్లు, గర్వంగా మాట్లాడు నోరు గలది. 21 నేను చూస్తుండగా, ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేస్తూ వారిని ఓడిస్తూ ఉంది, 22 మహా వృద్ధుడు వచ్చి సర్వోన్నతుని పరిశుద్ధుల పక్షంగా తీర్పు చెప్పే వరకు అది అలా చేసింది. కాని సమయం వచ్చినప్పుడు వారు రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. 23 “అతడు ఇలా వివరించాడు: ‘నాలుగవ మృగం భూలోకంలోని నాలుగవ రాజ్యము. అది ఇతర రాజ్యాలకు భిన్నంగా ఉంటూ, సర్వ లోకాన్ని త్రొక్కుతూ, నాశనం చేస్తూ మ్రింగివేస్తుంది. 24 పది కొమ్ములు ఈ రాజ్యంలో నుండి వచ్చే పదిమంది రాజులు. వారి తర్వాత మరో రాజు వస్తాడు, అతడు ముందున్న వారికంటే భిన్నమైనవాడు; అతడు ముగ్గురు రాజులను లోబరచుకుంటాడు. 25 అతడు సర్వోన్నతునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఆయన పరిశుద్ధులను హింసిస్తూ, పండుగ కాలాలను, శాసనాలను మార్చే ప్రయత్నం చేస్తాడు. పరిశుద్ధులు ఒక కాలం, కాలాలు, సగం కాలం అతని చేతికి అప్పగించబడతారు. 26 “ ‘అయితే తీర్పు తీర్చబడి అతని అధికారం తీసివేయబడుతుంది, ఎప్పటికీ పూర్తిగా నిర్మూలం చేయబడుతుంది. 27 అప్పుడు ఆకాశం క్రిందున్న అన్ని రాజ్యాల అధికారం, శక్తి, మహాత్యం, సర్వోన్నతుని పరిశుద్ధులకు ఇవ్వబడుతుంది. ఆయన రాజ్యం శాశ్వతం రాజ్యం, అధికారులందరు ఆయనను ఆరాధిస్తూ, ఆయనకు లోబడతారు.’ 28 “ఇది ఆ విషయానికి ముగింపు. దానియేలు అనే నేను నా తలంపులలో ఆందోళన చెందాను, నా ముఖం పాలిపోయింది, కాని నేను ఈ విషయాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను.” |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.