Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

దానియేలు 5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


గోడ మీద వ్రాత

1 బెల్షస్సరు రాజు తన వేయిమంది ప్రముఖులకు గొప్ప విందు ఏర్పాటు చేసి వారితో కలిసి ద్రాక్షరసం త్రాగాడు.

2 బెల్షస్సరు ద్రాక్షరసం త్రాగుతున్నప్పుడు, తన తండ్రియైన నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. రాజు, తన ప్రముఖులు, తన భార్యలు, తన ఉంపుడుగత్తెలు వాటిలో ద్రాక్షరసం త్రాగాలని అనుకున్నాడు.

3 కాబట్టి వారు యెరూషలేములోని దేవుని మందిరంలో నుండి తెచ్చిన బంగారు గిన్నెలు తీసుకురాగా రాజు, అతని ప్రముఖులు, అతని భార్యలు, అతని ఉపపత్నులు వాటిలో త్రాగారు.

4 వారు ద్రాక్షరసం త్రాగుతూ, తమ బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అనే వాటితో చేసిన దేవుళ్ళను స్తుతించారు.

5 అకస్మాత్తుగా మనిషి చేతివ్రేళ్లు కనిపించాయి, అవి దీపస్తంభానికి ఎదురుగా రాజభవనం గోడ మీద ఆ చేయి వ్రాస్తుండగా రాజు చూశాడు.

6 అప్పుడు రాజు ముఖం తెల్లబోయింది, భయంతో అతని మోకాళ్లు వణుకుతూ కొట్టుకున్నాయి.

7 రాజు శకునగాళ్లను, కల్దీయ జ్యోతిష్యులను, సోదె చెప్పేవారిని పిలిపించగా వచ్చిన బబులోను జ్ఞానులతో అతడు ఇలా అన్నాడు, “ఎవరైనా ఈ గోడ మీద రాత చదివి, దాని భావం నాకు చెప్తే, అతనికి ఊదా రంగు వస్త్రాలు తొడిగించి, తన మెడలో బంగారు గొలుసు వేసి, రాజ్యంలో మూడవ అధికారిగా చేస్తాము.”

8 అప్పుడు రాజు యొక్క జ్ఞానులందరు వచ్చారు, కాని గోడ మీద ఆ రాతను చదవలేకపోయారు, దాని అర్థం చెప్పలేకపోయారు.

9 కాబట్టి బెల్షస్సరు రాజు ఇంకా భయపడ్డాడు, అతని ముఖం ఇంకా పాలిపోయింది. అతని అధికారులు కలవరపడ్డారు.

10 రాజు, అతని అధికారుల స్వరాలు విని, రాణి విందుశాలకు వచ్చింది, “రాజు చిరకాలం జీవించు గాక! కలవరపడకండి! నిబ్బరంగా ఉండండి! అని ఆమె అన్నది.

11 మీ రాజ్యంలో పవిత్ర దేవుళ్ళ ఆత్మ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. మీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం, వివేకం, తెలివితేటలు కలిగినవానిగా గుర్తించబడ్డాడు. మీ తండ్రియైన నెబుకద్నెజరు రాజు అతన్ని మాంత్రికులు, శకునగాళ్లు, కల్దీయ జ్యోతిష్యులు, సోదె చెప్పేవారి మీద అధిపతిగా నియమించాడు.

12 ఎందుకంటే బెల్తెషాజరు అని రాజుచేత పిలువబడే దానియేలుకు చురుకైన మనస్సు, వివేకం, జ్ఞానం కలిగి, కలల భావాలు చెప్పడానికి, మర్మాలు వివరించడానికి, కఠినమైన ప్రశ్నలను పరిష్కరించడానికి సామర్థ్యం గలవాడు. ఆ దానియేలును పిలిపించండి, అతడు ఈ వ్రాతకు అర్థం మీకు చెప్తాడు.”

13 కాబట్టి దానియేలును రాజు సముఖానికి తీసుకువచ్చారు. రాజు దానియేలుతో ఇలా అన్నాడు, “నా తండ్రి యూదా నుండి తెచ్చిన బందీలలో ఒకడివైన దానియేలు నీవేనా?

14 నీలో దేవుళ్ళ ఆత్మ ఉందని, దైవ జ్ఞానం, వివేకం, విశేష జ్ఞానం ఉన్నాయని నేను విన్నాను.

15 గోడ మీద ఈ వ్రాత చదివి, దాని అర్థం నాకు చెప్పడానికి జ్ఞానులను, మాంత్రికులను పిలిపించాను, కాని వారెవరు అర్థం చెప్పలేకపోయారు.

16 ఇప్పుడు నీవు భావాలు చెప్పగలవని, కఠిన ప్రశ్నలను పరిష్కరించగలవని నేను విన్నాను. ఈ వ్రాత చదివి దాని అర్థం నాకు చెప్తే, నీకు ఊదా రంగు వస్ర్తం తొడిగించి, నీ మెడకు బంగారు గొలుసు వేసి, నిన్ను రాజ్యంలో మూడవ అధికారిగా చేస్తాను.”

17 అప్పుడు దానియేలు రాజుకు జవాబిస్తూ, “మీ కానుకలు మీరే ఉంచుకోండి, మీ బహుమానాలు ఎవరికైనా ఇవ్వండి. అయితే రాజు కోసం నేను ఈ రాత చదివి, దాని భావం ఏంటో చెప్తాను” అన్నాడు.

18 “రాజా! సర్వోన్నతుడైన దేవుడు నీ తండ్రి నెబుకద్నెజరుకు ఆధిపత్యం, మహాత్యం, ఘనత, వైభవం ప్రసాదించారు.

19 అతనికి ఇచ్చిన ఉన్నత స్థానాన్ని బట్టి అన్ని దేశాలు, వివిధ భాషల ప్రజలందరు అతనికి వణుకుతూ, భయపడేవారు. రాజు చంపాలనుకున్న వారిని చంపేవాడు; వదిలేయాలనుకున్నవారిని వదిలేశాడు; ఉన్నత పదవి ఇవ్వాలనుకున్నవారికి ఉన్నత పదవి ఇచ్చాడు; అవమానించాలని అనుకున్నవారిని అవమానించాడు.

20 అయితే, అతని హృదయం అహంకారంతో నిండింది, గర్వంతో బండబారి పోయింది, అప్పుడు అతడు తన సింహాసనం నుండి త్రోసివేయబడి, తన మహిమను కోల్పోయాడు.

21 అతడు ప్రజల్లో నుండి తరమబడి అతనికి జంతువుల మనస్సు ఇవ్వబడింది; అతడు అడవి గాడిదలతో నివసిస్తూ, ఎద్దులా గడ్డి మేశాడు; సర్వోన్నతుడు భూరాజ్యాల మీద అధికారి అని, ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి వాటిని ఇస్తారని అతడు గుర్తించేవరకు అతని శరీరం ఆకాశం నుండి కురిసే మంచుకు తడిసింది.

22 “అయితే అతని కుమారుడవైన బెల్షస్సరు, ఇదంతా తెలిసినా కూడా నిన్ను నీవు తగ్గించుకోలేదు.

23 పరలోక ప్రభువుకు వ్యతిరేకంగా నిన్ను నీవు గొప్ప చేసుకున్నావు. దేవాలయ పాత్రలను తెప్పించి వాటిలో ద్రాక్షరసం పోసుకొని నీవు, నీ అధికారులు, నీ భార్యలు, నీ ఉంపుడుగత్తెలు త్రాగారు. చూడలేని, వినలేని, గ్రహించలేని వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, కర్ర, రాతి దేవుళ్ళను నీవు స్తుతించావు. కాని నీ జీవితాన్ని, నీ మార్గాలన్నిటిని తన చేతిలో పట్టుకున్న దేవున్ని నీవు గౌరవించలేదు.

24 కాబట్టి ఆయన వ్రాత వ్రాయడానికి ఆ చేతిని పంపారు.

25 “వ్రాయబడిన రాత ఇది: మెనే, మెనే, టెకేల్, ఉఫార్సీన్.

26 “ఈ పదాల అర్థం ఇది: “మెనే: దేవుడు నీ పరిపాలన రోజులను లెక్కించి, నీ పాలనను ముగింపుకు తీసుకువచ్చారు.

27 “టెకేల్: నీవు త్రాసులో తూచబడ్డావు, తక్కువగా ఉన్నట్లు తేలింది.

28 “ఫెరేస్: నీ రాజ్యం విభజింపబడి మాదీయులకు పర్షియా వారికి ఇవ్వబడుతుంది.”

29 అప్పుడు బెల్షస్సరు ఆజ్ఞమేరకు, దానియేలుకు ఊదా రంగు వస్ర్తం తొడిగించారు, అతని మెడలో బంగారు గొలుసు వేశారు, అతన్ని రాజ్యంలో మూడవ అధికారిగా ప్రకటించారు.

30 అదే రాత్రి కల్దీయుల రాజైన బెల్షస్సరు చంపబడ్డాడు,

31 మాదీయుడైన దర్యావేషు అరవై రెండేళ్ళ వయస్సులో రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan