Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ఆమోసు 9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


ఇశ్రాయేలు నాశనం

1 బలిపీఠం దగ్గర ప్రభువు నిలబడి ఉండడం నేను చూశాను, ఆయన ఇలా అన్నారు: “గడపలు కదిలి పోయేలా, స్తంభాల పైభాగాలను కొట్టు. వాటిని ప్రజలందరి తలల మీద పడవేయు; మిగిలిన వారిని నేను ఖడ్గంతో హతం చేస్తాను. ఒక్కడు కూడా పారిపోలేడు, ఎవ్వడూ తప్పించుకోలేడు.

2 వారు పాతాళం లోతుల్లోనికి త్రవ్వుకొని వెళ్లినా, అక్కడినుండి నా చేయి వారిని తీసుకుంటుంది. వారు పైనున్న ఆకాశాల పైకి ఎక్కినా, అక్కడినుండి వారిని క్రిందికి తీసుకువస్తాను.

3 వారు కర్మెలు పర్వత శిఖరాన దాక్కున్నా, అక్కడ నేను వారిని వెంటబడి పట్టుకుంటాను. నా కళ్లకు కనిపించకుండా వారు సముద్రపు అడుగుభాగంలో దాక్కున్నా, అక్కడ వారిని కరవమని సర్పానికి ఆజ్ఞ ఇస్తాను.

4 శత్రువులు వారిని బందీలుగా దేశాంతరం తీసుకెళ్లినా, అక్కడ వారిని చంపమని ఖడ్గానికి ఆజ్ఞ ఇస్తాను. “నా చూపు వారి మీద నిలుపుతాను, అది కీడుకోసమే కాని మేలుకోసం కాదు.”

5 సైన్యాల అధిపతియైన యెహోవా ఆయన భూమిని ముట్టగా అది కరిగిపోతుంది, భూనివాసులు అందరు విలపిస్తారు; దేశమంతా నైలు నదిలా పొంగుతుంది, ఈజిప్టు నదిలా అణగిపోతుంది.

6 ఆయన ఆకాశాల్లో తన ఉన్నత రాజభవనాన్ని కట్టుకుంటారు, దాని పునాదిని భూమి మీద నిర్మిస్తారు. ఆయన సముద్రం నీటిని పిలిపించి భూమి మీద కుమ్మరిస్తారు, ఆయన పేరు యెహోవా.

7 “ఇశ్రాయేలీయులైన మీరు నా దృష్టికి కూషు దేశస్థులతో సమానం కారా?” అని యెహోవా అంటున్నారు. “నేను ఇశ్రాయేలును ఈజిప్టు నుండి, ఫిలిష్తీయులను కఫ్తోరు నుండి, అరామీయులను కీరు నుండి తీసుకురాలేదా?

8 “నిజంగా ప్రభువైన యెహోవా కళ్లు పాపిష్ఠి రాజ్యం మీద ఉన్నాయి. నేను దాన్ని భూమి మీద ఉండకుండ నాశనం చేస్తాను. అయినా యాకోబు సంతానాన్ని సంపూర్ణంగా నాశనం చేయను,” అని యెహోవా అంటున్నారు.

9 “నేను ఆజ్ఞ ఇస్తాను, మనిషి ధాన్యం జల్లెడలో వేసి, ఒక్క గింజ కూడా నేల పడకుండా జల్లించే విధంగా, ఇశ్రాయేలు ప్రజలను అన్ని దేశాల వారి మధ్య జల్లిస్తాను.

10 నా ప్రజల్లోని పాపులందరు ‘విపత్తు మనల్ని తరమదు, మన మీదికి రాదు’ అని అనుకునే వారందరు, ఖడ్గానికి గురై చస్తారు.


ఇశ్రాయేలు పునరుద్ధరణ

11 “ఆ రోజున, “పడిపోయిన దావీదు గుడారాన్ని నేను తిరిగి కడతాను, నేను దాని విరిగిన గోడలను మరమ్మత్తు చేసి, దాని శిథిలాలను తిరిగి నిర్మిస్తాను, మునుపు ఉండినట్లుగా దాన్ని తిరిగి కడతాను.

12 అలా వారు ఎదోము జనంలో మిగిలిన వారిని, నా నామం కలిగిన యూదేతరులనందరినీ స్వాధీనం చేసుకుంటారు,” అని ఈ కార్యాలన్ని చేసే యెహోవా అంటున్నారు.

13 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “రాబోయే రోజుల్లో పంట కోసేవారిని దున్నేవాడు దాటిపోతాడు, నాటే వారిని ద్రాక్ష పండ్లు త్రొక్కేవాడు దాటిపోతాడు, నూతన ద్రాక్షరసం పర్వతాలమీద నుండి, అన్ని కొండల నుండి ప్రవహిస్తుంది.

14 నేను నా ఇశ్రాయేలు ప్రజలను బందీల నుండి తిరిగి తీసుకువస్తాను. “వారు శిథిలమైన పట్టణాలను పునర్నిర్మించుకుని వాటిలో నివసిస్తారు. వారు ద్రాక్షతోటలు వేసి వాటి ద్రాక్షరసం త్రాగుతారు; వారు వనాలు నాటి వాటి పండ్లు తింటారు.

15 నేను ఇశ్రాయేలును తమ స్వదేశంలో నాటుతాను, నేను వారికిచ్చిన దేశంలో నుండి వారు ఇక ఎన్నడు పెళ్లగించబడరు,” అని మీ దేవుడైన యెహోవా చెప్తున్నారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan