ఆమోసు 6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంసంతృప్తి గలవారికి శ్రమ 1 సీయోనులో సంతృప్తిగా ఉన్నవారికి శ్రమ, సమరయ పర్వతం మీద ఆధారపడి ఉన్న మీకు శ్రమ, ఇశ్రాయేలు ప్రజలకు సలహాదారులుగా ఉన్న, గొప్ప దేశాల్లో ప్రముఖులైన మీకు శ్రమ! 2 మీరు కల్నేకు వెళ్లి చూడండి; అక్కడినుండి హమాతుకు వెళ్లండి, తర్వాత ఫిలిష్తీయలోని గాతుకు వెళ్లండి. మీ రెండు రాజ్యాల కంటే అవి గొప్పవా? వాటి నేల మీకంటే పెద్దది కాదా? 3 ఆపద్దినం దూరంగా ఉందనుకుని, దౌర్జన్య పరిపాలనను త్వరగా రప్పిస్తున్నారు. 4 మీరు దంతపు మంచాల మీద పడుకుంటారు, పరుపులపై ఆనుకుంటారు. శ్రేష్ఠమైన గొర్రెపిల్లలను, శాలలోని క్రొవ్విన దూడలను మీరు తింటారు. 5 మీరు దావీదులా సితారా వాయిస్తూ వాయిద్యాలు మెరుగుపరుస్తారు. 6 మీరు ద్రాక్షరసం పాత్ర నిండా నింపుకొని త్రాగుతారు, పరిమళ తైలాలు పూసుకుంటారు, కాని మీరు యోసేపు నాశనం గురించి విచారపడరు. 7 కాబట్టి బందీలుగా మొదట దేశాంతరం పోయే వారిలో మీరు ఉంటారు; మీ ఉత్సవాలు, మీ విలాసాలు గతించిపోతాయి. యెహోవా ఇశ్రాయేలు గర్వాన్ని అణచివేయుట 8 ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణం చేసి, సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “నేను యాకోబు గర్వాన్ని అసహ్యించుకుంటున్నాను అతని కోటలను ద్వేషిస్తున్నాను; నేను పట్టణాన్ని దానిలో ఉన్న అంతటితో శత్రువు వశం చేస్తాను.” 9 ఒక్క కుటుంబంలో పదిమంది మిగిలి ఉన్నా, 10 ఆ శవాలను ఇంట్లోనుండి తీసుకుపోయి వాటిని దహనం చేయడానికి వచ్చిన బంధువు ఇంట్లో దాక్కొని ఉన్నవానితో, “నీతో ఇంకెవరైన ఉన్నారా?” అని అడిగితే, “లేదు” అని అతడు చెప్తే, “మాట్లాడకు, మనం యెహోవా పేరును ప్రస్తావించకూడదు” అని అంటాడు. 11 ఎందుకంటే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా, పెద్ద కుటుంబాలు ముక్కలుగా విడిపోతాయి చిన్నా కుటుంబాలు చీలిపోతాయి. 12 గుర్రాలు బండ మీద పరుగెత్తుతాయా? బండ మీద ఎవరైనా ఎద్దులతో దున్నుతారా? కాని న్యాయాన్ని విషంగా మార్చారు, నీతి ఫలాన్ని చేదుగా మార్చారు. 13 లో దెబారును జయించి ఆనందిస్తున్న మీరు, “మా సొంత బలంతోనే కర్నాయీమును పట్టుకోలేదా?” అంటారు. 14 అయితే సైన్యాల యెహోవా దేవుడు ఇలా అంటున్నారు, “ఇశ్రాయేలూ, నేను నీ మీదికి ఒక దేశాన్ని రప్పిస్తాను, అది నిన్ను హమాతు మొదలుకొని అరాబా లోయవరకు ఆ అరణ్య మార్గమంతా నిన్ను హింసిస్తుంది.” |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.