Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ఆమోసు 5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


విలాపం పశ్చాత్తాపానికి పిలుపు

1 ఇశ్రాయేలూ! ఈ మాట విను, ఇది మిమ్మల్ని గురించి విలాప వాక్కు:

2 “ఇశ్రాయేలు కన్య పడిపోయింది, ఆమె మరి ఎన్నడు లేవదు, ఆమెను లేపడానికి ఎవరూ లేక తన సొంత నేలపై పడి ఉంది.”

3 ప్రభువైన యెహోవా ఇశ్రాయేలుతో చెప్పే మాట ఇదే: “నీ పట్టణం నుండి వేయిమంది బలమైన వారు బయలుదేరితే, వందమంది మాత్రమే మిగులుతారు. నీ పట్టణం నుండి వందమంది బలమైన వారు బయలుదేరితే పదిమంది మాత్రమే మిగులుతారు.”

4 యెహోవా ఇశ్రాయేలుతో చెప్పే మాట ఇదే: “నన్ను వెదికితే బ్రతుకుతారు.

5 బేతేలును ఆశ్రయించకండి; గిల్గాలు క్షేత్రాలకు వెళ్లకండి, బెయేర్షేబకు ప్రయాణించకండి. గిల్గాలు ప్రజలు ఖచ్చితంగా బందీలుగా వెళ్తారు, విపత్తులతో బేతేలు శూన్యంగా మారుతుంది.”

6 యెహోవాను వెదకండి మీరు బ్రతుకుతారు, లేదంటే యోసేపు గోత్రాల మీద ఆయన అగ్నిలా పడతారు; అది వారిని కాల్చివేస్తుంది బేతేలులో దాన్ని ఆర్పివేయగల వారెవరూ ఉండరు.

7 వారు న్యాయాన్ని చేదుగా మార్చి నీతిని నేల మీద పడవేస్తారు.

8 ఆయన సప్తర్షి నక్షత్రాలను మృగశీర్ష నక్షత్రాలను సృష్టించారు, ఆయన మధ్యరాత్రిని ఉదయంగా మారుస్తారు, పగటిని చీకటి చేస్తారు. ఆయన సముద్రంలోని నీటిని రప్పించి. భూమి మీద కుమ్మరిస్తారు ఆయన పేరు యెహోవా.

9 ఆయన మెరుపు వేగంతో దుర్గాన్ని నాశనం చేస్తారు, వారి కోటగల పట్టణాన్ని నాశనం చేస్తారు.

10 న్యాయస్థానంలో న్యాయం కోసం నిలబడే వారిని యథార్థంగా మాట్లాడేవారిని ద్వేషించేవారు మీలో ఉన్నారు.

11 మీరు బీదలను అణగద్రొక్కుతూ, వారి ధాన్యం మీద పన్ను వేస్తారు. కాబట్టి మీరు రాళ్లతో భవనాలను కట్టుకున్నా, వాటిలో కాపురముండరు; అందమైన ద్రాక్షతోటలు నాటినా మీరు ఆ పండ్ల రసం త్రాగరు.

12 ఎందుకంటే మీ అపరాధాలు ఎన్ని ఉన్నాయో మీ పాపాలు ఎంత ఘోరమైనవో నాకు తెలుసు. మీరు లంచాలు తీసుకుని అమాయకులను బాధిస్తారు, న్యాయస్థానంలో వచ్చే బీదలకు న్యాయం జరగనివ్వరు.

13 ఇది చెడుకాలం కాబట్టి, అలాంటి సమయాల్లో వివేకవంతులు మౌనంగా ఉంటారు.

14 చెడును విడిచిపెట్టి మంచిని వెదకండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. అప్పుడు ఆయన గురించి మీరనుకున్న విధంగా సైన్యాల యెహోవా దేవుడు మీతో ఉంటారు.

15 చెడును ద్వేషించి మంచిని ప్రేమించండి; న్యాయస్థానాల్లో న్యాయం జరిగించండి. బహుశ సైన్యాల యెహోవా దేవుడు, యోసేపు వంశంలో మిగిలి ఉన్నవారిపై దయ చూపిస్తారేమో.

16 కాబట్టి ప్రభువు, సైన్యాల యెహోవా దేవుడు చెప్పే మాట ఇదే: “వీధులన్నిటిలో విలాపం ఉండబోతుంది ప్రతి రాజ మార్గంలో వేదనతో కూడిన ఏడ్పులు. ఏడ్వడానికి రైతులను దుఃఖపడడానికి విలపించేవారిని పిలుస్తారు.

17 ద్రాక్షతోటలన్నిటిలో శోకం ఉంటుంది, ఎందుకంటే నేను మీ మధ్యలో సంచరిస్తాను,” అని యెహోవా అంటున్నారు.


యెహోవా దినం

18 యెహోవా దినం రావాలని ఆశించే మీకు శ్రమ! యెహోవా దినం కోసం ఎందుకు మీరు ఆశిస్తున్నారు? ఆ దినం వెలుగుగా కాదు, చీకటిగా ఉంటుంది.

19 అది ఒక మనిషి సింహం నుండి తప్పించుకుని ఎలుగుబంటి ఎదురు పడినట్లు, అతడు ఇంట్లోకి ప్రవేశించి గోడ మీద చేయి పెడితే పాము కరిచినట్టుగా ఉంటుంది.

20 యెహోవా దినం వెలుగుగా కాకుండా అంధకారంగా ఉంటుంది కదా, ఒక్క కాంతి కిరణం కూడా లేకుండ కారుచీకటిగా ఉంటుంది కదా?

21 “మీ పండుగలంటే నాకు అసహ్యం, వాటిని నేను ద్వేషిస్తాను; మీ సమావేశాల్లో నేను సంతోషించను.

22 మీరు నాకు దహనబలులు, భోజనార్పణలు సమర్పించినా, నేను వాటిని స్వీకరించను. మీరు క్రొవ్విన జంతువులను సమాధానబలులుగా సమర్పించినా, నేను వాటిని లెక్కచేయను.

23 మీ పాటల ధ్వని నా నుండి తీసివేయండి! మీ సితారాల సంగీతం నేను వినను.

24 అయితే న్యాయం నదీ ప్రవాహంలా, నీతి ఎన్నడూ ఎండిపోని కాలువలా ప్రవహించాలి.

25 “ఇశ్రాయేలు ప్రజలారా, అరణ్యంలో నలభై సంవత్సరాలు, మీరు నాకు బలులు, అర్పణలు తెచ్చారా?

26 మీరు మీ సక్కూతు రాజ దేవుని క్షేత్రాన్ని, మీ కైవాన్ విగ్రహాలను, మీ కోసం మోసుకొచ్చారు. అది మీరు మీ కోసం చేసుకుంది.

27 కాబట్టి నేను మిమ్మల్ని దమస్కు అవతలికి బందీలుగా పంపిస్తాను,” అని సైన్యాల దేవుడు అని పేరు కలిగిన యెహోవా అంటున్నారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan