ఆమోసు 4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంఇశ్రాయేలు దేవుని దగ్గరకు తిరిగి రాలేదు 1 సమరయ పర్వతం మీద తిరిగే బాషాను ఆవులారా! దిక్కులేని వారిని బాధిస్తూ, బీదలను అణగద్రొక్కుతూ “మాకు కొంచెం మద్యం తీసుకురండి!” అని భర్తలకు చెప్పే స్త్రీలారా, ఈ మాట వినండి. 2 ప్రభువైన యెహోవా తన పవిత్రత తోడని ప్రమాణం చేశారు: “మిమ్మల్ని కొంకులతో పట్టుకుని, మీలో మిగిలిన వారిని గాలంతో పట్టుకుని తీసుకెళ్లే కాలం ఖచ్చితంగా రాబోతుంది. 3 మీరంతా ప్రాకారాలలో పగుళ్ళ గుండా తిన్నగా పోతారు. మీరు హర్మోను వైపుకు పారవేయబడతారు,” అని యెహోవా చెప్తున్నారు. 4 “బేతేలుకు వెళ్లి పాపం చేయండి; గిల్గాలుకు వెళ్లి ఇంకా ఎక్కువ పాపం చేయండి. ప్రతి ఉదయం మీ బలులు తీసుకరండి, మూడు సంవత్సరాలకు ఒకసారి మీ దశమ భాగాల్ని తీసుకురండి. 5 పులిసిన రొట్టెను కృతజ్ఞతార్పణగా కాల్చండి మీ స్వేచ్ఛార్పణల గురించి ప్రకటించండి. ఇశ్రాయేలీయులారా, వాటి గురించి ప్రకటన చేయండి, ఇలా చేయడం మీకు చాలా ఇష్టం కదా” అని ప్రభువైన యెహోవా అంటున్నారు. 6 “మీ ప్రతి పట్టణానికి తినడానికి ఏమీ దొరక్కుండా చేశాను, ప్రతి పట్టణంలో ఆహారం లేకుండ చేశాను, అయినా మీరు నా వైపు తిరగలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. 7 “కోతకాలానికి మూడు నెలలు ముందు వర్షం కురవకుండా చేశాను, నేను ఒక పట్టణం మీద వర్షం కురిపించి, మరో పట్టణం మీద కురిపించలేదు. ఒక పొలం మీద వర్షం కురిసింది; వర్షం లేనిచోటు ఎండిపోయింది. 8 ప్రజలు నీళ్ల కోసం పట్టణం నుండి పట్టణానికి తడబడుతూ వెళ్లారు కాని వారికి త్రాగడానికి సరిపడా నీళ్లు దొరకలేదు. అయినా మీరు నా వైపు తిరగలేదు” అని యెహోవా అంటున్నారు. 9 “ఎన్నోసార్లు నేను మీ తోటలను, ద్రాక్షతోటలను వడగాలి వల్ల కాటుక తెగుళ్ళ వల్ల పాడు చేశాను. మిడతలు మీ అంజూర చెట్లను ఒలీవ చెట్లను మ్రింగివేశాయి. అయినా మీరు నా వైపు తిరగలేదు” అని యెహోవా అంటున్నారు. 10 “నేను ఈజిప్టు మీదికి రప్పించినట్లు మీ మీదికి తెగుళ్ళు రప్పించాను. మీరు కొల్లగొట్టిన గుర్రాలతో పాటు మీ యువకులను కత్తితో చంపాను. మీ శిబిరాల పుట్టిన దుర్వాసన మీ ముక్కు పుటలను చేరింది. అయినా మీరు నా వైపుకు తిరగలేదు” అని యెహోవా అంటున్నారు. 11 “నేను సొదొమ గొమొర్రా పట్టణాలను పడగొట్టినట్టు మీలో కొంతమందిని పడగొట్టాను. మీరు మంటలో నుండి లాగివేసిన కట్టెలా ఉన్నారు, అయినా మీరు నా వైపుకు తిరగలేదు, అని యెహోవా అంటున్నారు. 12 “కాబట్టి ఇశ్రాయేలూ, నేను నీకు చేసేది ఇదే, ఇశ్రాయేలూ, నేను ఇలా చేస్తాను కాబట్టి నీ దేవుని కలుసుకోడానికి సిద్ధపడు.” 13 పర్వతాలను ఏర్పరచింది గాలిని సృష్టించింది ఆయనే, తన ఆలోచనలను మనుష్యులకు వెల్లడి చేసేది, ఉదయాన్ని చీకటిగా మార్చేది ఆయనే, భూమి ఎత్తైన స్థలాల్లో ఆయన నడుస్తారు ఆయన పేరు దేవుడైన సైన్యాల యెహోవా. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.