Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 తిమోతికి 4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 నేను దేవుని ఎదుట, తాను వచ్చినప్పుడు తన రాజ్యంలో సజీవులకు మృతులకు తీర్పు తీర్చబోయే యేసు క్రీస్తు ఎదుట నీకు ఈ బాధ్యతను ఇస్తున్నాను:

2 ఆతురత కలిగి అనుకూల సమయంలోను అనుకూలంగా లేని సమయంలోను సిద్ధంగా ఉండాలి; ఎంతో సహనంతో, సరియైన సూచనలతో ప్రజలను సరిదిద్దుతూ, గద్దిస్తూ, ప్రోత్సహిస్తూ వాక్యాన్ని ప్రకటించు.

3 ఎందుకంటే, ప్రజలు మంచిబోధను అంగీకరించని ఒక సమయం వస్తుంది. అప్పుడు వారు తమ సొంత ఆశలకు అనుగుణంగా తమ దురద చెవులు వినడానికి ఇష్టపడే వాటినే బోధించే అనేకమంది బోధకులను తమ చుట్టూ చేర్చుకుంటారు.

4 వారు సత్యం నుండి తొలగిపోయి కట్టుకథలు వినడానికి తమ చెవులను అప్పగిస్తారు.

5 కాని నీవైతే అన్ని పరిస్థితుల్లో నిబ్బరం కలిగి కష్టాలను సహిస్తూ సువార్తికుని పని చేస్తూ, నీ పరిచర్య పనులను పూర్తిగా నెరవేర్చు.

6 ఇప్పటికే నేను దేవుని ఎదుట పానార్పణగా పోయబడుతున్నాను. నేను వెళ్లవలసిన సమయం దగ్గరలోనే ఉంది.

7 నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు పందాన్ని ముగించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను.

8 కాబట్టి నీతిమంతుడు న్యాయాధిపతియైన ప్రభువు ఆ రోజున నాకు బహుమతిగా ఇవ్వబోయే నీతి కిరీటం నా కోసం దాచబడి ఉంది. ఈ బహుమానం నాకు మాత్రమే కాదు ఆయన ప్రత్యక్షత కోసం ప్రేమతో ఎదురు చూస్తున్న వారందరికి అనుగ్రహిస్తారు.


తిమోతికి వ్యక్తిగత మాటలు

9 త్వరగా నా దగ్గరకు రావడానికి ప్రయత్నించు.

10 దేమా ఈ లోకాన్ని ప్రేమించి, నన్ను వదిలి థెస్సలొనీక వెళ్లాడు. క్రేస్కే గలతీయకు, తీతు దల్మతీయకు వెళ్లారు.

11 లూకా మాత్రమే నాతో ఉన్నాడు. నా పరిచర్యలో మార్కు నాకు సహాయంగా ఉంటాడు, కాబట్టి అతన్ని నీతో పాటు తీసుకురా.

12 నేను తుకికును ఎఫెసు పట్టణానికి పంపించాను.

13 నీవు వచ్చేటప్పుడు నేను త్రోయలో కర్పు దగ్గర ఉంచిన నా అంగీని, నా పుస్తకాలను మరి ముఖ్యంగా చర్మపు ప్రతులను వెంట తీసుకురా.

14 కంసాలి పని చేసే అలెగ్జాండరు నాకు ఎంతో హాని చేశాడు. అతడు చేసిన పనులకు ప్రభువు వానికి తగిన ప్రతిఫలమిస్తారు.

15 అతడు మన బోధను ఎంతగానో వ్యతిరేకించాడు కాబట్టి నీవు కూడా అతని విషయంలో జాగ్రత్తగా ఉండు.

16 నేను మొదటిసారి న్యాయసభలో నాపై వేయబడిన ఆరోపణలకు జవాబు ఇస్తున్నప్పుడు ఎవరూ నా పక్షాన నిలబడలేదు, అందరు నన్ను వదిలి వెళ్లిపోయారు. అది వారికి వ్యతిరేకంగా ఉండకూడదు

17 కాని నా ప్రభువు నాకు తోడుగా నిలిచి నన్ను బలపరిచారు ఎందుకంటే, నా ద్వారా సువార్త పూర్తిగా ప్రకటించబడి యూదేతరులంతా దానిని వినడానికి దేవుడు నన్ను సింహం నోటి నుండి విడిపించారు.

18 నాకు కలిగే ప్రతి కీడు నుండి ప్రభువు నన్ను కాపాడి తన పరలోక రాజ్యంలోనికి క్షేమంగా చేర్చుకుంటారు. ఆయనకే మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్.


తుది పలుకులు

19 అకుల ప్రిస్కిల్లకు, ఒనేసిఫోరు ఇంటి వారందరికి నా వందనాలు.

20 ఎరస్తు కొరింథులోనే ఉండిపోయాడు, త్రోఫిముకు అనారోగ్యంగా ఉన్నందుకు నేను అతన్ని మిలేతులో వదిలి వచ్చాను.

21 శీతాకాలం రాకముందే నీవు ఇక్కడకు రావడానికి ప్రయత్నించు. యుబూలు నీకు వందనాలు తెలియజేయమన్నాడు, అలాగే పూదే, లీను, క్లౌదియ, ఇక్కడి విశ్వాసులైన సహోదరి సహోదరులందరు తమ వందనాలు నీకు తెలియజేస్తున్నారు.

22 ప్రభువు నీ ఆత్మతో ఉండును గాక. దేవుని కృప నీకు తోడై ఉండును గాక ఆమేన్.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan