Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 థెస్సలొనీకయులకు 1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 తండ్రియైన దేవునికి యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీకయ సంఘానికి, పౌలు, సీల, తిమోతి అనే మేము వ్రాయునది:

2 తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక.


కృతజ్ఞతలు ప్రార్థన

3 సహోదరీ సహోదరులారా, మేము మీ గురించి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించ వలసిందే ఎందుకంటే, మీ విశ్వాసం అంతకంతకు పెరుగుతుంది, మీ అందరికి ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమ మరింత అధికమవుతూ ఉంది.

4 కాబట్టి మీరు పొందుతున్న హింసలలో శ్రమలలో మీరు చూపుతున్న ఓర్పు విశ్వాసం గురించి దేవుని సంఘాల్లో మేము గొప్పగా చెప్తున్నాము.

5 దీన్ని బట్టి దేవుడు ఇచ్చిన తీర్పు న్యాయమైనదని తెలియజేయడానికి రుజువుగా, మీరు అనుభవించిన శ్రమల వలన మీరు దేవుని రాజ్యానికి అర్హులు అవుతారు.

6 దేవుడు న్యాయవంతుడు కాబట్టి మిమ్మల్ని హింసించినవారిని తగిన విధంగా శిక్షిస్తారు,

7 పరలోకం నుండి ప్రభువైన యేసు తన శక్తివంతమైన దూతలతో కలిసి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమైనప్పుడు ఇప్పుడు శ్రమలను అనుభవిస్తున్న మీకు అదే విధంగా మాకు విశ్రాంతిని ఇస్తారు.

8 దేవుని ఎరుగని వారిని, మన ప్రభువైన యేసు యొక్క సువార్తకు లోబడని వారిని ఆయన శిక్షిస్తారు.

9 వారు అనుభవించే శిక్ష నిత్య నాశనంగా ఉంటుంది, అలాంటివారు ప్రభువు సన్నిధి నుండి ఆయన మహాప్రభావం నుండి వెళ్లగొట్టబడతారు,

10 ఆయన వచ్చే దినాన తన పరిశుద్ధ ప్రజలమధ్య మహిమను కనుపరచుకున్నప్పుడు ఆయనను నమ్మినవారందరు ఆశ్చర్యంగా ఆయనను చూస్తారు. మేము మీకు చెప్పిన సాక్ష్యాన్ని మీరు విశ్వసించారు కాబట్టి మీరు కూడా వారిలో ఉంటారు.

11 దీన్ని హృదయంలో ఉంచుకుని, మన దేవుడు మీకిచ్చిన పిలుపుకు మిమ్మల్ని ఆయన యోగ్యులుగా చేయాలని, ఆయన తన శక్తిచేత మీ ప్రతి ఉత్తమమైన కోరికను ఫలింపచేయాలని, మీ ప్రతి పని విశ్వాసం వలన జరగాలని మేము మీ కోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాము.

12 తద్వారా మన దేవుని యొక్క ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపను బట్టి మన ప్రభువైన యేసు నామం మీలో, మీరు ఆయనలో మహిమపరచబడాలని మేము ప్రార్థిస్తున్నాము.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan