Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 సమూయేలు 22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


దావీదు స్తుతి గీతం

1 యెహోవా దావీదును శత్రువులందరి చేతి నుండి, సౌలు చేతి నుండి విడిపించినప్పుడు దావీదు యెహోవా సన్నిధిలో ఈ పాట పాడాడు.

2 అతడు ఇలా పాడాడు: “యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు;

3 నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ, నా డాలు, నా రక్షణ కొమ్ము. ఆయన నా బలమైన కోట, నా ఆశ్రయం, నా రక్షకుడు హింసించేవారి నుండి నన్ను రక్షిస్తారు.

4 “స్తుతికి యోగ్యుడైన యెహోవాకు నేను మొరపెట్టాను, నా శత్రువుల నుండి నేను రక్షించబడ్డాను.

5 మరణపు అలలు నన్ను చుట్టుకున్నాయి; దుష్టులు వరదల్లా నన్ను ముంచెత్తుతారు.

6 సమాధి ఉచ్చులు నన్ను చుట్టుకున్నాయి; మరణపు ఉచ్చులు నన్ను బంధించాయి.

7 “నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను; నా దేవున్ని వేడుకున్నాను. తన మందిరంలో నుండి ఆయన నా స్వరం విన్నారు; నా మొర ఆయన చెవులకు చేరింది.

8 అప్పుడు భూమి కంపించి అదిరింది, పరలోకపు పునాదులు కదిలాయి. ఆయన కోపానికి అవి వణికాయి.

9 ఆయన నాసికా రంధ్రాల్లో నుండి పొగలేచింది; ఆయన నోటి నుండి దహించే అగ్ని వచ్చింది, దానిలో నిప్పులు మండుతున్నాయి.

10 ఆకాశాన్ని చీల్చుకొని ఆయన దిగివచ్చారు; ఆయన పాదాల క్రింద నల్లని మేఘాలు కమ్ముకున్నాయి.

11 ఆయన కెరూబుల మీద ఎక్కి వచ్చారు. ఆయన గాలి రెక్కల మీద ఎగిరి వచ్చారు.

12 ఆయన చీకటిని తన చుట్టూ పందిరిగా, కారు మేఘాలను పందిరిగా చేసుకున్నారు.

13 ఆయన సన్నిధి కాంతి నుండి పిడుగులు వచ్చాయి.

14 యెహోవా పరలోకం నుండి ఉరిమారు. మహోన్నతుని స్వరం ప్రతిధ్వనించింది.

15 ఆయన తన బాణాలు విసిరి శత్రువును చెదరగొట్టారు, మెరుస్తున్న గొప్ప పిడుగులతో వారిని తరిమికొట్టారు.

16 యెహోవా గద్దింపుకు, ఆయన నాసికా రంధ్రాల్లో నుండి వచ్చే బలమైన ఊపిరికి సముద్రపు అగాధాలు కనబడ్డాయి, భూమి పునాదులు బయటపడ్డాయి.

17 “ఆయన పైనుండి చేయి చాచి నన్ను పట్టుకున్నారు; లోతైన జలాల్లో నుండి నన్ను పైకి తీశారు.

18 శక్తివంతమైన నా శత్రువు నుండి, నాకన్నా బలవంతులైన పగవారి నుండి ఆయన నన్ను రక్షించారు.

19 నా విపత్తు రోజున వారు నా మీదికి వచ్చారు, కాని యెహోవా నాకు అండగా ఉన్నారు.

20 ఆయన నన్ను విశాలమైన స్థలంలోకి తీసుకువచ్చారు; ఆయన నాయందు ఆనందించారు కాబట్టి నన్ను విడిపించారు.

21 “నా నీతిని బట్టి యెహోవా నాతో వ్యవహరించారు; నా నిర్దోషత్వం బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చారు.

22 నేను యెహోవా మార్గాలను అనుసరిస్తున్నాను; దుర్మార్గంగా నేను నా దేవుని విడిచిపెట్టలేదు.

23 ఆయన న్యాయవిధులన్ని నా ముందే ఉన్నాయి; ఆయన శాసనాల నుండి నేను తొలగిపోలేదు.

24 ఆయన ముందు నేను నిందారహితునిగా ఉన్నాను, నేను పాపానికి దూరంగా ఉన్నాను.

25 నా నీతిని బట్టి ఆయన దృష్టిలో నా నిర్దోషత్వాన్ని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చారు.

26 “నమ్మకస్థులకు మిమ్మల్ని మీరు నమ్మకస్థులుగా కనుపరచుకుంటారు, యథార్థంగా ఉండే వారికి మిమ్మల్ని మీరు యథార్థవంతులుగా కనుపరచుకుంటారు,

27 నిష్కళంకులకు మీరు నిష్కళంకంగా కనుపరచుకుంటారు, కాని వంచకులకు మిమ్మల్ని మీరు వివేకిగా కనుపరచుకుంటారు.

28 మీరు దీనులను రక్షిస్తారు, అహంకారులపై మీ దృష్టి ఉంచి వారిని అణచివేస్తారు.

29 యెహోవా! మీరు నాకు దీపము; యెహోవా నా చీకటిని వెలుగుగా మారుస్తారు.

30 మీ సహాయంతో నేను సైన్యాన్ని ఎదుర్కోగలను; నా దేవుని తోడుతో నేను గోడను దాటుతాను.

31 “దేవుని విషయమైతే ఆయన మార్గం పరిపూర్ణమైనది; యెహోవా వాక్కు లోపం లేనిది; ఆయనను ఆశ్రయించిన వారందరిని ఆయన కాపాడతారు.

32 యెహోవా తప్ప దేవుడెవరు? మన దేవుని మించిన కొండ ఎవరు?

33 బలంతో నన్ను సాయుధునిగా చేసేది, నా మార్గాన్ని యథార్థంగా కాపాడేది నా దేవుడే.

34 నా పాదాలను జింక పాదాలుగా చేస్తారు; ఎత్తైన స్థలాల మీద నన్ను నిలబెడతారు.

35 నా చేతులను యుద్ధానికి సిద్ధపరుస్తారు; నా చేతులు ఇత్తడి విల్లును వంచగలవు.

36 మీ రక్షణ సహాయాన్ని నా డాలుగా చేస్తారు, మీ సహాయం నన్ను గొప్ప చేస్తుంది.

37 నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు.

38 “నేను నా శత్రువులను వెంటాడి వారిని నాశనం చేశాను; వారిని నాశనం చేసే వరకు నేను వెనుతిరగలేదు.

39 వారు మళ్ళీ లేవకుండా వారిని పూర్తిగా నలుగగొట్టాను; వారు నా పాదాల క్రింద పడ్డారు.

40 మీరు యుద్ధం కోసం నాకు బలాన్ని ధరింపచేశారు; మీరు నా విరోధులను నా ముందు అణచివేశారు.

41 మీరు నా శత్రువులు వెనుతిరిగి పారిపోయేలా చేశారు, నేను నా విరోధులను నాశనం చేశాను.

42 వారు సాయం కోసం మొరపెట్టారు కాని వారిని రక్షించడానికి ఎవరూ లేరు యెహోవా కూడా వారికి జవాబివ్వలేదు.

43 భూమి మీద ఉండే దుమ్ములా నేను వారిని నలుగగొట్టాను; వీధుల్లోని బురదలా నేను వారిని తొక్కాను.

44 “జనాల దాడుల నుండి మీరు నన్ను విడిపించారు; జనులకు నాయకునిగా మీరు నన్ను స్థిరపరిచారు. నాకు తెలియని ప్రజలు నాకు సేవ చేస్తున్నారు.

45 విదేశీయులు నా ముందు భయపడుతున్నారు; నా గురించి వినగానే వారు నాకు లోబడుతున్నారు.

46 వారందరి గుండె జారిపోతుంది; వారు వణుకుతూ తమ బలమైన కోటలలో నుండి బయటకు వస్తారు.

47 “యెహోవా సజీవుడు! నా కొండకు స్తుతి! నా రక్షణ ఆశ్రయమైన దేవునికి మహిమ!

48 నా పక్షాన పగతీర్చుకునే దేవుడు ఆయనే, దేశాలను నాకు లోబరచేది ఆయనే.

49 నా శత్రువుల నుండి నన్ను రక్షించేది ఆయనే. నా విరోధులకు పైగా మీరు నన్ను హెచ్చించారు; హింసాత్మక వ్యక్తుల నుండి మీరు నన్ను విడిపించారు.

50 అందుకే యెహోవా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను. మీ నామ సంకీర్తన చేస్తాను.

51 “ఆయన తన రాజుకు ఘన విజయాలు ఇస్తారు; ఆయన తన అభిషిక్తుడైన దావీదుకు అతని సంతానానికి, తన మారని దయను చూపిస్తారు.”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan