Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 సమూయేలు 10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


అమ్మోనీయులను ఓడించిన దావీదు

1 కొంతకాలం తర్వాత అమ్మోనీయుల రాజు చనిపోగా, అతని స్థానంలో అతని కుమారుడు హానూను రాజయ్యాడు.

2 అప్పుడు దావీదు, “హానూను తండ్రియైన నాహాషు నా మీద దయ చూపించినట్లే నేను హామాను మీద దయ చూపిస్తాను” అని అనుకున్నాడు. కాబట్టి అతని తండ్రి విషయంలో తన సానుభూతి తెలుపడానికి దావీదు తన ప్రతినిధులను పంపించాడు. దావీదు మనుష్యులు అమ్మోనీయుల దేశానికి చేరుకున్నపుడు,

3 అమ్మోనీయుల దళాధిపతులు తమ ప్రభువైన హానూనుతో, “నీ తండ్రిని గౌరవించడానికి నీకు సానుభూతి తెలుపాలని దావీదు దూతలను పంపాడని అనుకుంటున్నావా? దావీదు వారిని పంపింది కేవలం పట్టణాన్ని పరిశోధించి, దాన్ని వేగుచూసి పడగొట్టడానికి కాదా?” అని అన్నారు.

4 అందువల్ల హానూను దావీదు దూతలను పట్టుకుని ఒక్కొక్కరికి సగం గడ్డం గీసి, పిరుదుల దగ్గర వారి వస్త్రాలు కత్తిరించి పంపించేశాడు.

5 ఈ సంగతి దావీదుకు తెలిసినప్పుడు, వారు చాలా అవమానించబడ్డారని గ్రహించి, వారి దగ్గరకు మనుష్యులను పంపించాడు. రాజు, “మీ గడ్డాలు పెరిగే వరకు యెరికో పట్టణంలో ఉండి, ఆ తర్వాత రండి” అని చెప్పాడు.

6 దావీదుకు తాము కోపం తెప్పించామని అమ్మోనీయులు గ్రహించి, బేత్-రెహోబు నుండి సోబా నుండి 20,000 మంది అరామీయుల కాల్బలాన్ని, అలాగే మయకా రాజును, అతని నుండి 1,000 మంది సైనికులను, టోబు నుండి 12,000 మంది సైనికులను కిరాయికి తీసుకున్నారు.

7 ఇది విన్న దావీదు యోవాబును యుద్ధ సైనికులందరితో సహా పంపించాడు.

8 అమ్మోనీయులు బయటకు వచ్చి తమ పట్టణ ద్వారం దగ్గర యుద్ధ పంక్తులు తీర్చారు. సోబా, రెహోబు నుండి వచ్చిన అరామీయులు, అలాగే టోబు, మయకా నుండి వచ్చినవారు విడివిడిగా పొలాల్లో ఉన్నారు.

9 యోవాబు తన ముందు వెనుకా యుద్ధ పంక్తులు ఉండడం చూశాడు; ఇశ్రాయేలులో కొందరు అత్యుత్తమ దళాలను ఎంపికచేసి, వారిని అరామీయులకు ఎదురుగా మోహరించాడు.

10 మిగిలిన వారిని తన సోదరుడైన అబీషై ఆధీనంలో ఉంచి వారిని అమ్మోనీయులకు ఎదురుగా మోహరించాడు.

11 యోవాబు, “అరామీయులను ఎదుర్కోవడం నాకు కష్టమైనప్పుడు నన్ను రక్షించడానికి నీవు రావాలి. అమ్మోనీయులను ఎదుర్కోవడం నీకు కష్టమైనప్పుడు నిన్ను రక్షించడానికి నేను వస్తాను.

12 ధైర్యంగా ఉండు. మన ప్రజల కోసం, మన దేవుని పట్టణాల కోసం ధైర్యంగా పోరాడదాం. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో అది చేస్తారు” అని అబీషైతో చెప్పాడు.

13 అప్పుడు యోవాబు అతనితో ఉన్న దళాలు అరామీయులతో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్లగా, అతన్ని ఎదుర్కోలేక వారు పారిపోయారు.

14 అరామీయులు పారిపోయారని గ్రహించిన అమ్మోనీయులు అబీషై ఎదుట నుండి పారిపోయి పట్టణంలోకి వెళ్లారు. అమ్మోనీయులతో పోరాటం మాని యోవాబు యెరూషలేముకు తిరిగి వచ్చాడు.

15 తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయామని గ్రహించిన అరామీయులు మళ్ళీ గుంపుగా కలిశారు.

16 హదదెజరు యూఫ్రటీసు నది అవతల ఉన్న అరామీయులను పిలిపించాడు; వారు హేలాముకు వెళ్లారు. హదదెజెరు సేనాధిపతియైన షోబకు వారిని నడిపించాడు.

17 దావీదుకు ఈ సంగతి తెలిసినప్పుడు, అతడు ఇశ్రాయేలు అంతటిని సమకూర్చి యొర్దాను నది దాటి హేలాముకు వెళ్లాడు. దావీదును ఎదుర్కొని యుద్ధం చేయడానికి అరామీయులు యుద్ధరంగంలోనికి దిగి అతనితో యుద్ధం చేశారు.

18 అయితే అరామీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలువలేక పారిపోయారు. దావీదు వారిలో 700 మంది రథసారధులను 40,000 మంది సైనికులను చంపాడు. అలాగే వారి సైన్యాధిపతియైన షోబకును కూడా చంపాడు.

19 హదదెజెరు సేవకులైన సామంత రాజులందరూ తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతున్నామని గ్రహించి వారితో సమాధానపడి లొంగిపోయారు. అప్పటినుండి అరామీయులు అమ్మోనీయులకు సహాయం చేయడానికి భయపడ్డారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan