Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 రాజులు 8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


షూనేమీయురాలి భూమిని తిరిగి ఇప్పించుట

1 ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బాలుని తల్లితో ఇలా అన్నాడు, “యెహోవా కరువు రప్పిస్తున్నారు, అది ఈ దేశంలో ఏడు సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి నీవు, నీ కుటుంబం బయలుదేరి మీకు అనువైన చోటికి వెళ్లి కొంతకాలం ఉండండి.”

2 దైవజనుడు చెప్పినట్టు ఆ స్త్రీ చేసింది. ఆమె, ఆమె కుటుంబం, ఫిలిష్తీయ దేశానికి వెళ్లి అక్కడ ఏడు సంవత్సరాలు నివసించారు.

3 ఏడు సంవత్సరాలు ముగిసిన తర్వాత, ఆమె ఫిలిష్తీయ దేశం నుండి తిరిగి వచ్చింది, తన ఇల్లు భూమి కోసం మనవి చేసుకోవడానికి ఆమె రాజు దగ్గరకు వెళ్లింది.

4 ఆ సమయంలో, దైవజనుని సేవకుడైన గేహజీతో రాజు మాట్లాడుతూ, “ఎలీషా చేసిన గొప్పకార్యాలు నాకు చెప్పు” అన్నాడు.

5 ఎలీషా ఎలా చచ్చినవాన్ని బ్రతికించాడో గేహజీ రాజుకు చెప్తూ ఉండగానే, అతడు బ్రతికించిన బాలుని తల్లి తన ఇల్లు అలాగే భూమి కోసం రాజుకు మనవి చేసుకోవడానికి వచ్చింది. గేహజీ, “నా ప్రభువా, రాజా, ఈవిడే ఆ స్త్రీ, ఇతడే ఎలీషా బ్రతికించిన ఈ స్త్రీ కుమారుడు” అని అన్నాడు.

6 రాజు దాని గురించి ఆమెను అడిగినప్పుడు, ఆమె ఆ విషయం వివరించింది. అప్పుడు రాజు ఆమె కోసం ఒక అధికారిని నియమించి, “ఆమెకు చెందినదంతా, ఆమె దేశం విడిచి వెళ్లిన రోజు నుండి ఇప్పటివరకు ఆమె భూమివల్ల వచ్చిన రాబడితో సహా ఆమెకు ఇప్పించు” అని అతనికి చెప్పాడు.


బెన్-హదదును చంపిన హజాయేలు

7 ఎలీషా దమస్కుకు వెళ్లాడు, అప్పుడు అరాము రాజైన బెన్-హదదుకు జబ్బుచేసింది. అప్పుడు, “దైవజనుడు ఇక్కడకు వచ్చాడు” అని రాజుకు చెప్పినప్పుడు,

8 రాజు హజాయేలుతో, “నీవు కానుక పట్టుకుని వెళ్లి దైవజనున్ని కలువు. అతని ద్వారా యెహోవాను సంప్రదించి ‘నేను ఈ జబ్బు నుండి కోలుకుంటానా?’ అని అడుగు” అన్నాడు.

9 హజాయేలు బహుమానంగా దమస్కులోని శ్రేష్టమైన వస్తువులను తీసుకుని నలభై ఒంటెల మీద ఎక్కించి ఎలీషాను కలవడానికి వెళ్లాడు. అతడు వెళ్లి ఎలీషా ఎదుట నిలబడి, “మీ కుమారుడు, అరాము రాజైన బెన్-హదదు, ‘నేను ఈ జబ్బు నుండి కోలుకుంటానా?’ అని అడగమని నన్ను పంపాడు” అని చెప్పాడు.

10 అందుకు ఎలీషా, “నీవు వెళ్లి, అతడు తప్పకుండ కోలుకుంటాడని చెప్పు. కానీ అతడు ఖచ్చితంగా చనిపోతాడని యెహోవా నాకు తెలియజేశారు” అన్నాడు

11 హజాయేలు ఇబ్బందిపడేంతగా దైవజనుడు అతన్ని చూస్తూ ఏడ్వడం మొదలుపెట్టాడు.

12 అప్పుడు హజాయేలు, “నా ప్రభువా ఎందుకు ఏడుస్తున్నారు?” అని అడిగాడు. అందుకతడు, “ఎందుకంటే మీరు ఇశ్రాయేలీయులకు చేసే కీడు నాకు తెలుసు. మీరు వారి కోటగోడలకు నిప్పంటిస్తారు, వారి యువకులను ఖడ్గంతో చంపుతారు, వారి చిన్న పిల్లలను నేలకు కొడతారు, వారి గర్భవతుల కడుపులు చీల్చివేస్తారు” అన్నాడు.

13 అందుకు హజాయేలు, “మీ దాసుడు, కుక్కలాంటి వాడు, ఇంతటి సాహసం ఎలా చేస్తాడు?” అన్నాడు. ఎలీషా జవాబిస్తూ, “నీవు అరాము దేశానికి రాజవుతావని యెహోవా నాకు తెలియజేశారు” అని చెప్పాడు.

14 అప్పుడు హజాయేలు ఎలీషాను విడిచి తన యజమాని దగ్గరకు తిరిగి వెళ్లాడు. బెన్-హదదు, “ఎలీషా నీతో ఏం చెప్పాడు” అని బెన్-హదదు అడిగినప్పుడు, హజాయేలు, “మీరు తప్పకుండా కోలుకుంటారు” అని జవాబిచ్చాడు.

15 మరుసటిరోజు హజాయేలు మందమైన గుడ్డను తీసుకుని నీళ్లలో ముంచి రాజు ముఖం మీద పరచగా రాజు చనిపోయాడు. అప్పుడు హజాయేలు అతని స్థానంలో రాజయ్యాడు.


యూదా రాజైన యెహోరాము

16 అహాబు కుమారుడు, ఇశ్రాయేలు రాజైన యోరాము పరిపాలనలోని అయిదవ సంవత్సరంలో, యెహోషాపాతు కుమారుడైన యెహోరాము యూదాలో రాజయ్యాడు.

17 అతడు రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు.

18 అతడు అహాబు కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు, కాబట్టి అహాబు ఇంటివారిలా ఇశ్రాయేలు రాజుల మార్గాలను అనుసరించాడు. యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.

19 అయితే, యెహోవా తన సేవకుడైన దావీదును బట్టి యూదా రాజ్యాన్ని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. దావీదుకు, అతని వారసులకు ఒక దీపం ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటుందని ఆయన వాగ్దానం చేశారు.

20 యెహోరాము కాలంలో ఎదోమీయులు యూదాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తమ సొంత రాజును నియమించుకున్నారు.

21 కాబట్టి యెహోరాము తన రథాలన్నిటితో జాయీరుకు వెళ్లాడు. ఎదోమీయులు అతన్ని, అతని రథసారధులను చుట్టుముట్టారు, కాని అతడు రాత్రిలో లేచి వారిపై దాడి చేశాడు; అతని సైన్యం తమ గుడారాలకు పారిపోయారు.

22 ఈనాటికీ ఎదోము యూదాను వ్యతిరేకిస్తూ ఉంది. అదే సమయంలో లిబ్నా తిరుగబడింది.

23 యెహోరాము పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?

24 యెహోరాము చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో వారి దగ్గర అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు అహజ్యా రాజయ్యాడు.


యూదా రాజైన అహజ్యా

25 ఇశ్రాయేలు రాజు, అహాబు కుమారుడైన యోరాము పరిపాలనలోని పన్నెండవ సంవత్సరంలో యూదారాజు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజయ్యాడు.

26 అహజ్యా రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఒక సంవత్సరం పరిపాలించాడు. అతని తల్లి పేరు అతల్యా, ఆమె ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ మనుమరాలు.

27 అహజ్యా అహాబు ఇంటి అల్లుడు కాబట్టి అతడు అహాబు ఇంటివారి మార్గాలను అనుసరించి అహాబు కుటుంబంలా యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.

28 అహజ్యా అహాబు కుమారుడైన యోరాముతో కలిసి, అరాము రాజైన హజాయేలు మీద యుద్ధం చేయడానికి రామోత్ గిలాదుకు వెళ్లగా అరామీయులు యోరామును గాయపరిచారు.

29 కాబట్టి రాజైన యోరాము రామోతు దగ్గర అరాము రాజైన హజాయేలుతో చేసిన యుద్ధంలో అరామీయులు తనకు చేసిన గాయాల నుండి కోలుకోవడానికి యెజ్రెయేలుకు తిరిగి వచ్చాడు. అప్పుడు యెహోరాము కుమారుడు యూదా రాజైన అహజ్యా గాయపడి ఉన్న అహాబు కుమారుడైన యోరామును చూడడానికి యెజ్రెయేలుకు వెళ్లాడు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan