Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 రాజులు 5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


నయమానుకు కుష్ఠు నుండి స్వస్థత

1 అరాము రాజు సైన్యాధిపతి నయమాను. అతడు తన యజమాని దృష్టిలో గొప్పవాడు, గౌరవనీయుడు, ఎందుకంటే యెహోవా అతని చేత అరామీయులకు విజయం ప్రసాదించారు. అతడు మహాశూరుడు, కానీ కుష్ఠురోగి.

2 అరామీయులు గుంపులు గుంపులుగా ఇశ్రాయేలు మీదికి దోపిడికి వెళ్లేవారు, ఒకసారి వారు ఒక చిన్నదాన్ని బందీగా తీసుకువచ్చారు, ఆమె నయమాను భార్యకు పరిచారం చేసేది.

3 ఆమె తన యజమానురాలితో, “నా యజమాని సమరయలో ఉన్న ప్రవక్తను కలిస్తే బాగుండేది! ఆయన అతని కుష్ఠురోగాన్ని పూర్తిగా నయం చేస్తాడు” అని చెప్పింది.

4 నయమాను తన యజమాని దగ్గరకు వెళ్లి, ఆ ఇశ్రాయేలు అమ్మాయి చెప్పిన మాటలు అతనికి చెప్పాడు.

5 అందుకు అరాము రాజు, “సరే వెళ్లు, నేను ఇశ్రాయేలు రాజుకు ఉత్తరం పంపిస్తాను” అన్నాడు. కాబట్టి నయమాను తనతో పది తలాంతుల వెండి, ఆరువేల షెకెళ్ళ బంగారం, పది జతల దుస్తులు తీసుకుని వెళ్లాడు.

6 అతడు ఇశ్రాయేలు రాజు దగ్గరకు తీసుకెళ్లిన ఉత్తరంలో ఇలా వ్రాసి ఉంది: “ఈ ఉత్తరంతో పాటు నా సేవకుడైన నయమానును నీ దగ్గరకు పంపిస్తున్నాను, అతనికి ఉన్న కుష్ఠును మీరు బాగుచేయాలని కోరుతున్నాను.”

7 ఇశ్రాయేలు రాజు ఆ ఉత్తరం చదవగానే తన బట్టలు చింపుకొని, “చంపడానికి బ్రతికించడానికి నేనేమైనా దేవుడనా? కుష్ఠును బాగుచేయాలని ఇతడు ఒక వ్యక్తిని నా దగ్గరకు ఎందుకు పంపాడు? ఇతడు నాతో ఎలా వాదం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడో చూడండి!” అన్నాడు.

8 దైవజనుడైన ఎలీషా, ఇశ్రాయేలు రాజు తన బట్టలు చించుకొన్నాడని విన్నప్పుడు, ఈ సందేశం అతనికి పంపాడు: “నీ బట్టలు ఎందుకు చించుకొన్నావు? ఆ వ్యక్తిని ఇప్పుడు నా దగ్గరకు పంపు, ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అతడు తెలుసుకుంటాడు.”

9 కాబట్టి నయమాను తన గుర్రాలతో, రథాలతో వెళ్లి ఎలీషా ఇంటి గుమ్మం దగ్గర ఆగాడు.

10 ఎలీషా, “నీవు వెళ్లి, యొర్దానులో ఏడుసార్లు స్నానం చేయి; అప్పుడు నీ శరీరం మామూలుగా మారి నీవు శుద్ధుడవవుతావు” అని అతనికి చెప్పమని ఒక దూతను పంపాడు.

11 అయితే నయమాను కోపంతో వెళ్లి, “అతడు తప్పకుండా నా కోసం బయటకు వచ్చి, నిలబడి, అతని దేవుడైన యెహోవా పేరిట ప్రార్థనచేసి, తన చేయి రోగం ఉన్నచోట అల్లాడించి కుష్ఠును నయం చేస్తాడనుకున్నాను.

12 ఇశ్రాయేలు నీళ్ల కంటే దమస్కులో ఉన్న అబానా, ఫర్పరు నదుల నీళ్లు మంచివి కావా? నేను వాటిలో కడుక్కుని పవిత్రపరచబడనా?” అని అంటూ ఆగ్రహంతో వెనుకకు తిరిగి వెళ్లాడు.

13 నయమాను సేవకులు అతని దగ్గరకు వెళ్లి, “నా తండ్రి, ఒకవేళ ఆ ప్రవక్త మిమ్మల్ని ఏదైనా గొప్ప పని చేయమని చెప్తే మీరు చేయకుండా ఉంటారా? ‘స్నానం చేసి పవిత్రపరచబడండి!’ అన్నమాట దానికంటే ఇంకా మంచిది కదా!” అని అన్నాడు.

14 కాబట్టి అతడు వెళ్లి దైవజనుడు చెప్పినట్లు యొర్దానులో ఏడుసార్లు మునిగాడు, వెంటనే అతని శరీరం శుద్ధి చేయబడి, పసివాడి దేహంలా మారింది.

15 అప్పుడు నయమాను, అతని సేవకులందరు దైవజనుని దగ్గరకు తిరిగి వెళ్లారు. నయమాను అతని ఎదుట నిలబడి, “ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకంలో మరో దేవుడు లేడని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. కాబట్టి దయచేసి మీ దాసుడనైన నేను ఇచ్చే ఈ కానుక అంగీకరించండి.”

16 ప్రవక్త, “నేను సేవించే సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేనేమి తీసుకోను” అని జవాబిచ్చాడు. నయమాను ఎంత బలవంతం చేసినా అతడు తీసుకోలేదు.

17 నయమాను ఇలా అన్నాడు, “ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే, దయచేసి మీ దాసుడనైన నాకు కంచరగాడిదలు మోసేటంత మట్టి ఇప్పించండి, ఎందుకంటే యెహోవాకే దహనబలులు, అర్పణలు, అర్పిస్తాను గాని, మరి ఏ దేవునికి అర్పించను.

18 అయితే ఒక్క విషయంలో యెహోవా మీ దాసుడనైన నన్ను క్షమించాలి: నా యజమానుడు మ్రొక్కుకోడానికి రిమ్మోను గుడిలోకి వెళ్తూ నా చేయి మీద ఆనుకున్నప్పుడు నేను కూడా రిమ్మోను గుడిలో వంగి నమస్కారం చేయాల్సి వస్తుంది. కాబట్టి మీ దాసుడనైన నన్ను యెహోవా క్షమించును గాక” అని అన్నాడు.

19 ఎలీషా అన్నాడు, “సమాధానంతో వెళ్లు.” నయమాను కొద్ది దూరం వెళ్లిన తర్వాత,

20 ఎలీషా సేవకుడు గేహజీ, “నా యజమాని అరామీయుడైన నయమాను తెచ్చిన కానుక తీసుకోకుండా ఊరికే వెళ్లనిచ్చాడు. సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను అతని వెంట పరిగెత్తి అతని నుండి ఏదైనా తీసుకుంటాను” అని తన మనస్సులో అనుకున్నాడు.

21 కాబట్టి గేహజీ నయమాను వెనకే త్వరగా వెళ్లాడు. నయమాను తన వెనుక ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ రావడం గమనించి రథం దిగి అతన్ని కలుసుకొని, “అంతా క్షేమమేనా?” అని అడిగాడు.

22 గేహజీ, “అంతా క్షేమమే. నా యజమాని నన్ను పంపి, ‘ప్రవక్తల బృందంలో ఇద్దరు యువకులు ఎఫ్రాయిం కొండసీమ నుండి నా దగ్గరకు ఇప్పుడే వచ్చారు. దయచేసి వారికి ఒక తలాంతు వెండి, రెండు జతల దుస్తులు ఇవ్వండి’ అని చెప్పమన్నాడు” అన్నాడు.

23 అందుకు నయమాను, “నీకిష్టమైతే రెండు తలాంతుల వెండి తీసుకో” అని చెప్పి గేహజీని బలవంతంగా ఒప్పించి రెండు సంచుల్లో నుండి రెండు తలాంతుల వెండి, రెండు జతల దుస్తులు పెట్టి, తన సేవకులలో ఇద్దరికి ఇస్తే వారు గేహజీకి ఇవ్వడానికి మోసుకెళ్లారు.

24 గేహజీ కొండ దగ్గరకు చేరగానే అతడు వాటిని ఆ సేవకుల దగ్గర నుండి తీసుకుని వెళ్లి తన ఇంట్లో పెట్టుకున్నాడు. తర్వాత అతడు ఆ మనుష్యులను పంపించేశాడు.

25 అతడు లోపలికి వెళ్లి తన యజమాని ముందు నిలబడినప్పుడు, ఎలీషా అతన్ని, “గేహజీ ఎక్కడికి వెళ్లావు?” అని అడిగాడు. “మీ దాసుడనైన నేను ఎక్కడికి వెళ్లలేదు” అని గేహజీ జవాబిచ్చాడు.

26 అయితే ఎలీషా అతనితో అన్నాడు, “ఆ మనిషి నిన్ను కలుసుకోడానికి రథం దిగి నీ దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు నా ఆత్మ నీతో కూడా లేదా? డబ్బు, దుస్తులు, ఒలీవచెట్లు, ద్రాక్షతోటలు, మందలు, పశువులు, దాసదాసీలు తీసుకోవడానికి ఇది సమయమా?

27 నయమాను కుష్ఠు నీకు, నీ సంతానానికీ నిత్యం ఉంటుంది” అని అన్నాడు. వెంటనే గేహజీ చర్మమంతా కుష్ఠు వచ్చి మంచులా తెల్లగా అయ్యింది. అతడు ఎలీషా దగ్గర నుండి వెళ్లిపోయాడు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan