2 రాజులు 22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంధర్మశాస్త్ర గ్రంథం దొరుకుట 1 యోషీయా రాజైనప్పుడు అతని వయస్సు ఎనిమిది సంవత్సరాలు. అతడు యెరూషలేములో ముప్పై ఒక సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి అదాయా కుమార్తెయైన యెదీదా; ఆమె బొస్కతు గ్రామస్థురాలు. 2 అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. అతడు తన పితరుడైన దావీదు జీవిత విధానాన్ని పూర్తిగా అనుసరించాడు, దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోలేదు. 3 అతని పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో రాజైన యోషీయా మెషుల్లాము మనుమడును అజల్యా కుమారుడును, కార్యదర్శియునైన షాఫానును యెహోవా మందిరాన్ని బాగుచేయించడానికి పంపాడు. అతడు ఇలా చెప్పాడు: 4 “నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా దగ్గరకు వెళ్లి, యెహోవా ఆలయానికి వచ్చే ప్రజల నుండి ద్వారపాలకులు వసూలు చేసిన డబ్బు మొత్తం సిద్ధంగా ఉంచమని అతనితో చెప్పు. 5-6 వారు ఆ డబ్బును యెహోవా మందిర పనులు చేయించడానికి నియమించబడిన మనుష్యులకు ఇవ్వాలి. వారు ఆ డబ్బును మరమ్మత్తు పని చేసేవారికి అనగా వడ్రంగి వారికి, కట్టేవారికి, తాపీ మేస్త్రీలకు ఇవ్వాలి. వారు ఆలయ మరమ్మత్తు కోసం కలపమ్రాను, చెక్కిన రాళ్లు కొనడానికి ఆ డబ్బును వాడాలి. 7 అయితే వారి చేతికి అప్పగించే డబ్బుకు వారు లెక్కలు చూపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారు తమ వ్యవహారాలలో నమ్మకమైనవారు.” 8 ప్రధాన యాజకుడైన హిల్కీయా కార్యదర్శియైన షాఫానుతో, “యెహోవా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది” అని చెప్పి దానిని షాఫానుకు ఇచ్చాడు. 9 తర్వాత కార్యదర్శియైన షాఫాను రాజు దగ్గరకు వెళ్లి ఇలా చెప్పాడు: “మీ సేవకులు యెహోవా మందిరంలో ఉన్న డబ్బు జమచేసి, మందిరంలో పని చేస్తున్న వారికి, వారి పై అధికారుల చేతికి అప్పగించారు.” 10 అప్పుడు కార్యదర్శియైన షాఫాను, “యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు” అని రాజుకు చెప్పి రాజు సముఖంలో దాని నుండి చదివాడు. 11 రాజు ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలు విన్నప్పుడు తాను వేసుకున్న బట్టలు చింపుకొన్నాడు. 12 తర్వాత రాజు యాజకుడైన హిల్కీయాకు, షాఫాను కుమారుడైన అహీకాముకు, మీకాయా కుమారుడైన అక్బోరుకు, కార్యదర్శియైన షాఫానుకు, రాజు సేవకుడైన అశాయాకు ఇలా ఆదేశాలు జారీ చేశాడు: 13 “మీరు వెళ్లి, దొరికిన ఈ గ్రంథంలో వ్రాసిన మాటల గురించి నా కోసం, ప్రజల కోసం యూదా అంతటి కోసం, యెహోవా దగ్గర విచారణ చేయండి. యెహోవా కోపాగ్ని మనమీద అధికంగా రగులుకొని ఉంది. ఎందుకంటే, మన పూర్వికులు ఈ గ్రంథంలోని మాటలకు లోబడలేదు; మనలను ఉద్దేశించి అందులో వ్రాయబడిన ప్రకారం వారు చేయలేదు.” 14 యాజకుడైన హిల్కీయా, అహీకాము, అక్బోరు, షాఫాను, అశాయా హుల్దా ప్రవక్తి దగ్గరకు వెళ్లారు. ఆమె వస్త్రశాల తనిఖీదారుడైన హర్షషుకు పుట్టిన తిక్వా కుమారుడైన షల్లూము భార్య, యెరూషలేములో నూతన భాగంలో నివసించేది. 15 ఆమె వారితో, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: మిమ్మల్ని నా దగ్గరకు పంపిన వ్యక్తికి చెప్పండి, 16 ‘యెహోవా చెప్పే మాట ఇదే: యూదారాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడిన కీడంతటిని నేను ఈ స్థలం మీదికి, దీని ప్రజలమీదికి రప్పిస్తాను. 17 ఎందుకంటే, ఈ ప్రజలు నన్ను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళకు ధూపం వేశారు. వారు చేతులతో చేసిన విగ్రహాలన్నిటి బట్టి నాకు కోపం రేపారు, నా కోపం ఈ స్థలంపై రగులుకుంటుంది, అది చల్లారదు.’ 18 యెహోవా దగ్గర విచారణ చేయడానికి మిమ్మల్ని పంపిన యూదా రాజుతో ఇలా చెప్పండి, ‘నీవు విన్న మాటల గురించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: 19 వారు శపించబడి నాశనమవుతారని ఈ స్థలం గురించి ఈ ప్రజల గురించి నే చెప్పిన మాటలు విని నీ హృదయం స్పందించి నీవు యెహోవా ఎదుట తగ్గించుకొని నీ బట్టలు చింపుకొని నా సన్నిధిలో ఏడ్చావు కాబట్టి, నేను కూడా నీ మనవి విన్నానని యెహోవా చెప్తున్నారు. 20 కాబట్టి నేను నిన్ను నీ పూర్వికుల దగ్గరకు చేరుస్తాను, సమాధానంతో నీవు సమాధి చేయబడతావు. నేను ఈ స్థలం మీదికి రప్పించే విపత్తును నీ కళ్లు చూడవు’ ” అని చెప్పింది. అప్పుడు వారు ఆమె జవాబును రాజు దగ్గరకు తీసుకెళ్లారు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.