2 రాజులు 2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంఏలీయా ఆకాశానికి ఎత్తబడుట 1 యెహోవా ఏలీయాను ఆకాశంలోకి సుడిగాలిలో తీసుకెళ్లే సమయం ఆసన్నమైనప్పుడు ఏలీయా, ఎలీషా గిల్గాలు నుండి బయలుదేరారు. 2 అప్పుడు ఏలీయా ఎలీషాతో, “నీవు ఇక్కడే ఉండు; యెహోవా నన్ను బేతేలుకు వెళ్లమన్నారు” అని చెప్పాడు. అయితే ఎలీషా, “సజీవుడైన యెహోవా మీద, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను నిన్ను విడువను” అన్నాడు. కాబట్టి వారు బేతేలుకు వెళ్లారు. 3 బేతేలులో ఉన్న ప్రవక్తల బృందం వారు ఎలీషా దగ్గరకు వచ్చి, “ఈ రోజు యెహోవా నీ గురువును నీ దగ్గరనుండి తీసుకెళ్తున్నారని నీకు తెలుసా?” అని అడిగారు. ఎలీషా జవాబిస్తూ, “నాకు తెలుసు, ఊరుకోండి” అన్నాడు. 4 తర్వాత ఏలీయా అతనితో అన్నాడు, “ఎలీషా, నీవు ఇక్కడ ఉండు. యెహోవా నన్ను యెరికోకు వెళ్లమన్నారు.” అతడు జవాబిస్తూ అన్నాడు, “సజీవుడైన యెహోవా మీద, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను నిన్ను విడువను.” కాబట్టి వారు యెరికోకు వెళ్లారు. 5 యెరికోలో ఉన్న ప్రవక్తల బృందం వారు ఎలీషా దగ్గరకు వచ్చి, “ఈ రోజు యెహోవా నీ గురువును నీ దగ్గర నుండి తీసుకెళ్తున్నారని నీకు తెలుసా?” అని అడిగారు. ఎలీషా జవాబిస్తూ, “నాకు తెలుసు, ఊరుకోండి” అన్నాడు. 6 తర్వాత ఏలీయా అతనితో, “ఎలీషా, నీవు ఇక్కడే ఉండు. యెహోవా నన్ను యొర్దానుకు వెళ్లమన్నారు” అని చెప్పాడు. కాని అతడు, “సజీవుడైన యెహోవా మీద, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను నిన్ను విడువను” అన్నాడు. కాబట్టి ఆ ఇద్దరు నడుచుకుంటూ వెళ్లారు. 7 ప్రవక్త బృందంలో నుండి యాభైమంది మనుష్యులు యొర్దాను దగ్గర ఆగిన ఏలీయా, ఎలీషాలకు ఎదురుగా నిలబడ్డారు. 8 ఏలీయా తన పైవస్త్రాన్ని తీసి, మడతపెట్టి నీళ్లను కొట్టాడు, నీళ్లు కుడి వైపుకు, ఎడమవైపుకు చీలిపోయాయి, వారిద్దరు పొడినేల మీద నడిచివెళ్లారు. 9 వారు దాటిన తర్వాత, ఏలీయా ఎలీషాతో, “నన్ను నీ దగ్గర నుండి తీసుకెళ్లక ముందు, నేను నీకోసం ఏం చెయ్యాలో చెప్పు” అన్నాడు. అందుకు ఎలీషా అన్నాడు, “నీ మీద ఉన్న ఆత్మ నా మీద రెండంతలుగా నేను పొందుకోనివ్వు.” 10 అందుకు ఏలీయా, “నీవు అడిగింది కష్టమైనది, అయితే నన్ను తీసుకువెళ్లే సమయంలో నీవు నన్ను చూస్తే నీవు దానిని పొందుకుంటావు, చూడకపోతే నీవు పొందుకోవు” అని చెప్పాడు. 11 వారు కలిసి మాట్లాడుతూ నడుస్తూ వెళ్తున్నప్పుడు, అకస్మాత్తుగా అగ్ని గుర్రాలతో ఉన్న అగ్ని రథం వచ్చి వారిద్దరిని వేరు చేసింది. ఏలీయా సుడిగాలిలో ఆకాశంలోకి పైకి వెళ్లిపోయాడు. 12 ఎలీషా అది చూస్తూ, “నా తండ్రీ! నా తండ్రీ! ఇశ్రాయేలు రథాలు, రౌతులు నీవే!” అని కేక పెట్టాడు. ఎలీషా అతన్ని మరలా చూడలేదు. అప్పుడు అతడు తాను వేసుకున్న బట్టలు రెండుగా చింపుకున్నాడు. 13 ఎలీషా, ఏలీయా మీద నుండి క్రిందపడ్డ అతని పైవస్త్రాన్ని తీసుకుని తిరిగి యొర్దాను ఒడ్డుకు వచ్చి నిలబడ్డాడు. 14 ఎలీషా ఏలీయా మీద నుండి క్రిందపడ్డ పైవస్త్రాన్ని పట్టుకుని దానితో నీళ్లను కొట్టి, “ఏలీయా దేవుడైన యెహోవా, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?” అన్నాడు. అతడు ఆ నీళ్లను కొట్టినప్పుడు ఆ నీళ్లు కుడి వైపుకు ఎడమవైపుకు విడిపోగా అతడు అవతలి ఒడ్డుకు వెళ్లాడు. 15 దీనిని చూస్తున్న యెరికోలో ఉన్న ప్రవక్తల బృందం వారు, “ఏలీయా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉంది” అని చెప్పి అతన్ని కలుసుకోడానికి వెళ్లి అతని ఎదుట సాష్టాంగపడ్డారు. 16 వారు అన్నారు, “చూడండి, మీ సేవకులైన మా దగ్గర సమర్థులైన యాభైమంది మనుష్యులు ఉన్నారు. వారు వెళ్లి మీ గురువును వెదుకుతారు. బహుశ యెహోవా ఆత్మ అతన్ని తీసుకెళ్లి, ఏదైనా కొండమీదో లేదా ఏదైన లోయలోనో వదిలి ఉండవచ్చు” అన్నారు. అందుకు ఎలీషా, “వద్దు, వారిని పంపకండి” అన్నాడు. 17 అతడు విసిగిపోయేంతగా వారు పట్టుబట్టినందుకు అతడు, “పంపండి” అన్నాడు. వారు యాభైమంది మనుష్యులను పంపారు, వారు ఏలీయా కోసం మూడు రోజులు గాలించారు కాని అతన్ని కనుగొనలేకపోయారు. 18 వారు యెరికోలో నివసిస్తున్న ఎలీషా దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు, అతడు వారితో, “మీరు వెళ్లవద్దని నేను చెప్పలేదా?” అన్నాడు. నీళ్లను స్వస్థపరచుట 19 పట్టణ వాసులు ఎలీషాతో, “చూడండి, మా ప్రభువా, ఈ పట్టణం మంచి స్థలంలో ఉంది, కాని నీళ్లు మంచివి కావు, భూమి నిస్సారంగా ఉంది” అన్నారు. 20 అతడు, “క్రొత్త గిన్నెలో ఉప్పు వేసి నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు. వారు దానిని అతని దగ్గరకు తెచ్చారు. 21 అప్పుడు అతడు ఊట దగ్గరకు వెళ్లి అందులో ఆ ఉప్పు వేసి, “యెహోవా చెప్పే మాట ఇదే: నేను ఈ నీళ్లను బాగుచేశాను. ఇక మీద ఇది చావును తీసుకురాదు; భూమిని నిస్సారంగా చేయదు” అని అన్నాడు. 22 ఎలీషా చెప్పిన మాట ప్రకారం ఈ రోజు వరకు ఆ నీరు ఆరోగ్యకరంగా ఉంది. ఎలీషా గేలి చేయబడుట 23 అక్కడినుండి ఎలీషా బేతేలుకు వెళ్లాడు. అతడు దారిన వెళ్తుండగా పట్టణంలో నుండి కొంతమంది బాలురు వచ్చి, “బోడివాడా, ఇక్కడినుండి వెళ్లిపో! బోడివాడా, ఇక్కడినుండి వెళ్లిపో!” అంటూ అతని గేలి చేశారు. 24 అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా పేరిట వారిని శపించాడు. అప్పుడు రెండు ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలభై రెండు మందిని ముక్కలు ముక్కలుగా చీల్చాయి. 25 అతడు అక్కడినుండి కర్మెలు పర్వతానికి వెళ్లి, అక్కడినుండి సమరయకు తిరిగి వెళ్లాడు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.