2 రాజులు 19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంయెరూషలేము విడుదల గురించి ముందుగా చెప్పుట 1 ఇది విని రాజైన హిజ్కియా తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరంలోకి వెళ్లాడు. 2 అతడు రాజభవన నిర్వాహకుడైన ఎల్యాకీమును, కార్యదర్శియైన షెబ్నాను, యాజకులలో పెద్దవారిని ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా దగ్గరకు పంపాడు, వారంత గోనెపట్ట కట్టుకున్నారు. 3 వారు అతనితో ఇలా అన్నారు, “హిజ్కియా చెప్పిన మాట ఇదే: ఈ రోజు బాధ, చీవాట్లు, అవమానం ఉన్న రోజు, బిడ్డ పుట్టడానికి సమయం దగ్గరకు వచ్చినా కనే శక్తిలేని స్త్రీలా ఉంది. 4 జీవంగల దేవున్ని దూషించడానికి అష్షూరు రాజు తన సేవకుడైన సైన్యాధిపతి పంపించాడు. అతడు పలికిన మాటలన్నీ మీ దేవుడైన యెహోవా విని అతని మాటలనుబట్టి మీ దేవుడైన యెహోవా అష్షూరు రాజును గద్దిస్తారేమో, కాబట్టి ఇక్కడ మిగిలే వారి కోసం ప్రార్థించండి.” 5 రాజైన హిజ్కియా సేవకులు యెషయా దగ్గరకు వచ్చినప్పుడు, 6 యెషయా వారితో ఇలా అన్నాడు, “మీ యజమానికి చెప్పండి, ‘యెహోవా చెప్పే మాట ఇదే: మీరు విన్న వాటికి అనగా అష్షూరు రాజు సేవకులు నన్ను దూషిస్తూ మాట్లాడిన మాటలకు భయపడకండి. 7 వినండి! అతడు ఒక వదంతి విని తన దేశానికి వెళ్ళిపోయేలా నేను చేస్తాను, అక్కడ అతడు ఖడ్గం చేత చనిపోయేలా చేస్తాను.’ ” 8 అంతలో అష్షూరు రాజు లాకీషును విడిచి వెళ్లాడని అతని సైన్యాధిపతి విని, అతడు తిరిగివెళ్లి రాజు లిబ్నాతో పోరాడుతున్నాడని తెలుసుకున్నాడు. 9 అప్పుడు సన్హెరీబు, కూషు రాజైన తిర్హాకా తన మీద యుద్ధం చేయడానికి వస్తున్నాడనే వార్త విన్నాడు. కాబట్టి అతడు మరలా దూతలను హిజ్కియా దగ్గరకు పంపాడు: 10 “యూదా రాజైన హిజ్కియాకు ఇలా చెప్పండి: నీవు నమ్ముకున్న నీ దేవుడు, ‘యెరూషలేము అష్షూరు రాజు చేతికి ఇవ్వబడదు’ అని చెప్పే మోసపు మాటలకు మోసపోవద్దు. 11 అష్షూరు రాజులు అన్ని దేశాలను పూర్తిగా నాశనం చేసిన సంగతి నీవు ఖచ్చితంగా వినే ఉంటావు. మీరు మాత్రం తప్పించుకోగలరా? 12 గోజాను, హారాను, రెజెపు, తెలశ్శారు పట్టణంలో ఉండే ఏదెను ప్రజలను నా పూర్వికులు నాశనం చేసినప్పుడు, ఆ జనాల దేవుళ్ళు వారిని విడిపించారా? 13 హమాతు రాజు, అర్పదు రాజు ఎక్కడ? లాయిరు, సెఫర్వయీము, హేన, ఇవ్వా పట్టణాల రాజులు ఏమయ్యారు?” హిజ్కియా ప్రార్థన 14 హిజ్కియా దూతల నుండి లేఖ తీసుకుని దానిని చదివాడు. తర్వాత యెహోవా ఆలయానికి వెళ్లి, యెహోవా సముఖంలో ఆ ఉత్తరాన్ని తెరిచాడు. 15 హిజ్కియా యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు: “యెహోవా! ఇశ్రాయేలు దేవా! కెరూబుల మధ్యలో సింహాసనాసీనుడా! ఈ లోక రాజ్యాలకు మీరు మాత్రమే దేవుడు. మీరు భూమ్యాకాశాలను సృష్టించారు. 16 యెహోవా, శ్రద్ధగా వినండి; యెహోవా, కళ్లు తెరచి చూడండి. జీవంగల దేవున్ని దూషించడానికి సన్హెరీబు చెప్పి పంపిన మాటలు వినండి. 17 “యెహోవా, అష్షూరు రాజులు ఈ జనాలను, వారి దేశాలను నాశనం చేశారన్నది వాస్తవం. 18 వారు వారి దేవుళ్ళను అగ్నిలో వేసి నాశనం చేశారు, ఎందుకంటే అవి దేవుళ్ళు కాదు, కేవలం మనుషుల చేతులతో చేసిన కర్ర, రాళ్లు మాత్రమే. 19 ఇప్పుడు యెహోవా, మా దేవా, మమ్మల్ని అతని చేతిలో నుండి విడిపించండి. అప్పుడు ఈ లోక రాజ్యాలన్ని యెహోవాయైన మీరే దేవుడని తెలుసుకుంటారు.” యెషయా సన్హెరీబు ఓటమి గురించి ప్రవచించుట 20 అప్పుడు ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియాకు ఇలా సందేశం పంపాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నీవు అష్షూరు రాజైన సన్హెరీబును గురించి నాకు చేసిన ప్రార్థన విన్నాను. 21 అతని గురించి యెహోవా చెప్పిన మాట ఇదే: “ ‘కన్యయైన సీయోను కుమార్తె నిన్ను తృణీకరించి ఎగతాళి చేస్తుంది. యెరూషలేము కుమార్తె నీవు పారిపోతుంటే తల ఊపుతుంది. 22 నీవు ఎవరిని నిందించి దూషించావు? ఎవరి మీద నీవు అరిచి గర్వంతో నీ కళ్ళెత్తి చూశావు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునినే గదా! 23 నీవు పంపిన దూతల ద్వారా ప్రభువును దూషించావు. నీవు అన్నావు, “నా అనేక రథాల చేత, పర్వత శిఖరాల మీదికి ఎక్కాను, లెబానోను ఎత్తైన స్థలాలను ఎక్కాను. దాని పొడువైన దేవదారులను నరికివేశాను, శ్రేష్ఠమైన సరళ వృక్షాలను నరికివేశాను. దాని చివరి సరిహద్దులను చేరుకున్నాను, దాని సారవంతమైన అడవులను చేరుకున్నాను. 24 నేను పరదేశి నేలలో బావులు త్రవ్వి అక్కడి నీళ్లు త్రాగాను. నా అరికాలితో ఈజిప్టు నది ప్రవాహాలన్నీ ఎండిపోయేలా చేశాను.” 25 “ ‘చాలా కాలం క్రితం నేనే నిర్ణయించానని, నీవు వినలేదా? పూర్వకాలంలో నేను సంకల్పించాను; ఇప్పుడు నేను అలా జరిగేలా చేశాను, నీవు కోటగోడలు గల పట్టణాలను రాళ్ల కుప్పలుగా చేసేలా చేశాను. 26 వారి ప్రజలు బలహీనులై, భయాక్రాంతులై అవమానం పాలయ్యారు. వారు పొలంలో మొక్కల్లా, పచ్చని మొక్కల్లా, ఇంటికప్పు మీద పెరిగే గడ్డిలా పెరగక ముందే వాడిపోయినట్టు ఉన్నారు. 27 “ ‘అయితే నీవు ఎక్కడ ఉన్నావో ఎప్పుడు వస్తావో ఎప్పుడు వెళ్తావో నా మీద ఎంత కోపంగా ఉన్నావో నాకు తెలుసు. 28 నీవు నాకు వ్యతిరేకంగా లేస్తున్నందుకు, నీ అహంకారం నా చెవిని చేరినందుకు, నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను, నా కళ్లెం నీ నోటిలో వేస్తాను. నీవు వచ్చిన దారిలోనే నీవు తిరిగి వెళ్లేలా చేస్తాను.’ 29 “హిజ్కియా, దానికి నీకిదే సూచన: “ఈ సంవత్సరం దాని అంతట అదే పండే పంటను మీరు తింటారు, రెండవ ఏట దాని నుండి కలిగే ధాన్యాన్ని మీరు తింటారు. అయితే మూడవ ఏట విత్తనాలు చల్లి కోత కోస్తారు, ద్రాక్షతోటలు నాటి వాటి ఫలాలు మీరు తింటారు. 30 యూదా రాజ్యంలో శేషం మరోసారి క్రిందికి వేర్లు తన్ని చిగురించి ఫలిస్తుంది. 31 యెరూషలేము నుండి శేషం వస్తుంది, సీయోను పర్వతం నుండి తప్పించుకున్నవారు వస్తారు. “సైన్యాల యెహోవా రోషం దీన్ని సాధిస్తుంది. 32 “కాబట్టి అష్షూరు రాజు గురించి యెహోవా చెప్పే మాట ఇదే: “ ‘అతడు ఈ పట్టణంలోకి ప్రవేశించడు ఒక్క బాణమైనా వేయడు. ఒక్క డాలును దానికి చూపించడు దాని ఎదురుగా ముట్టడి దిబ్బ వేయడు. 33 అతడు వచ్చిన దారినే తిరిగి వెళ్లిపోతాడు. అతడు ఈ పట్టణంలోకి ప్రవేశించడు అని యెహోవా ప్రకటిస్తున్నారు. 34 నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను.’ ” 35 ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు శిబిరంలో లక్ష ఎనభై అయిదు వేలమంది సైనికులను హతం చేశాడు. ప్రొద్దున ప్రజలు లేచి చూస్తే వారంతా శవాలుగా పడి ఉన్నారు. 36 అప్పుడు అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగి వెళ్లిపోయాడు, నీనెవెకు తిరిగివెళ్లి అక్కడ ఉండిపోయాడు. 37 ఒక రోజు అతడు నిస్రోకు అనే తన దేవుని గుడిలో పూజ చేస్తుండగా అతని కుమారులు ఆద్రమ్మెలెకు, షెరెజరు ఖడ్గంతో అతన్ని చంపి అరారతు ప్రాంతానికి పారిపోయారు. అతని తర్వాత అతని కుమారుడైన ఏసర్హద్దోను రాజయ్యాడు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.