2 రాజులు 18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంయూదా రాజైన హిజ్కియా 1 ఇశ్రాయేలు రాజు, ఏలా కుమారుడైన హోషేయ పరిపాలన యొక్క మూడవ సంవత్సరంలో యూదారాజు, ఆహాజు కుమారుడైన హిజ్కియా పరిపాలన ప్రారంభించాడు. 2 అతడు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అబీయా, ఆమె జెకర్యా కుమార్తె. 3 అతడు తన పితరుడైన దావీదు చేసినట్లు, యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. 4 అతడు క్షేత్రాలను తొలగించి, పవిత్ర రాళ్లను పగులగొట్టి, అషేరా స్తంభాలను పడగొట్టాడు. మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు, ఎందుకంటే ఆ కాలం వరకు ఇశ్రాయేలీయులు దానికి ధూపం వేసేవారు. (అది నెహుష్టాను అని పిలువబడేది.) 5 హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాయందు నమ్మకం ఉంచాడు. అతని ముందు గాని అతని తర్వాత గాని వచ్చిన యూదా రాజులలో, ఎవరూ అతని వంటివారు లేరు. 6 అతడు యెహోవాకు నమ్మకంగా ఉండి, ఆయనను వెంబడించడం మానేయలేదు; యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞలను అతడు పాటించాడు. 7 యెహోవా అతనికి తోడుగా ఉన్నారు కాబట్టి హిజ్కియా చేసిన వాటన్నిటిలో జయం పొందాడు. అతడు అష్షూరు రాజుకు సేవచేయకుండ అతని మీద తిరగబడ్డాడు. 8 కావలికోట నుండి కోటగోడలు గల పట్టణం వరకు, గాజా దాని సరిహద్దుల వరకు ఫిలిష్తీయులను ఓడించాడు. 9 రాజైన హిజ్కియా పరిపాలన యొక్క నాలుగవ సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజు, ఏలా కుమారుడైన హోషేయ పరిపాలన యొక్క ఏడవ సంవత్సరంలో, అష్షూరు రాజైన షల్మనేసెరు సమరయ మీదికి దండెత్తి దాన్ని ముట్టడించాడు. 10 మూడు సంవత్సరాల ముగింపులో అష్షూరీయులు దాన్ని చేజిక్కించుకున్నారు. కాబట్టి హిజ్కియా పరిపాలన యొక్క ఆరవ సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజైన హోషేయ పరిపాలన యొక్క తొమ్మిదవ సంవత్సరంలో సమరయ స్వాధీనపరచుకోబడింది. 11 అష్షూరు రాజు ఇశ్రాయేలును చెరగా తీసుకెళ్లి, హాలహులో, హాబోరు నది ప్రాంతంలో ఉన్న గోజానులో, మాదీయుల పట్టణాల్లో వారిని ఉంచాడు. 12 వారు తమ దేవుడైన యెహోవా చెప్పిన మాట వినకుండా, ఆయన నిబంధనను, యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించిందంతటిని ఉల్లంఘించినందుకు ఇలా జరిగింది. వారు ఆజ్ఞలను వినలేదు, పాటించలేదు. 13 రాజైన హిజ్కియా పాలన యొక్క పద్నాలుగవ సంవత్సరంలో అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశంలోని కోటగోడలున్న పట్టణాలన్నిటి మీద దాడిచేసి వాటిని స్వాధీనం చేసుకున్నాడు. 14 కాబట్టి యూదా రాజైన హిజ్కియా, లాకీషు పట్టణంలో ఉన్న అష్షూరు రాజు దగ్గరకు, “నేను తప్పు చేశాను. నా దగ్గర నుండి నీవు వెనుకకు వెళ్లిపో, నీవు నా నుండి ఏమి కోరిన అది ఇస్తాను” అని సందేశం పంపాడు. అష్షూరు రాజు మూడువందలు తలాంతుల వెండి, ముప్పై తలాంతుల బంగారం యూదా రాజైన హిజ్కియా చెల్లించాలని విధించాడు. 15 కాబట్టి హిజ్కియా యెహోవా మందిరంలో, రాజభవన ధననిధిలో, వస్తువుల రూపంలో ఉన్న వెండి అంతా అతనికి ఇచ్చాడు. 16 ఇంకా ఆ కాలంలో యూదా రాజైన హిజ్కియా యెహోవా ఆలయ తలుపులకున్న బంగారం, తలుపు స్తంభాలకున్న బంగారం తీయించి అష్షూరు రాజుకిచ్చాడు. యెరూషలేమును సన్హెరీబు బెదిరించుట 17 అష్షూరు రాజు తన ప్రధాన సైన్యాధిపతిని, ముఖ్య అధికారిని, సైన్యాధిపతిని, పెద్ద సైన్యంతో, లాకీషు నుండి యెరూషలేములో ఉన్న రాజైన హిజ్కియా దగ్గరకు పంపాడు. వారు యెరూషలేముకు దండెత్తి చాకలి రేవు దారిలో ఉన్న పై కోనేటి కాలువ దగ్గర ఆగారు. 18 వారు రాజును పిలిపించారు; హిల్కీయా కుమారుడు, రాజభవన నిర్వాహకుడైన ఎల్యాకీము, కార్యదర్శియైన షెబ్నా, ఆసాపు కుమారుడు రాజ్య లేఖికుడైన యోవాహు వారి దగ్గరకు వెళ్లారు. 19 అప్పుడు సైన్యాధిపతి వారితో అన్నాడు, “హిజ్కియాకు చెప్పండి: “ ‘మహారాజు, అష్షూరు రాజు చెప్పే మాట ఇది: దేన్ని చూసుకుని నీకు ఈ ధైర్యం? 20 యుద్ధం విషయంలో నీకు ఆలోచన, బలం ఉంది అంటావు, కాని నీవు మాట్లాడేవి వట్టి మాటలే. నీవు ఎవరిని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేస్తున్నావు? 21 చూడు, నీవు నలిగిన రెల్లులాంటి ఈజిప్టును నమ్ముకుంటున్నావు, ఎవరైనా దాని మీద ఆనుకుంటే అది అతని చేతికి గుచ్చుకుని లోపలికి దిగుతుంది. ఈజిప్టు రాజైన ఫరోను నమ్ముకునే వారందరికి అతడు చేసేది అదే. 22 అయితే, “మా దేవుడైన యెహోవా మీద మేము ఆధారపడుతున్నాం” అని మీరు నాతో అంటే, “యెరూషలేములో ఉన్న ఈ బలిపీఠం దగ్గర మీరు ఆరాధించాలి” అని యూదా వారితో యెరూషలేము వారితో చెప్పిన ఆయన ఉన్నత స్థలాలను, బలిపీఠాలనే కదా హిజ్కియా పడగొట్టింది? 23 “ ‘ఇప్పుడు రండి, నా యజమానియైన అష్షూరు రాజుతో బేరం కుదుర్చుకోండి: మీ దగ్గర సరిపడే రౌతులు ఉంటే, నేను మీకు రెండువేల గుర్రాలు ఇస్తాను! 24 రథాలు, రౌతుల కోసం ఈజిప్టు రాజును నమ్ముకున్నా, మీరు నా యజమాని అధికారులలో అతి అల్పుడైన ఒక్క అధికారినైనా ఎలా ఎదిరించగలరు? 25 యెహోవా నుండి మాట రాకుండానే ఈ స్థలంపై దాడి చేసి నాశనం చేయడానికి వచ్చానా? ఈ దేశంపై దాడి చేసి నాశనం చేయమని స్వయాన యెహోవాయే చెప్పారు.’ ” 26 అప్పుడు హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నా, యోవాహు సైన్యాధిపతితో, “నీ దాసులమైన మాకు అరామిక్ భాష అర్థం అవుతుంది కాబట్టి ఆ భాషలో మాట్లాడండి. గోడ మీద ఉన్న ప్రజలకు వినిపించేలా హెబ్రీ భాషలో మాట్లాడకండి” అన్నారు. 27 అయితే సైన్యాధిపతి జవాబిస్తూ, “ఈ విషయాలు కేవలం మీకు, మీ యజమానికి మాత్రమే చెప్పటానికి నా యజమాని నన్ను పంపాడని, గోడ మీద కూర్చున్న ప్రజలకు కాదనుకున్నారా? వారు కూడా మీలాగే తమ మలం తింటూ తమ మూత్రం త్రాగాల్సిందే” అని అన్నాడు. 28 అప్పుడు సైన్యాధిపతి నిలబడి బిగ్గరగా హెబ్రీ భాషలో ఇలా అన్నాడు, “మహారాజైన అష్షూరు రాజు మాట వినండి! 29 రాజు చెప్పే మాట ఇదే: హిజ్కియా మిమ్మల్ని మోసం చేయకుండ చూసుకోండి. నా చేతిలో నుండి అతడు మిమ్మల్ని విడిపించలేడు. 30 హిజ్కియా, ‘యెహోవా మనల్ని తప్పక విడిపిస్తారు; ఈ పట్టణం అష్షూరు రాజు చేతికి చిక్కదు’ అని చెప్తూ యెహోవా మీద నమ్మకం ఉంచేలా ప్రేరేపించనివ్వకండి. 31 “హిజ్కియా మాటలు వినకండి. అష్షూరు రాజు చెప్పే మాట ఇదే: నాతో సమాధాన ఒప్పందం చేసుకుని, నా దగ్గరకు రండి. అప్పుడు నేను వచ్చేవరకు, మీలో ప్రతి ఒక్కరూ మీ ద్రాక్షచెట్టు పండ్లు, మీ అంజూర చెట్టు పండ్లు తింటూ, మీ బావి నీళ్లు త్రాగుతారు. 32 తర్వాత నేను వచ్చి మిమ్మల్ని మీ సొంత దేశం లాంటి దేశానికి తీసుకెళ్తాను. అది ధాన్యాలు, క్రొత్త ద్రాక్షరసం ఉన్న దేశం, రొట్టె, ద్రాక్షతోటలు ఉన్న దేశము. ఒలీవచెట్లు, తేనె ఉన్న దేశము. మరణాన్ని కాదు, జీవాన్ని ఎంచుకోండి. “హిజ్కియా, ‘యెహోవా మనలను విడిపిస్తారు’ అంటూ మిమ్మల్ని నమ్మిస్తున్నాడు, అతని మాటలు వినకండి. 33 ఇతర దేశ దేవుడు ఎవరైనా తన దేశాన్ని అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించాడా? 34 హమాతు, అర్పదు దేవుళ్ళు ఎక్కడ? సెఫర్వయీము, హేన, ఇవ్వా దేవుళ్ళు ఎక్కడ? వారు నా చేతిలో నుండి సమరయను రక్షించగలిగారా? 35 ఈ దేశాల దేవుళ్ళలో ఎవరైనా తన దేశాన్ని నా చేతిలో నుండి రక్షించగలిగారా? అలాగైతే, యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును ఎలా విడిపిస్తారు?” 36 అయితే, “అతనికి జవాబివ్వకండి” అని రాజు వారికి ఆజ్ఞాపించడంతో ప్రజలు ఏమి జవాబివ్వకుండా మౌనంగా ఉన్నారు. 37 అప్పుడు హిల్కీయా, రాజభవన నిర్వాహకుడైన ఎల్యాకీము, కార్యదర్శియైన షెబ్నా, ఆసాపు కుమారుడు, రాజ్య లేఖికుడైన యోవాహు, తమ బట్టలు చింపుకొని హిజ్కియా దగ్గరకు వెళ్లి, అష్షూరు సైన్యాధిపతి చెప్పింది అతనికి తెలియజేశారు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.