Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 రాజులు 10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


అహాబు కుటుంబం చంపబడుట

1 అహాబు కుమారులు డెబ్బైమంది సమరయలో ఉన్నారు. కాబట్టి యెహు ఉత్తరాలు వ్రాసి సమరయలో ఉన్న యెజ్రెయేలు అధిపతులకు, నగర పెద్దలకు, అహాబు సంతతి సంరక్షకులకు పంపి ఇలా చెప్పాడు,

2 “మీ యజమాని కుమారులు మీతోనే ఉన్నారు, మీకు రథాలు గుర్రాలు, కోటగోడలు గల పట్టణం, ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉత్తరం మీకు చేరిన వెంటనే,

3 మీ యజమాని కుమారులలో తగినవాడును ఉత్తముడునైన ఒక కుమారుని ఎన్నుకుని తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టండి. తర్వాత మీ యజమాని వంశం కోసం పోరాడండి!”

4 అయితే వారు భయపడి అన్నారు, “ఇద్దరు రాజులు అతని ముందు నిలువలేకపోయారు, అలాంటప్పుడు మనం ఎలా నిలువగలం”? అని చెప్పుకున్నారు.

5 కాబట్టి రాజభవన అధికారి, పట్టణ అధికారి, పెద్దలు, సంరక్షకులు యెహుకు, “మేము మీ దాసులం, మీ ఆజ్ఞలన్నీ పాటిస్తాము. మేము ఎవరినీ రాజుగా నియమించము; మీకు ఏది మంచిదని అనిపిస్తుందో అది చేయండి” అని కబురు పంపారు.

6 అప్పుడు యెహు రెండవ ఉత్తరం వ్రాసి వారికి పంపాడు. అందులో అతడు, “మీరు నా పక్షంగా ఉండి నాకు లోబడితే రేపు ఈ వేళకు యెజ్రెయేలులో నా దగ్గరకు మీ యజమాని కుమారుల తలలు తీసుకురండి” అన్నాడు. ఆ డెబ్బైమంది రాజకుమారులు వారిని పెంచుతున్న పట్టణపు పెద్దల దగ్గర ఉన్నారు.

7 ఆ ఉత్తరం వారికి చేరినప్పుడు వారు డెబ్బైమంది రాజకుమారులను పట్టుకుని వారినందరిని చంపి వారి తలలు బుట్టల్లో పెట్టి యెజ్రెయేలులో ఉన్న యెహుకు పంపారు.

8 దూత వచ్చి యెహుతో, “వారు రాజకుమారుల తలలు తెచ్చారు” అని చెప్పాడు. అప్పుడు యెహు, “వాటిని ఉదయం వరకు నగర ద్వారం దగ్గర రెండు కుప్పలుగా పెట్టండి” అని ఆదేశించాడు.

9 మరుసటిరోజు ఉదయం యెహు బయటకు వచ్చి ప్రజలందరి ఎదుట నిలబడి, “మీరు నిర్దోషులు. నేను నా యజమానిపై కుట్రచేసి అతన్ని చంపాను నిజమే, కానీ, వీరందరిని చంపింది ఎవరు?

10 కాబట్టి ఒక విషయం తెలుసుకోండి, యెహోవా అహాబు వంశాన్ని గురించి చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా నెరవేరకుండా ఉండదు, యెహోవా తన సేవకుడైన ఏలీయా ద్వారా చెప్పిన మాట ప్రకారం ఇది జరిగించారు” అన్నాడు.

11 కాబట్టి యెహు యెజ్రెయేలులో మిగిలిన అహాబు వంశీయులందరినీ, అహాబు పక్షం ఉన్న ప్రముఖులను అతని సన్నిహిత మిత్రులను అతని యాజకులతో పాటు చంపాడు. అతని పక్షం వారెవ్వవరినీ వదిలిపెట్టలేదు.

12 తర్వాత యెహు బయలుదేరి సమరయ వైపు వెళ్లాడు. కాపరుల బేత్-ఎకెద్ దగ్గర,

13 యెహు యూదా రాజైన అహజ్యా బంధువులు కొందరిని కలిసి వారిని, “మీరెవరు?” అని అడిగాడు. వారు, “మేము అహజ్యా బంధువులము. మేము రాజు, రాజమాత కుటుంబాలను పలకరించడానికి వెళ్తున్నాం” అన్నారు.

14 అతడు, “వీరిని ప్రాణాలతో పట్టుకోండి” అని ఆదేశించగా వారు వారిని ప్రాణాలతో పట్టుకుని బేత్-ఎకెదు బావి దగ్గర వారిలో ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా నలభై రెండు మందిని చంపారు.

15 అతడు అక్కడినుండి బయలుదేరిన తర్వాత, తనను కలుసుకోడానికి వస్తున్న రేకాబు కుమారుడైన యెహోనాదాబును చూశాడు. యెహు అతనికి శుభమని చెప్పి, “నేను నీతో యథార్థంగా ఉన్నట్లు నీవు నాతో ఉన్నావా?” అని అడిగాడు. అందుకు యెహోనాదాబు, “ఉన్నాను” అని జవాబిచ్చాడు. “అలాగైతే, నీ చేయి ఇవ్వు” అని యెహు అనగానే అతడు తన చేయి అందించగా యెహు అతన్ని రథంలోకి ఎక్కించుకున్నాడు.

16 యెహు, “నాతో వచ్చి యెహోవా కోసం నేను ఎంత రోషం కలిగి ఉన్నానో చూడు” అని చెప్పి తన రథంలో అతన్ని తీసుకెళ్లాడు.

17 యెహు సమరయకు వచ్చినప్పుడు, అక్కడ మిగిలి ఉన్న అహాబు వంశం వారినందరిని చంపాడు; ఏలీయాతో యెహోవా చెప్పిన మాట ప్రకారం అతడు వారిని నిర్మూలం చేశాడు.


బయలు సేవకులు చంపబడుట

18 తర్వాత యెహు ప్రజలందరినీ సమకూర్చి, “అహాబు బయలుకు కొంచెం సేవ చేశాడు; కాని యెహు మరి ఎక్కువ సేవ చేస్తాడు.

19 కాబట్టి ఇప్పుడు బయలు ప్రవక్తలందరినీ, అతని సేవకులందరినీ, అతని పూజారులందరినీ పిలిపించండి. ఎవరూ మానకుండా అందరు ఉండేలా చూడండి. ఎందుకంటే, నేను బయలుకు గొప్ప బలి అర్పిస్తాను. రాని వారిని బ్రతకనివ్వను” అని వారితో అన్నాడు. అయితే బయలు సేవకులను నాశనం చేద్దామని యెహు ఇలా యుక్తిగా చేశాడు.

20 యెహు, “బయలుకు పవిత్ర సమావేశాన్ని ఏర్పాటు చేయండి” అని చెప్పగా వారలాగే ప్రకటించారు.

21 తర్వాత యెహు ఇశ్రాయేలంతటికి కబురు పంపాడు, బయలు సేవకులంతా వచ్చారు; ఏ ఒక్కడు రాకుండా లేడు. వారంతా బయలు గుడిలో ప్రవేశించగా బయలు గుడి ఈ చివర నుండి ఆ చివర వరకు వారితో నిండిపోయింది.

22 యెహు దుస్తుల గది మీద అధికారితో, “బయలు సేవకులందరికీ అంగీలు తీసుకురా” అని చెప్పాడు. అతడు వారి కోసం అంగీలు తెచ్చాడు.

23 తర్వాత యెహు, రేకాబు కుమారుడైన యెహోనాదాబు బయలు గుడిలోకి వెళ్లారు. యెహు బయలు సేవకులతో, “ఇక్కడ మీ మధ్య యెహోవా సేవకులు ఎవరూ లేకుండా చూడండి, బయలు సేవకులు మాత్రమే ఉండాలి” అని చెప్పాడు.

24 కాబట్టి వారు బలులు, దహనబలులు అర్పించడానికి లోనికి వెళ్లారు. అప్పుడు యెహు తన వారిలో ఎనభైమంది కావలి వారును పిలిచి, ఇలా హెచ్చరించాడు: “మీలో ఎవరైనా నేను మీకు అప్పగించే వారిలో ఎవరినైన తప్పించుకుపోనిస్తే, అతని ప్రాణం కోసం మీ ప్రాణం పెట్టాలి” అని హెచ్చరించాడు.

25 దహనబలి అర్పించడం ముగించాక, యెహు కావలివారితో అధికారులతో, “లోపలికి వెళ్లి వారిని చంపండి; ఎవరిని తప్పించుకోనివ్వకండి” అన్నాడు. కాబట్టి వారు వారిని ఖడ్గంతో చంపారు. కావలివారు, అధికారులు వారి శవాలను బయట పారవేశారు. అప్పుడు వారు బయలు గర్భగుడిలోకి ప్రవేశించారు.

26 వారు బయలు గుడిలో ఉన్న పవిత్ర రాతిని బయటకు తెచ్చి దానిని తగలబెట్టారు.

27 వారు బయలు పవిత్ర స్తంభాన్ని పడగొట్టారు, బయలు గుడిని నేలమట్టం చేసి దానిని మరుగు దొడ్డిగా వాడారు. అది ఇప్పటికీ అలాగే ఉంది.

28 ఇలా యెహు బయలును ఇశ్రాయేలులో లేకుండా చేశాడు.

29 అయితే, ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము పాపాలు చేస్తూ యెహు బేతేలులో దానులో ఉన్న బంగారు దూడలను పూజించడం మానలేదు.

30 యెహోవా యెహుతో, “నా మనస్సులో ఉన్నదంతా అహాబు వంశానికి చేసి నీవు నా దృష్టిలో సరియైనది చేశావు కాబట్టి నీ సంతానం నాలుగవ తరం వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుంటారు” అన్నారు

31 అయినా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రం యెహు మనసారా పాటించడానికి జాగ్రత పడలేదు. ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలు చేస్తూనే ఉన్నాడు.

32-33 ఆ రోజుల్లో యెహోవా ఇశ్రాయేలు సరిహద్దును తగ్గించడం ప్రారంభించారు. హజాయేలు గిలాదు ప్రాంతమంతట్లో యొర్దానుకు తూర్పున ఉన్న ఇశ్రాయేలీయుల సరిహద్దును (గాదు, రూబేను, మనష్షేల ప్రాంతమంతా), అర్నోను లోయలో ఉన్న అరోయేరు నుండి, గిలాదు నుండి బాషాను వరకు స్వాధీనం చేసుకున్నాడు.

34 యెహు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?

35 యెహు చనిపోయి తన పూర్వికులను చేరాడు, సమరయలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన యెహోయాహాజు రాజయ్యాడు.

36 యెహు ఇశ్రాయేలు ప్రజలపై సమరయలో ఇరవై ఎనిమిది సంవత్సరాలు పరిపాలన చేశాడు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan