2 దిన 7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంమందిరాన్ని ప్రతిష్ఠించుట 1 సొలొమోను ప్రార్థన ముగించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహనబలిని, బలులను దహించివేసింది. యెహోవా మహిమ మందిరాన్ని నింపింది. 2 ఆలయమంతా యెహోవా మహిమతో నిండడంతో యాజకులు లోపలికి ప్రవేశించలేకపోయారు. 3 అగ్ని దిగి రావడం, యెహోవా మహిమ మందిరం మీద ఉండడం ఇశ్రాయేలీయులు చూసినప్పుడు, వారు కాలిబాట మీద సాష్టాంగపడి, “యెహోవా మంచివాడు; ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అంటూ ఆయనను ఆరాధించి కృతజ్ఞత చెల్లించారు. 4 తర్వాత రాజు, ప్రజలంతా యెహోవా ఎదుట బలులు అర్పించారు. 5 సొలొమోను రాజు 22,000 పశువులు, 1,20,000 గొర్రెలు, మేకలు బలిగా అర్పించాడు. ఈ విధంగా రాజు, ప్రజలందరు దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించారు. 6 యాజకులు తమ స్థలాల్లో నిలబడి ఉండగా, రాజైన దావీదు యెహోవాను స్తుతించడానికి, “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉండును గాక!” అంటూ ఆయనను స్తుతిస్తూ కృతజ్ఞత చెల్లించడానికి దావీదు యెహోవా కోసం తయారుచేసిన వాయిద్యాలు వాయిస్తూ గీతాలను పాడుతూ లేవీయులు కూడా తమ స్థలాలలో నిలబడ్డారు. లేవీయులకు ఎదురుగా యాజకులు నిలబడి బూరలు ఊదుతుండగా ఇశ్రాయేలీయులంతా నిలబడి ఉన్నారు. 7 సొలొమోను చేసిన ఇత్తడి బలిపీఠం మీద అర్పించలేనంత ఎక్కువగా ఆ దహనబలులు, భోజనార్పణలు, సమాధానబలుల క్రొవ్వు ఉంది కాబట్టి అతడు యెహోవా ఆలయానికి ముందున్న ఆవరణం మధ్య భాగాన్ని అతడు పవిత్రపరచి, దహనబలులు, భోజనార్పణలు, క్రొవ్వు పదార్థాలు అర్పించాడు. 8 ఆ సమయంలో ఏడు రోజులు సొలొమోను అతనితో ఇశ్రాయేలు ప్రజలంతా పండుగ చేశారు. లెబో హమాతుకు వెళ్లే మార్గం నుండి ఈజిప్టు వాగువరకు ఉన్న ప్రాంతాల నుండి ప్రజలు గొప్ప సమూహంగా వచ్చారు. 9 ఎనిమిదవ రోజున వారు సమావేశాన్ని నిర్వహించారు, ఎందుకంటే ఏడు రోజులు బలిపీఠాన్ని ప్రతిష్ఠించి మరో ఏడు రోజులు పండుగ జరుపుకున్నారు. 10 ఏడవ నెల ఇరవై మూడవ రోజున, అతడు ప్రజలను తమ ఇళ్ళకు పంపివేశాడు. యెహోవా దావీదుకు, సొలొమోనుకు, తన ప్రజలైన ఇశ్రాయేలుకు చేసిన మంచి వాటిని బట్టి హృదయంలో ఆనందంతో, సంతోషంతో వెళ్లారు. యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమగుట 11 సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని పూర్తి చేసి, యెహోవా మందిరంలో, తన సొంత భవనంలో తాను కోరుకున్నదంతా పూర్తి చేసినప్పుడు, 12 ఒక రాత్రి యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: “నేను నీ ప్రార్థన విన్నాను, ఈ స్థలాన్ని నా కోసం బలులు అర్పించే మందిరంగా ఎన్నుకున్నాను. 13 “వాన కురవకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడు గాని భూమిని మ్రింగివేయమని మిడతలను ఆజ్ఞాపించినప్పుడు గాని నా ప్రజల మధ్యకు తెగులును పంపినప్పుడు గాని, 14 ఒకవేళ నా పేరుతో పిలువబడే నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థనచేసి నా వైపు తిరిగి తమ చెడు మార్గాలను వదిలి వేస్తే, పరలోకం నుండి నేను వారి ప్రార్థన వింటాను. వారి పాపాలను క్షమించి, వారి దేశాన్ని బాగుచేస్తాను. 15 ఇప్పటినుండి ఈ స్థలంలో చేసే ప్రార్థనలపై నా దృష్టి ఉంటుంది నా చెవులతో వింటాను. 16 ఇక్కడ నా పేరు ఎప్పటికీ ఉండాలని నేను ఈ మందిరాన్ని ఎన్నుకుని ప్రతిష్ఠించాను. నా కనుదృష్టి, నా హృదయం ఎల్లప్పుడు దీనిపై ఉంటాయి. 17 “నీ మట్టుకైతే, నీ తండ్రి దావీదులా నమ్మకంగా జీవిస్తూ, నేను ఆజ్ఞాపించినదంతా చేసి, నా శాసనాలను నియమాలను పాటిస్తే, 18 నీ తండ్రి దావీదుకు, ‘ఇశ్రాయేలు సింహాసనం మీద నీ సంతతివారు ఎప్పటికీ కూర్చుంటారు’ అని నిబంధన చేసినట్లు నీ రాజ సింహాసనం ఎల్లకాలం స్థాపిస్తాను. 19 “అయితే ఒకవేళ మీరు నన్ను అనుసరించుట మాని, నేను మీకు ఇచ్చిన శాసనాలు, ఆజ్ఞలు విడిచి ఇతర దేవుళ్ళను సేవిస్తూ పూజిస్తే, 20 అప్పుడు నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన నా దేశం నుండి వారిని పెళ్లగించి నా నామం కోసం ప్రతిష్ఠించుకున్న ఈ మందిరాన్ని తిరస్కరిస్తాను. నేను దాన్ని ప్రజలందరిలో సామెతగా, హేళనకు కారణంగా చేస్తాను. 21 ఈ మందిరం శిథిలాల కుప్పగా మారుతుంది. దాటి వెళ్లేవారంతా ఆశ్చర్యపడి, ‘యెహోవా ఈ దేశానికి, ఈ ఆలయానికి ఇలా ఎందుకు చేశారో?’ అని అడుగుతారు. 22 అప్పుడు ప్రజలు, ‘వారు తమను ఈజిప్టు దేశం నుండి తీసుకువచ్చిన తమ పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టి వేరే దేవుళ్ళను హత్తుకుని, పూజిస్తూ వాటికి సేవ చేశారు, అందుకే యెహోవా వారిపై ఈ విపత్తును తెచ్చారు’ అని జవాబిస్తారు.” |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.