Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 దిన 5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 రాజైన సొలొమోను యెహోవా మందిరానికి చేసిన పని అంతా ముగిసిన తర్వాత, తన తండ్రి దావీదు ప్రతిష్ఠించిన వెండి, బంగారు, వస్తువులను తెప్పించి, యెహోవా మందిర ఖజానాలో పెట్టాడు.


మందసాన్ని మందిరానికి తీసుకురావడం

2 అప్పుడు సొలొమోను దావీదు పట్టణమైన సీయోను నుండి యెహోవా నిబంధన మందసాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలు పెద్దలను, గోత్రాల పెద్దలను, ఇశ్రాయేలీయుల కుటుంబాల నాయకులందరిని యెరూషలేముకు పిలిపించాడు.

3 ఏడవ నెలలో, పండుగ సమయంలో ఇశ్రాయేలీయులందరు రాజు ఎదుట సమావేశమయ్యారు.

4 ఇశ్రాయేలు పెద్దలందరు వచ్చాక, లేవీయులు నిబంధన మందసాన్ని తీసుకుని,

5 మందసాన్ని, సమావేశ గుడారాన్ని, అందులోని పవిత్ర వస్తువులన్నీ తీసుకువచ్చారు. లేవీయులైన యాజకులు వాటిని పైకి మోసుకెళ్లారు;

6 రాజైన సొలొమోను, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులందరు మందసం ముందు సమావేశమై, లెక్కలేనన్ని గొర్రెలను పశువులను బలి ఇచ్చారు.

7 తర్వాత యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని మందిరంలోని గర్భాలయం అనే అతి పరిశుద్ధ స్థలంలో దాని స్థలానికి తీసుకువచ్చి, కెరూబుల రెక్కల క్రింద పెట్టారు.

8 కెరూబుల రెక్కలు మందసం ఉన్న స్థలం మీదుగా చాపి మందసాన్ని దానిని మోసే కర్రలను కప్పివేశాయి.

9 ఈ మోతకర్రలు చాలా పొడవుగా ఉండడం వల్ల, వాటి అంచులు మందసం నుండి విస్తరించి, గర్భాలయానికి ముందున్న పరిశుద్ధ స్థలంలో నుండి కనబడతాయి, కాని పరిశుద్ధస్థలం బయట నుండి కనబడవు; ఈనాటికీ అవి అక్కడే ఉన్నాయి.

10 మోషే హోరేబులో ఉన్నప్పుడు, అనగా ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన తర్వాత యెహోవా వారితో నిబంధన చేసినప్పుడు మందసంలో పెట్టిన రెండు రాతిపలకలు తప్ప మరేమీ దానిలో లేవు.

11 తర్వాత యాజకులు పరిశుద్ధాలయం నుండి బయటకు వచ్చారు. అంతకుముందు అక్కడ ఉన్న యాజకులందరు తమ విభాగాలతో నిమిత్తం లేకుండా తమను తాము ప్రతిష్ఠించుకున్నారు.

12 సంగీతకారులైన లేవీయులంతా, అంటే ఆసాపు, హేమాను, యెదూతూను, వారి కుమారులు, బంధువులు సన్నని నారబట్టలను ధరించి తాళాలు, తంతి వాయిద్యాలు, స్వరమండలాలు చేతపట్టుకుని బలిపీఠానికి తూర్పు వైపున నిలబడి ఉన్నారు. వారితో కలిసి బూరల ధ్వని చేయడానికి నూట ఇరవైమంది యాజకులు ఉన్నారు.

13 బూరలు ఊదేవారు, సంగీతకారులు ఏకకంఠంతో యెహోవాకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించడానికి జత కలిశారు. వారికి జతగా బూరలు, తాళాలు, ఇతర వాయిద్యాలు వాయిస్తూ ఉంటే, పాటలు పాడేవారు యెహోవాను స్తుతించడానికి తమ స్వరాలెత్తి: “యెహోవా మంచివాడు. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని పాడారు. అప్పుడు యెహోవా మందిరం మేఘంతో నిండిపోయింది.

14 యెహోవా మహిమ దేవుని మందిరం నిండ కమ్ముకున్న ఆ మేఘాన్ని బట్టి యాజకులు తమ సేవ చేయలేకపోయారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan