Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 దిన 4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


ఆలయ సామాగ్రి

1 హూరాము-అబి ఇత్తడి బలిపీఠం చేశాడు. దాని పొడవు ఇరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు, ఎత్తు పది మూరలు.

2 అతడు పోతపోసిన ఒక గుండ్రని నీళ్ల తొట్టె చేయించాడు. అది ఈ అంచు నుండి ఆ అంచు వరకు పది మూరలు, దాని ఎత్తు అయిదు మూరలు. దాని చుట్టుకొలత ముప్పై మూరలు.

3 దాని అంచు క్రింద మూరకు పది చొప్పున చుట్టూ ఎడ్ల రూపాలు ఉన్నాయి. నీళ్ల తొట్టెను పోత పోసినప్పుడు ఆ ఎడ్లు రెండు వరుసలుగా పోత పోశారు.

4 ఆ నీళ్ల తొట్టె పన్నెండు ఎడ్ల మీద అమర్చబడింది, వాటిలో మూడు ఉత్తరం వైపు, మూడు పశ్చిమ వైపు, మూడు దక్షిణం వైపు, మూడు తూర్పు వైపు ఉన్నాయి. నీళ్ల తొట్టె వాటిపై ఉంచబడింది, వాటి వెనుకటి భాగాలు లోపలి వైపుకు ఉన్నాయి.

5 అది బెత్తెడు మందం కలిగి ఉండి, దాని అంచు పాత్ర అంచులా, తామర పువ్వులా ఉంది. దానిలో మూడు వేల బాతుల నీళ్లు పడతాయి.

6 దహనబలుల కోసం వాడే వాటిని కడగడానికి అతడు పది చిన్న గంగాళాలు చేయించి, దక్షిణ వైపున అయిదు, ఉత్తర వైపున అయిదింటిని పెట్టాడు. వాటిలో దహనబలుల కోసం వాడే వాటిని కడుగబడతాయి, అయితే పెద్ద గంగాళం యాజకులు కడుక్కోడానికి మాత్రమే ఉపయోగిస్తారు.

7 అతడు వాటి వివరాల ప్రకారం పది బంగారు దీపస్తంభాలను తయారుచేసి వాటిని మందిరంలో అయిదు దక్షిణం వైపు అయిదు ఉత్తరం వైపు ఉంచాడు.

8 పది బల్లలను చేయించి మందిరంలో దక్షిణ వైపున అయిదు, ఉత్తర వైపున అయిదు ఉంచాడు. బంగారంతో నూరు గిన్నెలను చేయించాడు.

9 యాజకుల ఆవరణాన్ని, పెద్ద ఆవరణాన్ని చేయించాడు, ఆ ఆవరణాలకు తలుపులు చేయించి వాటిని ఇత్తడితో పొదిగించాడు.

10 గంగాళాన్ని మందిరానికి దక్షిణ వైపున ముఖాన్ని ఆగ్నేయ దిక్కుకు త్రిప్పి ఉంచాడు.

11 హూరాము కుండలను, చేటలను, చిలకరించడానికి వాడే గిన్నెలను కూడా చేయించాడు. కాబట్టి హూరాము యెహోవా ఆలయానికి రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారం పనంతా చేసి ముగించాడు:

12 రెండు స్తంభాలు, ఆ రెండు స్తంభాల మీద ఉన్న గిన్నెలాంటి రెండు పీటలు, గిన్నెలాంటి ఆ రెండు పీటలను కప్పడానికి రెండు అల్లికలు,

13 స్తంభాలపై ఉన్న గిన్నెలాంటి పీటలను అలంకరిస్తూ ఒక్కొక్క అల్లికకు రెండేసి వరుసల చొప్పున ఆ రెండు అల్లికలకు నాలుగు వందల దానిమ్మపండ్లు,

14 ఆ పీటలు వాటిపై ఉన్న తొట్లు,

15 నీళ్ల తొట్టె దాని క్రింద ఉన్న పన్నెండు ఎడ్లు,

16 కుండలు, చేటలు, ముండ్ల కొంకులు మొదలైన పాత్రలు. హూరాము యెహోవా ఆలయానికి సొలొమోను రాజు చేయమన్న ఈ వస్తువులన్నీ మెరుగుపెట్టిన ఇత్తడితో తయారుచేశాడు.

17 రాజు వీటన్నిటిని యొర్దాను సమతల మైదానంలో, సుక్కోతుకు సారెతానుకు మధ్య ఉన్న బంకమట్టితో పోతపోయించాడు.

18 సొలొమోను చేయించిన ఇత్తడి వస్తువుల సంఖ్య చాలా ఎక్కువ. ఆ ఇత్తడి బరువు ఎంతో ఎవరూ నిర్ణయించలేదు.

19 దేవుని మందిరానికి సొలొమోను చేయించిన తక్కిన వస్తువులు: బంగారు బల్ల, సన్నిధి రొట్టెలు పెట్టే బల్లలు,

20 గర్భాలయం ఎదుట వెలుతురు ఉండడానికి మేలిమి బంగారు దీపస్తంభాలు, వాటి దీపాలు,

21 వాటి బంగారు పుష్పాలు దీపాలు కత్తెరలు పట్టుకారులు,

22 మేలిమి బంగారు చేసిన వత్తులు కత్తిరించే కత్తెరలు, చిలకరించే గిన్నెలు, పాత్రలు, ధూపకలశాలు; మందిర బంగారు తలుపులు: అతి పరిశుద్ధ స్థలానికి లోపలి తలుపులు, ప్రధాన గది తలుపులు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan