Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 దిన 16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


ఆసా చివరి సంవత్సరాలు

1 ఆసా పరిపాలిస్తున్న ముప్పై ఆరవ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీదికి వెళ్లి యూదా రాజైన ఆసా సరిహద్దులోనికి రాకపోకలు లేకుండ రామా పట్టణాన్ని పటిష్టం చేశాడు.

2 అప్పుడు ఆసా యెహోవా మందిరంలో, తన భవనంలో ఉన్న ఖజానాల్లో నుండి వెండి బంగారాలు తీసి దమస్కులో పరిపాలిస్తున్న సిరియా రాజైన బెన్-హదదుకు పంపాడు.

3 అతడు, “నా తండ్రికి నీ తండ్రికి మధ్య ఒప్పందం ఉన్నట్లు, నీకు నాకు మధ్య ఒప్పందం ఉండాలి. చూడు, నేను వెండి బంగారాలను పంపిస్తున్నాను. ఇప్పుడు ఇశ్రాయేలు రాజైన బయెషా నా దగ్గర నుండి వెళ్ళిపోయేలా అతనితో నీ ఒప్పందం తెంచుకో” అని అన్నాడు.

4 రాజైన ఆసాతో బెన్-హదదు ఏకీభవించి, తన సేనాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపాడు. వారు ఈయోను, దాను, ఆబేల్-మయీము, నఫ్తాలి ప్రాంతానికి చేరిన పట్టణాలలోని కొట్లను జయించారు.

5 బయెషా ఈ వార్త విని రామాను కట్టించడం మానేసి తన పనిని నిలిపి వేశాడు.

6 అప్పుడు రాజైన ఆసా యూదా మనుష్యులందరిని సమకూర్చాడు. వారు కూడి వచ్చి, రామా కట్టించడానికి బయెషా ఉపయోగించిన రాళ్లను, కలపను ఎత్తుకుపోయారు. వాటితో ఆసా గెబాను, మిస్పాను కట్టించాడు.

7 ఆ సమయంలో హనానీ అనే దీర్ఘదర్శి యూదా రాజైన ఆసా దగ్గరకు వచ్చి అతనితో ఇలా అన్నాడు, “నీవు నీ దేవుడు యెహోవాపై ఆధారపడక సిరియా రాజు ఆరాముపై ఆధారపడ్డావు. అందుచేతే అరాము రాజు సైన్యం నీ చేతిలో పడకుండా తప్పించుకుంది.

8 కూషీయులు లిబియానీయులు మహా సైన్యంగా చాలా రథాలలో రౌతులతో వచ్చారు గదా! అయినా, నీవు యెహోవాపై ఆధారపడినందున ఆయన వారిని నీ వశం చేశాడు.

9 తన పట్ల యథార్థంగా హృదయం ఉన్నవారికి సాయం చేయడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. ఆ విషయంలో నీవు తెలివితక్కువగా ప్రవర్తించావు. ఇకనుండి నీకు ఎప్పుడూ యుద్ధాలే.”

10 ఆసాకు ఆ దీర్ఘదర్శిమీద కోపం వచ్చి అతని మీద మండిపడి ఖైదులో వేశాడు. ఆ సమయంలో ప్రజల్లో కొందరిని ఆసా అణచివేశాడు.

11 ఆసా పరిపాలన గురించిన విషయాలు మొదటి నుండి చివరి వరకు యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.

12 ఆసా పరిపాలిస్తున్న ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో అతనికి పాదాల్లో జబ్బు పుట్టింది. దానివలన అతడు చాలా బాధ పడినా దాని గురించి కూడా యెహోవాను వెదకలేదు గాని వైద్యులను సహాయం కోరాడు.

13 తాను పరిపాలిస్తున్న నలభై ఒకటో సంవత్సరంలో ఆసా నిద్రపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు.

14 తన కోసం అతడు దావీదు పట్టణంలో తొలిపించుకొన్న సమాధిలో ప్రజలు అతన్ని పాతిపెట్టారు. సుగంధ ద్రవ్యాలతో, రకరకాల పరిమళాలతో నిండిన పాడెమీద అతన్ని ఉంచి, అతని అంత్యక్రియలు ఘనంగా జరిగించారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan