Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 సమూయేలు 30 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


దావీదు అమాలేకీయులను నాశనం చేయుట

1 దావీదు అతని మనుష్యులు మూడవ రోజున సిక్లగుకు చేరుకున్నారు. అంతలో అమాలేకీయులు దక్షిణదేశం మీద సిక్లగు మీద దాడిచేసి సిక్లగును దోచుకొని దానిని కాల్చివేశారు.

2 ఆడవారిని, చిన్నవారి నుండి పెద్దవారి వరకు అక్కడున్న అందరిని బందీలుగా పట్టుకుని, వారిని చంపకుండా తమతో పాటు తీసుకెళ్లారు.

3 దావీదు అతని మనుష్యులు సిక్లగు పట్టణం చేరుకున్నప్పుడు అది కాలిపోయి ఉండడం, వారి భార్యలు కుమారులు కుమార్తెలు బందీలుగా కొనిపోబడినట్లు చూశారు.

4 ఏడ్వడానికి శక్తి హరించిపోయే వరకు దావీదు అతని మనుష్యులు గట్టిగా ఏడ్చారు.

5 దావీదు ఇద్దరు భార్యలు యెజ్రెయేలుకు చెందిన అహీనోయము, కర్మెలుకు చెందిన నాబాలు విధవరాలు అబీగయీలు కూడా బందీలుగా కొనిపోబడ్డారు.

6 అక్కడున్న మనుష్యులు తమ కుమారులు కుమార్తెల గురించి తీవ్రంగా దుఃఖపడి ఆ బాధతో దావీదును రాళ్లతో కొట్టి చంపాలని వారు మాట్లాడుకోవడంతో దావీదు ఎంతో దుఃఖపడ్డాడు. కాని దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు.

7 తర్వాత దావీదు అహీమెలెకు కుమారుడును యాజకుడునైన అబ్యాతారుతో, “నాకు ఏఫోదు తీసుకురా” అని చెప్పినప్పుడు అబ్యాతారు దాన్ని తెచ్చాడు.

8 అప్పుడు దావీదు, “నేను ఈ గుంపును వెంటాడితే వారిని పట్టుకోగలనా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. అందుకు యెహోవా, “నీవు వెంటాడు, ఖచ్చితంగా నీవు వారిని పట్టుకుని నీ వారినందరిని విడిపించడంలో విజయం పొందుతావు” అని జవాబిచ్చారు.

9 కాబట్టి దావీదు అతనితో ఉన్న ఆరువందలమంది బయలుదేరి బెసోరు వాగు దగ్గరకు రాగా వారిలో రెండువందలమంది వెనుక ఉండిపోయారు.

10 ఆ రెండువందలమంది అలసిపోయి బెసోరు వాగు దాటలేక ఆగిపోయారు కానీ దావీదు నాలుగువందలమంది ఇంకా తరుముతూ వెళ్లారు.

11 పొలంలో ఒక ఈజిప్టువాడు కనబడగా వారు అతన్ని దావీదు దగ్గరకు తీసుకువచ్చి వానికి త్రాగడానికి నీళ్లు తినడానికి ఆహారం ఇచ్చారు.

12 అంజూర ముద్దలో ముక్క రెండు ద్రాక్షగుత్తులు ఇచ్చారు. అతడు మూడు పగళ్ళు మూడు రాత్రులు తిండిలేకుండా ఉండడంతో వాటిని తిన్న తర్వాత అతడు కోలుకున్నాడు.

13 అప్పుడు దావీదు, “నీది ఏ దేశం? ఎక్కడ నుండి వచ్చావు?” అని అతన్ని అడిగాడు. అందుకు అతడు, “ఈజిప్టుకు చెందిన నేను ఒక అమాలేకీయునికి బానిసను. మూడు రోజుల క్రితం నాకు ఆరోగ్యం బాగోలేదని నా యజమాని నన్ను వదిలేశాడు.

14 మేము దాడిచేసి కెరేతీయుల దక్షిణ దేశాన్ని యూదా దేశాన్ని కాలేబు దక్షిణ దేశాన్ని దోచుకొని సిక్లగును కాల్చివేశాము” అని చెప్పాడు.

15 “ఆ దోపిడి మూక దగ్గరకు నీవు నాకు దారి చూపిస్తావా?” అని దావీదు అడిగాడు. అప్పుడు వాడు, “నీవు నన్ను చంపవని నా యజమానికి అప్పగించనని దేవుని మీద నాకు ప్రమాణము చేస్తే ఆ గుంపును కలుసుకోడానికి నీకు దారి చూపిస్తాను” అన్నాడు.

16 తర్వాత వాడు దావీదును వారున్న చోటికి తీసుకెళ్లగా, వారంతా ఆ ప్రాంతంలో చెదిరిపోయి ఫిలిష్తీయుల దేశంలో యూదా దేశంలో తాము దోచుకున్న సొమ్ముతో తింటూ త్రాగుతూ ఆటపాటలలో మునిగిపోయారు.

17 దావీదు సాయంత్రం మొదలుపెట్టి మరునాటి సాయంత్రం వరకు వారిని చంపుతూ ఉంటే, ఒంటెల మీద ఎక్కి పారిపోయిన నాలుగువందలమంది యువకులు తప్ప మరియెవరూ తప్పించుకోలేకపోయారు.

18 దావీదు అమాలేకీయులు దోచుకున్న ప్రతిదాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. తన ఇద్దరు భార్యలను కూడా రక్షించాడు.

19 చిన్నవారు పెద్దవారు, కుమారులు కుమార్తెలు లేదా వారు దోచుకున్న వాటన్నిటిలో ఏదీ తక్కువ కాకుండా దావీదు అన్నిటిని తిరిగి తీసుకువచ్చాడు.

20 దావీదు అమాలేకీయుల గొర్రెలు పశువులన్నిటిని తీసుకున్నాడు; “ఇది దావీదు దోపుడుసొమ్ము” అని చెబుతూ అతని మనుష్యులు వాటిని మిగిలిన పశువులకు ముందుగా తోలారు.

21 అలసిపోయి దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర ఆగిపోయిన ఆ రెండువందలమంది దగ్గరకు దావీదు రాగా వారు దావీదును అతనితో ఉన్న మనుష్యులను కలుసుకోడానికి వచ్చారు. దావీదు వారి దగ్గరకు వచ్చి వారి క్షేమాన్ని అడిగి తెలుసుకున్నాడు.

22 కాని దావీదుతో పాటు వెళ్లిన వారిలో ఉన్న కొందరు దుర్మార్గులు ఇబ్బందులు కలుగజేసేవారు, “వీరు మనతో పాటు రాలేదు కాబట్టి వారి భార్యలను, పిల్లలను తప్ప మనం తిరిగి తెచ్చిన దోపుడు సొమ్ములో వీరికి ఏ భాగం ఇవ్వనవసరం లేదు” అన్నారు.

23 అందుకు దావీదు వారితో, “నా సోదరులారా; యెహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దోపిడి మూకను మనకు అప్పగించి మనకు దయ చేసిన దాని విషయంలో మీరు ఇలా చేయకూడదు.

24 మీరు చెప్పింది ఎవరు ఒప్పుకుంటారు? యుద్ధానికి వెళ్లిన వారికి ఎంత భాగం వస్తుందో సామాను దగ్గర ఉన్నవారికి అంతే భాగం వస్తుంది కదా! కాబట్టి అందరికి సమానభాగాలు వస్తాయి” అన్నాడు.

25 ఆ రోజు నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలుకు దానిని ఒక కట్టడగాను, నియమంగాను చేశాడు.

26 దావీదు సిక్లగుకు వచ్చినప్పుడు దోచుకున్న సొమ్ములో కొంత తీసి, “యెహోవా శత్రువుల దగ్గర నేను దోచుకున్న సొమ్ములో కొంత మీకు ఒక కానుకగా ఇస్తున్నాను” అని చెప్పి తన స్నేహితులైన యూదా పెద్దలకు పంపించాడు.

27 దావీదు దానిని బేతేలులో దక్షిణ రామోతులో యత్తీరులో ఉన్నవారికి,

28 అరోయేరులో, షిప్మోతులో, ఎష్తెమోవాలో ఉన్నవారికి,

29 రాకాలులో యెరహ్మెయేలీయుల కెనీయుల పట్టణాల్లో ఉన్నవారికి,

30 హోర్మాలో బోర్-ఆషానులో అతాకులో ఉన్నవారికి,

31 హెబ్రోనులో ఉన్నవారికి, దావీదు అతని మనుష్యులు తిరిగిన అన్ని స్థలాల్లో ఉన్న పెద్దలకు పంపించాడు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan