Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 సమూయేలు 23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


దావీదు కెయీలాను రక్షించుట

1 “చూడండి, ఫిలిష్తీయులు కెయీలాతో పోరాడి నూర్పిడి కళ్ళాలను దోచుకుంటున్నారు” అని దావీదుకు చెప్పినప్పుడు,

2 దావీదు, “నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులను చంపనా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. అందుకు యెహోవా, “నీవు వెళ్లి ఫిలిష్తీయుల మీద దాడి చేసి కెయీలాను రక్షించు” అని అతనికి జవాబిచ్చారు.

3 దావీదుతో ఉన్న మనుష్యులు, “మేము యూదా దేశంలో ఉన్నా మాకు భయంగా ఉంది. ఒకవేళ మేము ఫిలిష్తీయుల సైన్యాలకు ఎదురుగా కెయీలాకు వెళ్తే మరింత భయం వేస్తుంది గదా” అన్నారు.

4 దావీదు మరోసారి యెహోవా దగ్గర విచారణ చేసినప్పుడు, “నీవు లేచి కెయీలాకు వెళ్లు, నేను ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగిస్తాను” అని యెహోవా జవాబిచ్చారు.

5 కాబట్టి దావీదు అతని ప్రజలు కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారందరిని చంపి వారి పశువులను దోచుకున్నారు. ఇలా దావీదు ఫిలిష్తీయులకు భారీనష్టం కలిగించి కెయీలా ప్రజలను రక్షించాడు.

6 (అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు పారిపోయి కెయీలాలో ఉన్న దావీదు దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఏఫోదు తీసుకుని వచ్చాడు.)


సౌలు దావీదును వెంటాడుట

7 దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని, “ద్వారాలు అడ్డు గడియలు ఉన్న పట్టణం లోపలికి వెళ్లి దావీదు అందులో బందీ అయ్యాడు కాబట్టి దేవుడు అతన్ని నా చేతికి అప్పగించారు” అనుకున్నాడు.

8 కాబట్టి సౌలు కెయీలాకు వెళ్లి దావీదును అతని ప్రజలను ముట్టడించాలని తన సైన్యాన్నంతా యుద్ధానికి పిలిచాడు.

9 సౌలు తనకు కీడు చేయాలని కుట్ర చేస్తున్నాడని తెలుసుకున్న దావీదు యాజకుడైన అబ్యాతారుతో, “ఏఫోదు తీసుకురా” అని చెప్పాడు.

10 అప్పుడు దావీదు, “ఇశ్రాయేలీయుల దేవుడవైన యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నా కారణంగా పట్టణాన్ని నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నాడని మీ దాసుడనైన నాకు ఖచ్చితంగా తెలిసింది.

11 కెయీలా పౌరులు నన్ను అతని చేతికి అప్పగిస్తారా? మీ సేవకుడనైన నేను విన్నట్లుగా సౌలు వస్తాడా? ఇశ్రాయేలీయుల దేవుడవైన యెహోవా, దయచేసి మీ సేవకుడనైన నాకు చెప్పండి” అని ప్రార్థించాడు. “అతడు వస్తాడు” అని యెహోవా జవాబిచ్చారు.

12 దావీదు మరల, “కెయీలా పౌరులు నన్ను నా ప్రజలను సౌలు చేతికి అప్పగిస్తారా?” అని అడిగాడు. అందుకు యెహోవా, “వారు నిన్ను అప్పగిస్తారు” అని జవాబిచ్చారు.

13 కాబట్టి దావీదు, అతని మనుష్యులు దాదాపు ఆరువందలమంది కెయీలాను విడిచి ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్లారు. దావీదు కెయీలా నుండి పారిపోయాడని సౌలుకు తెలిసి అక్కడికి వెళ్లలేదు.

14 అయితే దావీదు అరణ్యంలో, బలమైన కోటలలో, జీఫు అడవి కొండల్లో నివసించాడు. ప్రతిరోజు సౌలు అతన్ని వెదికాడు కాని దేవుడు సౌలు చేతికి అతని అప్పగించలేదు.

15 తన ప్రాణం తీయడానికి సౌలు బయలుదేరాడని తెలుసుకుని దావీదు జీఫు ఎడారిలోని హోరేషులో ఉన్నాడు.

16 అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను హోరేషులో ఉన్న దావీదు దగ్గరకు వచ్చి దేవుని బట్టి అతన్ని బలపరుస్తూ,

17 “భయపడకు, నా తండ్రియైన సౌలు నిన్ను పట్టుకోలేడు నీవు ఇశ్రాయేలీయులకు రాజవుతావు; నీ తర్వాతి స్థానంలో నేను ఉంటాను. ఇది నా తండ్రియైన సౌలుకు కూడా తెలుసు” అని చెప్పాడు.

18 వీరిద్దరు యెహోవా ఎదుట నిబంధన చేసుకున్న తర్వాత యోనాతాను ఇంటికి వెళ్లిపోయాడు కాని దావీదు హోరేషులోనే ఉన్నాడు.

19 జీఫీయులు బయలుదేరి గిబియాలో ఉన్న సౌలు దగ్గరకు వచ్చి, “యెషీమోనుకు దక్షిణంగా ఉన్న హకీలా కొండమీద హోరేషు బలమైన కోటల దగ్గర మా మధ్య దావీదు దాక్కున్నాడా హోరేషు కొండ దగ్గర మా మధ్య దావీదు దాక్కున్నాడు?

20 రాజా, మీకు ఇష్టమైతే మాతో రండి, రాజైన మీ చేతికి అతన్ని అప్పగించే బాధ్యత మాది” అన్నారు.

21 అప్పుడు సౌలు వారితో, “మీకు నాపై ఉన్న కనికరాన్ని బట్టి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.

22 మీరు వెళ్లి ఇంకా సమాచారం తెలుసుకోండి. దావీదు ఎక్కడ ఉంటున్నాడో, అతన్ని ఎవరు చూశారో తెలుసుకోండి. అతడు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నాడని నాకు తెలిసింది.

23 అతడు దాక్కున్న స్థలాలన్నిటిని కనిపెట్టి ఆ వివరాలు తీసుకుని నా దగ్గరకు మళ్ళీ రండి. అప్పుడు నేను మీతో కూడా వచ్చి అతడు దేశంలో ఎక్కడ ఉన్నా యూదా వంశస్థుల అందరిలో నేను అతన్ని వెదికి పట్టుకుంటాను” అన్నాడు.

24 వారు బయలుదేరి సౌలు కంటే ముందు జీఫుకు తిరిగి వెళ్లారు. దావీదు అతని ప్రజలు యెషీమోనుకు దక్షిణాన ఉన్న అరాబాలో మాయోను ఎడారిలో ఉన్నారు.

25 సౌలు అతని మనుష్యులు తనను వెదకడం మొదలుపెట్టారని దావీదుకు తెలిసినప్పుడు కొండ శిఖరం దిగి మాయోను ఎడారిలో నివసించాడు. సౌలు అది విని దావీదును తరుముతూ మాయోను ఎడారిలోనికి వెళ్లాడు.

26 అయితే పర్వతానికి ఒకవైపు సౌలు, మరోవైపు దావీదు అతని ప్రజలు వెళ్తుండగా దావీదు సౌలు నుండి తప్పించుకోవాలని తొందరపడుతున్నాడు. సౌలు అతని ప్రజలు దావీదును అతని ప్రజలను పట్టుకోవాలని వారిని చుట్టుముడుతున్నారు.

27 అప్పుడు ఒక దూత సౌలు దగ్గరకు వచ్చి, “త్వరగా రా, దేశం మీదకి ఫిలిష్తీయులు దండెత్తి వచ్చారు” అని చెప్పాడు.

28 సౌలు దావీదును తరమడం మాని ఫిలిష్తీయులను ఎదుర్కోడానికి వెనుకకు తిరిగి వెళ్లాడు. కాబట్టి ఆ స్థలానికి సెలా హమ్మలెకోతు అని ఆ పేరు పెట్టారు.

29 తర్వాత దావీదు అక్కడినుండి బయలుదేరి ఎన్-గేదీకి వచ్చి కొండ ప్రాంతంలో నివసించాడు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan