Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 సమూయేలు 22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


అదుల్లాము యొక్క గుహ మిస్పా దగ్గర దావీదు

1 దావీదు అక్కడినుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకుని వెళ్లాడు. అతని అన్నదమ్ములు అతని తండ్రి ఇంటివారందరు ఆ విషయం విని అతని దగ్గరకు వచ్చారు.

2 ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పులలో ఉన్నవారు, అసంతృప్తితో ఉన్నవారందరు అతని దగ్గరకు రాగా అతడు వారికి అధిపతి అయ్యాడు. సుమారు నాలుగువందలమంది అతని దగ్గర ఉన్నారు.

3 దావీదు అక్కడినుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, “నా పట్ల దేవుని చిత్తం ఏమిటో నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులను వచ్చి మీ దగ్గర ఉండనివ్వగలరా?” అని మోయాబు రాజును అడిగాడు.

4 అతడు వారిని మోయాబు రాజు దగ్గర విడిచి వెళ్లాడు. దావీదు కొండల్లో దాక్కొని ఉన్నంత కాలం వారు అక్కడే ఉన్నారు.

5 అయితే గాదు ప్రవక్త వచ్చి దావీదుతో, “బలమైన కోటలలో ఉండవద్దు, యూదా దేశానికి పారిపో” అని చెప్పాడు. కాబట్టి దావీదు హెరెతు అడవిలోకి వెళ్లాడు.


సౌలు నోబు యాజకులను చంపుట

6 ఒక రోజు దావీదు అతని మనుష్యులు ఎక్కడ ఉన్నారో సౌలుకు తెలిసింది. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచుల వృక్షం క్రింద ఈటె పట్టుకుని కూర్చున్నాడు. అతని సేవకులు అతని చుట్టూ నిలబడి ఉన్నారు.

7 సౌలు వారితో, “బెన్యామీనీయులారా వినండి, యెష్షయి కుమారుడు మీకు పొలాలు ద్రాక్షతోటలు ఇస్తాడా? మిమ్మల్ని వేలమంది మీద వందలమంది మీద అధిపతులుగా చేస్తాడా?

8 అందుకని మీరు నా మీద కుట్ర చేస్తున్నారా? నా కుమారుడు యెష్షయి కుమారునితో నిబంధన చేసుకున్న సంగతి మీరెవరు నాకు చెప్పలేదు. ఈ రోజు జరుగుతున్నట్లుగా నా కోసం పొంచి ఉండేలా నా కుమారుడు నా సేవకుని ప్రేరేపించినా, నా గురించి మీలో ఎవరికి చింతలేదు” అన్నాడు.

9 అప్పుడు సౌలు సేవకుల దగ్గర నిలబడి ఉన్న ఎదోమీయుడైన దోయేగు, “యెష్షయి కుమారుడు నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రావడం నేను చూశాను.

10 అహీమెలెకు అతని తరపున యెహోవా దగ్గర విచారణ చేసి, ఆహారాన్ని ఫిలిష్తీయుడైన గొల్యాతు కత్తిని అతనికి ఇచ్చాడు” అని చెప్పాడు.

11 అప్పుడు రాజు, యాజకుడును అహీటూబు కుమారుడునైన అహీమెలెకును నోబులో ఉన్న అతని తండ్రి ఇంటివారైన యాజకులందరిని పిలుచుకురమ్మని పంపించాడు. వారు రాజు దగ్గరకు వచ్చినప్పుడు,

12 సౌలు, “అహీటూబు కుమారుడా, విను” అని అన్నాడు. అందుకతడు, “చిత్తం ప్రభువా” అని జవాబిచ్చాడు.

13 సౌలు అతనితో, “నీవూ యెష్షయి కుమారుడు కలిసి ఎందుకు నా మీద కుట్ర చేశారు? నీవు అతనికి ఆహారాన్ని ఖడ్గాన్ని ఇచ్చి అతని తరపున దేవుని దగ్గర విచారణ చేశావు, అందుకు అతడు నా మీద తిరుగుబాటు చేస్తూ ఇలా ఈ రోజు నా కోసం పొంచి ఉన్నాడు” అని అన్నాడు.

14 అందుకు అహీమెలెకు, “రాజా, దావీదువంటి నమ్మకమైనవాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతడు రాజుకు అల్లుడు, నీ అంగరక్షకుల నాయకుడు, నీ కుటుంబంలో ఎంతో గౌరవం ఉన్నవాడు.

15 అతని తరపున నేను దేవుని దగ్గర విచారణ చేయడం ఈ రోజే ప్రారంభించానా? కాదు కదా! ఈ విషయం గురించి నీ సేవకుడనైన నాకు ఏమాత్రం తెలియదు కాబట్టి రాజు తన సేవకుని మీద గాని అతని తండ్రి ఇంటివారి మీద నేరం మోపకూడదు” అన్నాడు.

16 అయితే రాజు, “అహీమెలెకూ, నీవు నీ తండ్రి ఇంటివారందరు తప్పక చస్తారు” అన్నాడు.

17 తర్వాత, “యెహోవా యాజకులైన వీరు దావీదు పక్షం ఉన్నారు. అతడు పారిపోయిన విషయం తెలిసినా నాకు చెప్పలేదు కాబట్టి మీరు వెళ్లి వీరందరిని చంపండి” అని తన చుట్టూ నిలబడి ఉన్న సైనికులకు ఆజ్ఞాపించాడు. అయితే రాజు అధికారులు యెహోవా యాజకులను చంపడానికి ఒప్పుకోలేదు.

18 కాబట్టి రాజు దోయేగుతో, “నీవు ఈ యాజకుల మీద పడి చంపు” అన్నాడు. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి నార ఏఫోదు ధరించి ఉన్న ఎనభై అయిదుగురిని ఆ రోజున చంపాడు.

19 అతడు యాజకుల పట్టణమైన నోబులో ఉంటున్న వారందరిని అనగా మగవారిని ఆడవారిని పిల్లలను చంటి పిల్లలను పశువులను గాడిదలను గొర్రెలను కత్తితో చంపాడు.

20-21 అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అనే ఒకడు తప్పించుకుని పారిపోయి దావీదు దగ్గరకు వచ్చి, సౌలు యెహోవా యాజకులను చంపించిన విషయం దావీదుకు చెప్పాడు.

22 అప్పుడు దావీదు అబ్యాతారుతో, “ఆ రోజు ఎదోమీయుడైన దోయేగు అక్కడే ఉన్నాడు కాబట్టి వాడు సౌలుకు ఖచ్చితంగా ఈ విషయం చెప్తాడని నేను అనుకున్నాను. నీ తండ్రి ఇంటివారందరు చనిపోవడానికి నేను కారణమయ్యాను.

23 నీవు భయపడకుండా నా దగ్గర ఉండు, నిన్ను చంపడానికి చూస్తున్నవాడే నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు. నా దగ్గరే నీవు క్షేమంగా ఉంటావు” అని చెప్పాడు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan