Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 రాజులు 8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


దేవాలయానికి తేబడిన మందసం

1 అప్పుడు రాజైన సొలొమోను దావీదు పట్టణమైన సీయోను నుండి యెహోవా నిబంధన మందసాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలు పెద్దలను, గోత్రాల పెద్దలను, ఇశ్రాయేలీయుల కుటుంబాల నాయకులందరిని యెరూషలేములో తన దగ్గరకు పిలిపించాడు.

2 ఏతనీము అనే ఏడవ నెలలో, పండుగ సమయంలో ఇశ్రాయేలీయులందరు రాజైన సొలొమోను ఎదుట సమావేశమయ్యారు.

3 ఇశ్రాయేలు పెద్దలందరు వచ్చాక, యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని తీసుకుని,

4 వారు యెహోవా మందసాన్ని, సమావేశ గుడారాన్ని, అందులోని పవిత్ర వస్తువులన్నీ తీసుకువచ్చారు. యాజకులు, లేవీయులు వాటిని పైకి మోసుకెళ్లారు.

5 రాజైన సొలొమోను, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులందరు మందసం ముందు సమావేశమై, లెక్కలేనన్ని గొర్రెలను పశువులను బలి ఇచ్చారు.

6 తర్వాత యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని మందిరంలోని గర్భాలయం అనే అతి పరిశుద్ధ స్థలంలో దాని స్థలానికి తీసుకువచ్చి, కెరూబుల రెక్కల క్రింద పెట్టారు.

7 కెరూబుల రెక్కలు మందసం ఉన్న స్థలం మీదుగా చాపబడి మందసాన్ని, దానిని మోసే కర్రలను కప్పివేశాయి.

8 ఈ మోతకర్రలు చాలా పొడవుగా ఉండడం వల్ల, వాటి అంచులు గర్భాలయానికి ముందున్న పరిశుద్ధ స్థలంలో నుండి కనబడతాయి, కాని పరిశుద్ధస్థలం బయట నుండి కనబడవు; ఈనాటికీ అవి అక్కడే ఉన్నాయి.

9 మోషే హోరేబులో ఉన్నప్పుడు, అనగా ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన తర్వాత యెహోవా వారితో నిబంధన చేసినప్పుడు మందసంలో పెట్టిన రెండు రాతిపలకలు తప్ప మరేమీ దానిలో లేవు.

10 యాజకులు పరిశుద్ధస్థలం నుండి బయటకు వచ్చినప్పుడు యెహోవా మందిరాన్ని మేఘం కమ్ముకుంది.

11 యెహోవా మహిమ ఆయన మందిరం నిండ కమ్ముకున్న ఆ మేఘాన్ని బట్టి యాజకులు తమ సేవ చేయలేకపోయారు.

12 అప్పుడు సొలొమోను, “యెహోవా తాను చీకటి మేఘంలో నివసిస్తారని ఆయన చెప్పారు;

13 నేను మీ కోసం ఘనమైన మందిరాన్ని కట్టించాను, అది మీరు ఎల్లకాలం నివసించగలిగే స్థలం” అని అన్నాడు.

14 ఇశ్రాయేలు సమాజమంతా అక్కడ నిలబడి ఉండగా రాజు వారివైపు తిరిగి, వారిని దీవించాడు.

15 అప్పుడతడు ఇలా అన్నాడు: “నా తండ్రియైన దావీదుకు మాట ఇచ్చి తన స్వహస్తంతో దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక. ఎందుకంటే ఆయన ఇలా అన్నారు:

16 ‘ఈజిప్టు నుండి నేను నా ప్రజలను తీసుకువచ్చిన రోజు నుండి, నా పేరిట మందిరం కట్టించుకోడానికి ఇశ్రాయేలు గోత్రాలకు చెందిన పట్టణాల్లో దేనినీ నేను ఎన్నుకోలేదు, కాని నా ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించడానికి దావీదును ఎన్నుకున్నాను.’

17 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున మందిరం కట్టించాలనే ఆశ నా తండ్రి దావీదు హృదయంలో ఉండింది.

18 కాని, యెహోవా నా తండ్రియైన దావీదుతో, ‘నా పేరున మందిరాన్ని కట్టించాలనే ఆశ నీ హృదయంలో ఉండడం మంచిదే.

19 అయితే కట్టించేది నీవు కాదు, నీ రక్తం పంచుకుని పుట్టే కుమారుడు నా పేరున మందిరాన్ని కట్టిస్తాడు’ అన్నారు.

20 “యెహోవా తన వాగ్దానం నిలబెట్టుకున్నారు; యెహోవా వాగ్దానం చేసినట్లే, నేను నా తండ్రి దావీదు స్థానంలో ఇశ్రాయేలు రాజ సింహాసనం ఎక్కాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున మందిరాన్ని కట్టించాను.

21 యెహోవా మన పూర్వికులను ఈజిప్టు నుండి తీసుకువచ్చినప్పుడు, ఆయన వారితో చేసిన నిబంధనను తెలిపే మందసం కోసం మందిరంలో స్థలం ఏర్పాటు చేశాను.”


సొలొమోను ప్రతిష్ఠ ప్రార్థన

22 అప్పుడు సొలొమోను యెహోవా బలిపీఠం ముందు, ఇశ్రాయేలు సమాజమంతటి సమక్షంలో నిలబడి ఆకాశం వైపు చేతులు చాపి,

23 ఇలా ప్రార్థించాడు: “యెహోవా, ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశంలో గాని, క్రింద భూమిమీద గాని, మీలాంటి దేవుడు మరొకడు లేడు. మీ మార్గంలో హృదయమంతటితో కొనసాగే మీ సేవకుల పట్ల మీ ప్రేమ నిబంధనను నెరవేరుస్తారు.

24 మీరు మీ సేవకుడూ, నా తండ్రియైన దావీదుతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారు; మీ నోటితో చేసిన వాగ్దానాన్ని ఈ రోజున కనబడుతున్నట్టుగా మీ చేతులతో నెరవేర్చారు.

25 “ఇప్పుడు యెహోవా! ఇశ్రాయేలు దేవా! మీరు మీ సేవకుడూ, నా తండ్రియైన దావీదుతో, ‘నీ వారసులు తమ ప్రవర్తన విషయంలో జ్రాగత్తగా ఉంటూ, నీలా నా ఎదుట నమ్మకంగా జీవిస్తే, ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనుడయ్యేవాడు నీ సంతానంలో ఉండక పోడు’ అని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చండి.

26 ఇప్పుడు ఇశ్రాయేలు దేవా! మీ సేవకుడైన నా తండ్రి దావీదుతో మీరు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచండి.

27 “దేవుడు భూమి మీద నిజంగా నివాసం చేస్తారా? ఆకాశ మహాకాశం మీకు సరిపోవు, నేను కట్టించిన ఈ మందిరం ఏం సరిపోతుంది!

28 అయినా యెహోవా నా దేవా, మీ దాసుడైన నేను చేసే ప్రార్థన, కనికరం కోసం చేసే విన్నపం ఆలకించండి. ఈ రోజు మీ దాసుడు మీ సన్నిధిలో చేసే మొరను, ప్రార్థనను వినండి.

29 నా పేరు అక్కడ ఉంటుందని మీరు ఈ మందిరాన్ని గురించి అన్నారు. కాబట్టి మీ దాసుడు ఈ స్థలం వైపు తిరిగి చేసే ప్రార్థన మీరు వినేలా రాత్రింబగళ్ళు మీ కనుదృష్టి ఈ మందిరంపై ఉంచండి.

30 మీ దాసుడు, మీ ఇశ్రాయేలు ప్రజలు ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు వారి విన్నపం ఆలకించండి. మీ నివాసస్థలమైన పరలోకం నుండి వినండి, మీరు విన్నప్పుడు క్షమించండి.

31 “ఎవరైనా తన పొరుగువారి పట్ల తప్పు చేశారని ఆరోపించబడి వారు ప్రమాణం చేయాల్సివస్తే ఈ మందిరంలో మీ బలిపీఠం ముందు ఆ ప్రమాణం చేసినప్పుడు,

32 మీరు ఆకాశం నుండి విని మీ దాసులకు న్యాయం తీర్చండి. దోషులను వారి దోషం బట్టి శిక్షిస్తూ, నిర్దోషుల నిర్దోషత్వాన్ని బట్టి వారి నిర్దోషత్వాన్ని నిర్ధారించండి.

33 “మీ ఇశ్రాయేలు ప్రజలు మీకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు వారి శత్రువుల చేతిలో ఓడిపోయినప్పుడు, వారు మీ వైపు తిరిగి మీ నామానికి స్తుతి చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఈ మందిరంలో మిమ్మల్ని వేడుకున్నప్పుడు,

34 మీరు పరలోకం నుండి విని, మీ ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని క్షమించి, వారి పూర్వికులకు మీరు ఇచ్చిన దేశానికి వారిని మళ్ళీ తీసుకురండి.

35 “మీ ప్రజలు మీకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు, ఆకాశం మూయబడి వర్షం లేనప్పుడు, వారు తమకు కలిగిన శ్రమ వలన తమ పాపం విడిచిపెట్టి ఈ స్థలం వైపు తిరిగి మీ నామానికి స్తుతి చెల్లిస్తూ, ప్రార్థిస్తే,

36 మీరు పరలోకం నుండి విని, మీ దాసులు, మీ ఇశ్రాయేలు ప్రజల పాపాన్ని క్షమించండి. సరైన మార్గాన్ని అనుసరిస్తూ జీవించాలని వారికి బోధించండి, మీ ప్రజలకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో వర్షం కురిపించండి.

37 “దేశంలో కరువు గాని తెగులు గాని వడగాలి గాని నాచు గాని మిడతలు గాని పురుగులు గాని వచ్చినా, వారి శత్రువు వారి పట్టణాల్లో వారిని ముట్టడి చేసినా, ఏదైనా విపత్తు గాని రోగం గాని వచ్చినా,

38 మీ ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా తమ హృదయాల వేదనలు తెలుసుకొని, ఈ మందిరం వైపు తమ చేతులను చాచి ప్రార్థన విన్నపం చేస్తే,

39 ప్రతి మనిషి హృదయం మీకు తెలుసు కాబట్టి మీ నివాసస్థలమైన పరలోకం నుండి విని క్షమించి, ఎవరు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతిఫలమివ్వండి (ఎందుకంటే ప్రతి మానవ హృదయం మీకు తెలుసు),

40 అప్పుడు మీరు మా పూర్వికులకిచ్చిన ఈ దేశంలో వారు బ్రతికి ఉన్నంత కాలం మీకు భయపడతారు.

41 “మీ ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించని విదేశీయులు, మీ పేరును బట్టి దూరదేశం నుండి వచ్చినవారు,

42 మీ గొప్ప నామం గురించి మీ బలమైన బాహువును గురించి వారు విని, వారు వచ్చి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే,

43 మీ నివాసస్థలమైన పరలోకం నుండి వినండి. విదేశీయులు మిమ్మల్ని ఏమి అడిగినా అది వారికి చేయండి. అప్పుడు భూలోక ప్రజలు మీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లా మీ పేరు తెలుసుకొని మీకు భయపడతారు. నేను కట్టిన ఈ మందిరం మీ పేరు కలిగి ఉందని తెలుసుకుంటారు.

44 “మీ ప్రజలు తమ శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్లినప్పుడు, మీరు వారిని ఎక్కడికి పంపినా, మీరు ఎన్నుకున్న పట్టణం వైపు, నేను మీ నామం కోసం కట్టిన మందిరం వైపు తిరిగి, వారు యెహోవాకు ప్రార్థన చేస్తే,

45 అప్పుడు పరలోకం నుండి వారి ప్రార్థన విన్నపం విని వారి పక్షాన ఉండండి.

46 “పాపం చేయని మనుష్యులు లేరు కాబట్టి వారు మీకు విరుద్ధంగా పాపం చేసినప్పుడు, మీరు వారిపై కోప్పడి శత్రువులకు అప్పగిస్తే, వారు వీరిని దూరంగా లేదా దగ్గరగా ఉన్న తమ దేశానికి బందీలుగా తీసుకెళ్తారు;

47 అప్పుడు వారు బందీలుగా ఉన్న దేశంలో ఉన్నప్పుడు వారి హృదయాలు మారి పశ్చాత్తాపపడి, ‘మేము తప్పు చేసి దుర్మార్గంగా ప్రవర్తించి పాపం చేశాం’ అని వారు వేడుకుంటే,

48 తాము బందీగా ఉన్న దేశంలో వారు తమ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో మరలా మీ వైపు తిరిగి, వారి పూర్వికులకు మీరు ఇచ్చిన దేశం వైపు, మీరు ఎన్నుకున్న పట్టణం వైపు, నేను మీ నామం కోసం కట్టిన మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే,

49 అప్పుడు మీ నివాసస్థలమైన పరలోకం నుండి వారి ప్రార్థన, వారి విన్నపం విని, వారి పక్షాన ఉండండి.

50 మీకు విరుద్ధంగా పాపం చేసిన మీ ప్రజలను క్షమించండి; మీకు విరుద్ధంగా వారు చేసిన తప్పులన్నిటిని క్షమించి, వారిని బందీగా తీసుకెళ్లిన వారు వీరిని కరుణించేలా చేయండి;

51 ఎందుకంటే వారు మీ ప్రజలు, మీ స్వాస్థ్యం, మీరు వారిని ఈజిప్టు నుండి ఆ ఇనుప కొలిమి మధ్యలో నుండి బయట తీసుకువచ్చారు.

52 “కాబట్టి మీ కనుదృష్టి మీ దాసుని మీద, ఇశ్రాయేలు ప్రజల విన్నపం మీద ఉండును గాక, వారు మీకు మొరపెట్టినప్పుడు మీరు విందురు గాక.

53 ఎందుకంటే ప్రభువైన యెహోవా, మీరు మా పూర్వికులను ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు మీ సేవకుడైన మోషే ద్వారా ప్రకటించినట్లుగానే, లోకంలోని జనాంగాలన్నిటి నుండి వారిని మీ సొంత వారసత్వంగా చేసుకున్నారు కదా.”

54 సొలొమోను యెహోవాకు ఈ ప్రార్థనలు, విన్నపాలు అన్ని చేసిన తర్వాత, యెహోవా బలిపీఠం ముందు మోకరించి ఆకాశం వైపు చేతులు చాచిన ఆ స్థలం నుండి లేచాడు.

55 అతడు నిలబడి ఇశ్రాయేలు సమాజమంతటిని దీవిస్తూ, స్వరమెత్తి ఇలా అన్నాడు:

56 “యెహోవాకు స్తుతి కలుగును గాక! తన వాగ్దానం ప్రకారం ఆయన తన ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది కలుగజేశారు. ఆయన తన సేవకుడైన మోషేకు ఇచ్చిన మంచి వాగ్దానాలన్నిటిలో ఒక్కటి కూడా తప్పలేదు.

57 మన పూర్వికులతో ఉన్నట్లు మన దేవుడైన యెహోవా మనతో ఉండును గాక; ఆయన మనలను విడువక త్రోసివేయక ఉండును గాక.

58 ఆయన మార్గాన్ని అనుసరిస్తూ, ఆయన మన పూర్వికులకు ఇచ్చిన ఆజ్ఞలను, శాసనాలను, నియమాలను పాటించడానికి, ఆయన వైపు మన హృదయాలను త్రిప్పాలి.

59 ఆయన తన దాసుని పక్షాన, తన ఇశ్రాయేలు ప్రజల పక్షాన అనుదిన అవసరత ప్రకారం కార్యాన్ని జరిగించేలా నేను యెహోవా ఎదుట ప్రార్థన చేస్తూ మాట్లాడిన ఈ మాటలు, మన దేవుడైన యెహోవా ఎదుట రాత్రింబగళ్ళు నిలిచి ఉండాలి!

60 అప్పుడు ప్రపంచంలోని అన్ని జనాంగాలు యెహోవాయే దేవుడని, వేరెవరు లేరని తెలుసుకుంటారు.

61 మీ హృదయాలు ఇప్పుడున్నట్లుగా దేవుడైన యెహోవాకు పూర్తిగా సమర్పించుకొని, ఆయన శాసనాలు ప్రకారం జీవిస్తూ, ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఉండును గాక.”


ఆలయ ప్రతిష్ఠ

62 తర్వాత రాజు, అతనితో ఉన్న ఇశ్రాయేలు ప్రజలంతా యెహోవా ఎదుట బలులు అర్పించారు.

63 సొలొమోను యెహోవాకు సమాధానబలులుగా 22,000 పశువులు, 1,20,000 గొర్రెలు, మేకలు అర్పించాడు. ఈ విధంగా రాజు, ఇశ్రాయేలీయులందరు యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించారు.

64 యెహోవా సమక్షంలో ఉన్న ఇత్తడి బలిపీఠం మీద అర్పించలేనంత ఎక్కువగా ఆ దహనబలులు, భోజనార్పణలు, సమాధానబలుల క్రొవ్వు ఉంది కాబట్టి అదే రోజు రాజు యెహోవా ఆలయానికి ముందున్న ఆవరణం మధ్య భాగాన్ని అతడు పవిత్రపరచి, దహనబలులు, భోజనార్పణలు, సమాధానబలుల క్రొవ్వును అర్పించాడు.

65 ఆ సమయంలో సొలొమోను అతనితో ఇశ్రాయేలు ప్రజలంతా పండుగ చేశారు. లెబో హమాతుకు వెళ్లే మార్గం నుండి ఈజిప్టు వాగువరకు ఉన్న ప్రాంతాల నుండి ప్రజలు గొప్ప సమూహంగా వచ్చి దేవుడైన యెహోవా ఎదుట ఏడు రోజులే కాకుండ మరి ఏడు రోజులు, మొత్తం పద్నాలుగు రోజులు పండుగ చేసుకున్నారు.

66 తర్వాత రోజు అతడు ప్రజలను పంపించేశాడు. వారు రాజును దీవిస్తూ, యెహోవా తన సేవకుడైన దావీదుకు, తన ప్రజలైన ఇశ్రాయేలుకు చేసిన మంచి వాటినన్నిటిని బట్టి హృదయంలో ఆనందంతో, సంతోషంతో తమ ఇళ్ళకు వెళ్లారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan