Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 రాజులు 5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


ఆలయ నిర్మాణానికి సన్నాహాలు

1 సొలొమోను తన తండ్రియైన దావీదు తర్వాత రాజుగా అభిషేకించబడ్డాడని తూరు రాజైన హీరాము విని సొలొమోను దగ్గరకు తన రాయబారులను పంపాడు; ఎందుకంటే అతడు దావీదుతో ఎల్లప్పుడూ స్నేహంగా ఉండేవాడు.

2 సొలొమోను హీరాముకు ఇలా సందేశం పంపాడు:

3 “యెహోవా, నా తండ్రియైన దావీదు శత్రువులను అతని పాదాల క్రింద అణచే వరకు అతడు అన్ని వైపుల నుండి యుద్ధాలు చేశాడు. కాబట్టి అతడు తన దేవుడైన యెహోవా నామం కోసం ఒక దేవాలయాన్ని కట్టలేకపోయాడు.

4 అయితే ఇప్పుడు నా దేవుడైన యెహోవా ప్రతి వైపు నాకు విశ్రాంతి కలుగజేశారు, నాకు విరోధి లేరు, విపత్తులు లేవు.

5 కాబట్టి నా తండ్రియైన దావీదుతో, ‘నీ స్థానంలో సింహాసనం మీద నీ కుమారున్ని కూర్చోబెడతాను, అతడు నా నామం కోసం దేవాలయం కడతాడు’ అని ఆయన అన్నట్లు, నేను నా దేవుడైన యెహోవా నామంలో దేవాలయం కట్టడానికి నిర్ణయించుకున్నాను.

6 “కాబట్టి నా కోసం లెబానోనులో దేవదారు చెట్లను నరకమని ఆదేశాలు ఇవ్వండి. నా పనివారు మీ పనివారితో కలసి పనిచేస్తారు, మీ పనివారికి మీరు ఎంత జీతం నిర్ణయిస్తే అంత మీకిస్తాను, ఎందుకంటే సీదోనీయుల్లా మ్రాను నరికే నిపుణులు మా దగ్గర లేరని మీకు తెలుసు.”

7 హీరాము సొలొమోను చెప్పింది విన్నప్పుడు ఎంతో సంతోషించి, “ఈ గొప్ప దేశాన్ని ఏలడానికి ఈ రోజు దావీదుకు జ్ఞానంగల కుమారుని ఇచ్చిన యెహోవాకు స్తుతి కలుగును గాక” అన్నాడు.

8 హీరాము సొలొమోనుకు ఇలా జవాబిచ్చాడు: “మీరు నాకు పంపిన సందేశం అంగీకరించాను, నేను మీరు కోరినట్టు దేవదారు, సరళవృక్షాల మ్రానులను ఇస్తాను.

9 నా పనివారు వాటిని లెబానోను నుండి మధ్యధరా సముద్రతీరానికి తెస్తారు. అక్కడినుండి మీరు చెప్పే స్థలానికి తెప్పలుగా కట్టించి సముద్రం మీదుగా పంపుతాను. అక్కడ వాటిని మీకు అందించే ఏర్పాటు నేను చేస్తాను, మీరు వాటిని తీసుకోవచ్చు. నా కోరిక ప్రకారం మీరు జరిగించి నా రాజకుటుంబానికి ఆహారాన్ని అందించండి.”

10 ఇలా హీరాము సొలొమోనుకు అతడు కోరిన దేవదారు, సరళవృక్షాల మ్రానులు అన్ని ఇచ్చాడు.

11 సొలొమోను హీరాముకు అతని ఇంటివారికి ఆహారంగా 20,000 కోరుల గోధుమలను, 20,000 బాతుల స్వచ్ఛమైన ఒలీవ నూనెను ఇచ్చాడు. సొలొమోను హీరాముకు ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇచ్చాడు.

12 యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానం ప్రకారం అతనికి జ్ఞానాన్ని ప్రసాదించారు. హీరాము సొలొమోనులు సమాధానంతో ఒక ఒప్పందం చేసుకున్నారు.

13 రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిలో నుండి ముప్పైవేల మందిని వెట్టిపనులు చేయడానికి ఏర్పాటు చేశాడు.

14 వారిని వంతు ప్రకారం నెలకు పదివేలమందిని లెబానోనుకు పంపేవాడు. వారు లెబానోనులో ఒక నెల, ఇంటి దగ్గర రెండు నెలలు గడిపేవారు. నిర్భంద కూలీల మీద అదోనిరాము అధికారి.

15 సొలొమోనుకు కొండల్లో బరువులు మోసేవారు డెబ్బైవేలమంది, రాళ్లు కొట్టేవారు ఎనభైవేలమంది ఉన్నారు.

16 అంతేకాక, ఆ పనివారిచేత పని చేయించడానికి మూడువేల మూడువందలమంది అధికారులు ఉన్నారు.

17 రాజు ఆజ్ఞమేరకు దేవాలయ పునాదిని చెక్కిన రాళ్లతో వేయడానికి గనులలో నుండి చాలా విలువైన రాళ్లను తవ్వి తెప్పించారు.

18 సొలొమోను, హీరాములు పంపిన శిల్పకారులును గెబాలీయుల ప్రదేశం నుండి వచ్చిన పనివారును మందిరాన్ని కట్టడానికి మ్రానులను రాళ్లను సిద్ధం చేశారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan