1 రాజులు 4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంసొలొమోను అధికారులు అధిపతులు 1 రాజైన సొలొమోను ఇశ్రాయేలు అంతటిని పరిపాలించాడు. 2 అతని ప్రముఖ అధికారులు వీరు: సాదోకు కుమారుడు యాజకుడైన అజర్యా; 3 షీషా కుమారులైన ఎలీహోరేపు, అహీయా న్యాయస్థాన కార్యదర్శులు; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు దస్తావేజుల అధికారి; 4 యెహోయాదా కుమారుడైన బెనాయా సేనాధిపతి; సాదోకు, అబ్యాతారు యాజకులు; 5 నాతాను కుమారుడైన అజర్యా జిల్లా అధికారులకు అధికారి; నాతాను కుమారుడైన జాబూదు యాజకుడు రాజుకు సలహాదారుడు; 6 అహీషారు రాజభవన నిర్వాహకుడు; అబ్దా కుమారుడైన అదోనిరాము వెట్టిచాకిరి చేసేవారిపై అధికారి. 7 సొలొమోనుకు ఇశ్రాయేలు రాజ్యం అంతటి మీద పన్నెండుమంది జిల్లా అధికారులు ఉన్నారు, వారు రాజుకు అతని ఇంటివారికి ఆహారం సరఫరా చేసేవారు. ఒక్కొక్కరు సంవత్సరంలో ఒక్కొక్క నెల చొప్పున ఆహారం సమకూర్చేవారు. 8 వారి అధికారుల పేర్లు ఇవి: ఎఫ్రాయిం కొండ సీమకు బెన్-హూరు అధికారి; 9 మాకస్సు, షయల్బీము, బేత్-షెమెషులో, ఎలోన్-బేత్-హనానులకు బెన్-దెకెరు అధికారి; 10 అరుబ్బోతుకు బెన్-హెసెదు అధికారి (శోకో, హెఫెరు ప్రదేశమంతా ఇతనికి అప్పగించబడ్డాయి); 11 నఫోత్ దోరుకు బెన్-అబీనాదాబు అధికారి (ఇతడు సొలొమోను కుమార్తెయైన టఫాతును పెళ్ళి చేసుకున్నాడు); 12 తానాకుకు, మెగిద్దోకు యెజ్రెయేలు దిగువన ఉన్న సారెతాను తర్వాత ఉన్న బేత్-షాను ప్రాంతం అంతా, బేత్-షాను నుండి ఆబేల్-మెహోలా యొక్మీము అవతలి వరకు అహీలూదు కుమారుడైన బయనా అధికారి; 13 రామోత్ గిలాదుకు బెన్-గెబెరు అధికారి; (ఇతనికి గిలాదులో ఉన్న మనష్షే కుమారుడైన యాయీరు గ్రామాలు, బాషానులో ఉన్న అర్గోబు ప్రాంతం, దాని యొక్క పెద్ద ప్రాకారాలు ఇత్తడి ద్వారబంధాలు కలిగిన అరవై పట్టణాలు అప్పగించబడ్డాయి); 14 మహనయీముకు ఇద్దో కుమారుడైన అహీనాదాబు అధికారి; 15 నఫ్తాలికి అహిమయస్సు అధికారి (ఇతడు సొలొమోను యొక్క మరొక కుమార్తె బాశెమతును పెళ్ళి చేసుకున్నాడు); 16 ఆషేరుకు, బెయాలోతుకు హూషై కుమారుడైన బయనా అధికారి; 17 ఇశ్శాఖారుకు పరూయహు కుమారుడైన యెహోషాపాతు అధికారి; 18 బెన్యామీనుకు ఏలా కుమారుడైన షిమీ అధికారి; 19 గిలాదుకు ఊరి కుమారుడైన గెబెరు అధికారి (అమోరీయుల రాజైన సీహోను దేశం, బాషాను రాజైన ఓగు యొక్క దేశం). ఈ జిల్లా మీద ఇతడు ఒక్కడే అధికారి. సొలొమోను అనుదిన ఆహారపదార్థాలు 20 యూదా, ఇశ్రాయేలు ప్రజలు సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువులంత విస్తారంగా ఉండి తిని త్రాగుతూ సంతోషిస్తూ ఉన్నారు. 21 సొలొమోను యూఫ్రటీసు నది నుండి ఫిలిష్తీయ దేశం, ఈజిప్టు సరిహద్దు వరకు ఉన్న అన్ని రాజ్యాలను పరిపాలించాడు. ఆ దేశ ప్రజలు సొలొమోనుకు పన్ను చెల్లిస్తూ, అతడు బ్రతికి ఉన్నంత కాలం అతనికి సేవ చేస్తూ ఉన్నారు. 22 సొలొమోను యొక్క ప్రతిదిన ఆహారపదార్థాలు, ముప్పై కోరుల సన్నని గోధుమ పిండి, అరవై కోరుల ముతక పిండి, 23 పది దొడ్లలో మేపే పశువులు, ఇరవై పచ్చికల్లో మేసే పశువులు, వంద గొర్రెలు, మేకలు, అంతేకాక జింకలు దుప్పులు, లేళ్ళు, క్రొవ్విన బాతులు. 24 అతడు యూఫ్రటీసు నదికి పడమరగా, తిఫ్సహు నుండి గాజా వరకు ఉన్న రాజ్యాలన్నిటినీ పరిపాలించాడు. ఆ సమయంలో అన్ని వైపుల నెమ్మది ఉండింది. 25 సొలొమోను జీవితకాలంలో దాను నుండి బెయేర్షేబ వరకు యూదా, ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా, ప్రతి ఒక్కరు తమ సొంత ద్రాక్ష, అంజూర చెట్ల క్రింద నిర్భయంగా నివసించారు. 26 సొలొమోను రథాల కోసం వాటిని లాగే గుర్రాల కోసం నాలుగువేల గుర్రపు శాలలు, పన్నెండు వేల రథసారధులు ఉన్నారు. 27 జిల్లా అధికారులు ఒక్కొక్కరు తమకు నియమించిన నెలలో రాజైన సొలొమోనుకు, అతని బల్ల దగ్గర కూర్చునే అందరికి ఏ కొరత లేకుండ ఆహారపదార్థాలు సరఫరా చేసేవారు. 28 అంతేకాక, రథాలు లాగే గుర్రాలు, ఇతర గుర్రాలు ఉన్న చోట్లకు తమకు నిర్ణయించబడిన ప్రకారం యవలను, ఎండు గడ్డిని తెచ్చేవారు. సొలొమోను జ్ఞానం 29 దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్ని గొప్ప వివేచనను, సముద్రతీరంలోని కొలవలేని ఇసుకరేణువులంత ప్రసాదించారు. 30 సొలొమోను జ్ఞానం తూర్పు దేశాల వారందరి జ్ఞానం కంటే, ఈజిప్టులోని జ్ఞానమంతటి కంటే గొప్పది. 31 అతడు మనుష్యులందరి కంటే జ్ఞాని, ఎజ్రాహీయుడైన ఏతాను కంటే, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్ద కంటే జ్ఞాని. అతని కీర్తి చుట్టూ ఉన్న అన్ని దేశాలకు వ్యాపించింది. 32 అతడు 3,000 సామెతలు పలికాడు, 1,005 కీర్తనలు వ్రాశాడు. 33 అతడు లెబానోనులో ఉండే దేవదారు చెట్ల నుండి, గోడల నుండి మొలిచే హిస్సోపు మొక్కల వరకు చెట్ల గురించి వివరించాడు. అతడు జంతువులు, పక్షులు, ప్రాకే జంతువులు, చేపల గురించి కూడా వివరించాడు. 34 అతని జ్ఞానం గురించి విన్న భూరాజులందరి ద్వారా అన్ని దేశాల నుండి రాయబారులు వచ్చి సొలొమోను జ్ఞాన వాక్కులను వినేవారు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.