Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 రాజులు 18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


ఏలీయా ఓబద్యా

1 చాలాకాలం తర్వాత కరువులో మూడవ సంవత్సరం యెహోవా వాక్కు ఏలీయాకు వచ్చింది: “నీవు వెళ్లి అహాబుకు కనబడు, నేను దేశం మీద వర్షం కురిపిస్తాను.”

2 కాబట్టి అహాబుకు కనబడటానికి ఏలీయా వెళ్లాడు. ఆ సమయంలో సమరయలో కరువు తీవ్రంగా ఉంది.

3 కాబట్టి అహాబు తన రాజభవన నిర్వాహకుడైన ఓబద్యాను పిలిపించాడు. (ఓబద్యా యెహోవా పట్ల భయభక్తులు గలవాడు.

4 యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపిస్తూ ఉన్నప్పుడు, ఓబద్యా వందమంది ప్రవక్తలను తీసుకెళ్లి వారిని దాచిపెట్టి, వారిని యాభైమంది చొప్పున రెండు గుహల్లో ఉంచి వారికి అన్నపానాలు అందించాడు.)

5 అహాబు ఓబద్యాతో, “దేశంలో తిరిగి పర్యటిస్తూ అన్ని ఊటలను, వాగులను చూడు. మన గుర్రాలు, కంచరగాడిదలు చావకుండ వాటికి గడ్డి దొరుకుతుందేమో అప్పుడు కొన్ని పశువులనైనా చావకుండ చూడగలం” అన్నాడు.

6 కాబట్టి వారు దేశమంతా తిరిగి చూడడానికి వీలుగా ఒకవైపు అహాబు, మరోవైపు ఓబద్యా వెళ్లారు.

7 ఓబద్యా దారిన వెళ్తుండగా ఏలీయా అతనికి ఎదురయ్యాడు. ఓబద్యా అతన్ని గుర్తుపట్టి సాష్టాంగపడి, “నా ప్రభువా ఏలీయా, నిజంగా మీరేనా?” అన్నాడు.

8 ఏలీయా అతనితో, “అవును నేనే. నీవు వెళ్లి, ఏలీయా ఇక్కడ ఉన్నాడని నీ యజమానితో చెప్పు” అన్నాడు.

9 అందుకు ఓబద్యా, “నేను చనిపోయేలా మీ దాసుడనైన నన్ను అహాబుకు అప్పగించడానికి నేను ఏ చెడ్డపని చేశాను?

10 సజీవుడైన మీ దేవుడు, యెహోవా పేరిట ప్రమాణం చేస్తున్నాను, నా యజమాని అహాబు మీకోసం వెదకడానికి అన్ని దేశాలకు, రాజ్యాలకు మనుష్యులను పంపాడు. ఏ దేశం వారైనా ఏలీయా లేడని చెప్పినప్పుడు మిమ్మల్ని ఆ దేశం వారు చూడలేదని వారి చేత ఒట్టు పెట్టించుకున్నాడు.

11 ఇప్పుడు నన్ను వెళ్లి నా యజమానితో, ‘ఏలీయా ఇక్కడ ఉన్నాడు’ అని చెప్పమంటున్నారు.

12 నేను మిమ్మల్ని విడిచి వెళ్లిన తర్వాత, యెహోవా ఆత్మ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాడో నాకు తెలియదు. నేను అహాబుకు చెప్పినప్పుడు, ఒకవేళ అతనికి మీరు కనబడకపోతే అతడు నన్ను చంపేస్తాడు. అది సరికాదు; మీ సేవకుడనైన నేను కూడ బాల్యం నుండే యెహోవాను ఆరాధించే వాన్ని.

13 నా ప్రభువా, యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపిస్తూ ఉన్నప్పుడు నేను ఏమి చేశానో మీరు వినలేదా? యెహోవా ప్రవక్తల్లో వందమందిని రెండు గుహల్లో దాచాను, ఒక్కొక్క గుహలో యాభైమంది లెక్కన ఉంచి వారికి భోజనం పెట్టి పోషించాను.

14 మరి మీరేమో నన్ను నా యజమాని దగ్గరకు వెళ్లి, ‘ఏలీయా ఇక్కడ ఉన్నాడు’ అని చెప్పమంటున్నారు. అతడు నన్ను చంపుతాడు!” అన్నాడు.

15 అందుకు ఏలీయా, “నేను సేవించే సజీవుడైన సైన్యాల యెహోవా పేరిట ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు ఖచ్చితంగా నేను అహాబుకు కనబడతాను.”


కర్మెలు పర్వతం మీద ఏలీయా

16 ఓబద్యా అహాబును కలుసుకోడానికి వెళ్లి ఈ విషయం తెలియజేయగా అహాబు ఏలీయాను కలుసుకోడానికి వెళ్లాడు.

17 అహాబు ఏలీయాను చూడగానే అతనితో, “ఇశ్రాయేలును కష్టపెట్టేవాడివి నీవే గదా?” అన్నాడు.

18 అందుకు ఏలీయా, “నేను కాదు; నీవు, నీ తండ్రి కుటుంబం యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను తిరస్కరించి, బయలును అనుసరించి మీరే ఇశ్రాయేలును కష్టపెట్టారు.

19 ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులందరిని కర్మెలు పర్వతం మీద నన్ను కలవమని పిలిపించు. యెజెబెలు బల్ల దగ్గర తినే నాలుగు వందల యాభై బయలు ప్రవక్తలను, నాలుగు వందల అషేరా ప్రవక్తలను కూడా రమ్మను” అని జవాబిచ్చాడు.

20 కాబట్టి అహాబు ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించాడు. ఆ ప్రవక్తలను కూడా కర్మెలు పర్వతం మీద సమావేశపరిచాడు.

21 ఏలీయా ప్రజల దగ్గరకు వెళ్లి, “మీరు ఎంతకాలం రెండు అభిప్రాయాల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే అతన్ని అనుసరించండి” అని అన్నాడు. అయితే ప్రజలు ఏమి బదులు చెప్పలేదు.

22 అప్పుడు ఏలీయా వారితో, “యెహోవా ప్రవక్తల్లో నేనొక్కడినే మిగిలాను, కాని బయలు ప్రవక్తలు నాలుగు వందల యాభైమంది ఉన్నారు.

23 మాకు రెండు ఎడ్లను తీసుకురండి, వారు ఆ ఎడ్లలో ఒకదాన్ని బయలు ప్రవక్తలు తీసుకుని దానిని ముక్కలుగా కోసి, క్రింద నిప్పు అంటించకుండా కట్టెల మీద పేర్చాలి. ఇంకొక ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద నిప్పు అంటించకుండా కట్టెల మీద పేరుస్తాను.

24 మీరు మీ దేవుని పేరిట ప్రార్థన చేయండి, నేను యెహోవా పేరిట ప్రార్థన చేస్తాను. ఏ దేవుడైతే అగ్నిని పంపి జవాబిస్తాడో ఆయనే నిజమైన దేవుడు” అని అన్నాడు. అప్పుడు ప్రజలంతా, “నీవు చెప్పింది బాగుంది” అన్నారు.

25 ఏలీయా బయలు ప్రవక్తలతో, “మీరు చాలామంది ఉన్నారు కాబట్టి ముందు మీరు ఒక ఎద్దును తీసుకుని దానిని సిద్ధం చేయండి. మీ దేవుని పేరిట ప్రార్థన చేయండి, అయితే నిప్పు అంటించకూడదు” అన్నాడు.

26 కాబట్టి వారు ఒక ఎద్దును తీసుకుని సిద్ధం చేశారు. తర్వాత వారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, “బయలా! మాకు జవాబివ్వు!” అని అంటూ బయలు పేరెత్తి బిగ్గరగా మొరపెట్టారు. కాని ఏ స్పందన లేదు; ఎవరూ జవాబివ్వలేదు. వారు సిద్ధం చేసిన బలిపీఠం చుట్టూ నాట్యం చేయడం మొదలుపెట్టారు.

27 మధ్యాహ్న సమయంలో ఏలీయా వారిని గేలి చేస్తూ, “బిగ్గరగా అరవండి! అతడు నిజంగా దేవుడే కదా! బహుశ అతడు ఏదైన ఆలోచనలో నిమగ్నమై ఉన్నాడేమో, లేదా పనిలో ఉన్నాడేమో లేదా ప్రయాణంలో ఉన్నాడేమో. బహుశ పడుకున్నాడేమో, అతన్ని నిద్ర లేపాలేమో” అన్నాడు.

28 కాబట్టి వారు ఇంకా బిగ్గరగా కేకలువేస్తూ వారి అలవాటు ప్రకారం రక్తం ధారలుగా కారే వరకు కత్తులతో, ఈటెలతో తమను తాము కోసుకున్నారు.

29 మధ్యాహ్నం దాటింది, సాయంత్రం బలి సమయం వరకు వారు తమ వెర్రి ప్రవచనాలను కొనసాగించారు. అయినా స్పందన లేదు, ఎవరు జవాబివ్వలేదు, ఎవరూ పట్టించుకోలేదు.

30 అప్పుడు ఏలీయా ప్రజలందరితో, “ఇక్కడకు నా దగ్గరకు రండి” అన్నాడు. వారతని దగ్గరకు రాగా అతడు పడిపోయిన యెహోవా బలిపీఠాన్ని తిరిగి నిర్మించాడు.

31 అప్పుడు ఏలీయా, “నీ పేరు ఇశ్రాయేలు” అని యెహోవా వాగ్దానం పొందుకున్న యాకోబు గోత్రాల లెక్క చొప్పున పన్నెండు రాళ్లు తీసుకున్నాడు.

32 రాళ్లతో యెహోవా పేరున బలిపీఠం కట్టి, దాని చుట్టూ రెండు శేయల గింజలు పట్టేటంత పెద్దగా కందకం తవ్వాడు.

33 అతడు బలిపీఠం మీద కట్టెలు పేర్చి ఎద్దును ముక్కలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచాడు. తర్వాత వారితో, “నాలుగు పెద్ద జాడీలు నీళ్లతో నింపి, అర్పణ మీద కట్టెల మీద పోయండి” అన్నాడు.

34 అతడు, “మళ్ళీ అలాగే చేయండి” అని చెప్పగా వారు మళ్ళీ అలాగే చేశారు. అతడు, “మూడవసారి కూడా అలాగే చేయండి” అనగానే వారు మళ్ళీ దహనబలి పశుమాంసం మీద కట్టెల మీద నీళ్లు పోశారు.

35 నీళ్లు బలిపీఠం మీద నుండి చుట్టూ పారుతూ కందకం కూడా నిండిపోయింది.

36 అర్పణ సమయంలో, ఏలీయా ప్రవక్త బలిపీఠం దగ్గరగా వెళ్లి ఇలా ప్రార్థించాడు: “యెహోవా! అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా! ఇశ్రాయేలులో మీరే దేవుడని, నేను మీ సేవకుడినని, మీ ఆజ్ఞ ప్రకారమే ఇవన్నీ చేశానని ఈ రోజు వెల్లడి చేయండి.

37 యెహోవా, నాకు జవాబివ్వండి; మీరే దేవుడైన యెహోవా అని, మీరు వారి హృదయాలను నీ వైపుకు త్రిప్పుకుంటున్నారని ప్రజలు తెలుసుకునేలా నాకు జవాబివ్వండి.”

38 అప్పుడు యెహోవా అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి బలిని, కట్టెలను, రాళ్లను, మట్టిని దహించి కందకంలో ఉన్న నీళ్లు కూడా ఇంకిపోయేలా చేసింది.

39 ప్రజలంతా ఇది చూసి సాష్టాంగపడి, “యెహోవాయే దేవుడు! యెహోవాయే దేవుడు!” అని అంటూ కేకలు వేశారు.

40 అప్పుడు ఏలీయా, “బయలు ప్రవక్తలను పట్టుకోండి! వారిలో ఒక్కడు కూడా తప్పించుకోకూడదు!” అని వారికి ఆజ్ఞాపించాడు. ప్రజలు వారిని పట్టుకున్నారు, ఏలీయా వారిని కీషోను లోయలోకి తీసుకెళ్లి అక్కడ చంపాడు.

41 తర్వాత ఏలీయా అహాబుతో, “భారీ వర్షం వచ్చే ధ్వని వస్తుంది, నీవు వెళ్లి అన్నపానాలు పుచ్చుకో” అన్నాడు.

42 కాబట్టి అహాబు అన్నపానాలు పుచ్చుకోడానికి వెళ్లాడు, కాని ఏలీయా కర్మెలు పర్వత శిఖరం మీదికి వెళ్లి, అక్కడ అతడు నేల మీద పడి ముఖం మోకాళ్ల మధ్య పెట్టుకున్నాడు.

43 తర్వాత అతడు తన సేవకుని పిలిచి, “నీవు వెళ్లి సముద్రం వైపు చూడు” అన్నాడు. అతడు వెళ్లి చూశాడు. “అక్కడ ఏమి లేదు” అని అతడు జవాబిచ్చాడు. ఏలీయా ఏడుసార్లు, “వెళ్లి చూడు” అని చెప్పాడు.

44 ఏడవసారి సేవకుడు వచ్చి, “మనిషి చేయి అంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి లేస్తూ ఉంది” అని చెప్పాడు. అందుకు ఏలీయా, “నీవు వెళ్లి అహాబుతో, ‘వర్షం నిన్ను ఆపక ముందే నీ రథం సిద్ధం చేసుకుని వెళ్లు’ అని చెప్పు” అన్నాడు.

45 అంతలో ఆకాశం మబ్బులతో చీకటిగా మారింది, గాలి వీచింది, భారీ వర్షం కురవడం మొదలయ్యింది. అహాబు రథమెక్కి యెజ్రెయేలుకు వెళ్లాడు.

46 యెహోవా హస్తం ఏలీయాను బలపరచగా అతడు తన నడుము బిగించుకుని, అహాబు కంటే ముందే పరుగెత్తుకొని వెళ్లి యెజ్రెయేలు చేరుకున్నాడు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan