Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 రాజులు 12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


రెహబాముకు విరుద్ధంగా ఇశ్రాయేలు తిరుగుబాటు

1 రెహబామును రాజుగా చేయడానికి ఇశ్రాయేలు ప్రజలంతా షెకెముకు వెళ్లగా రెహబాము అక్కడికి వెళ్లాడు.

2 రాజైన సొలొమోను దగ్గరి నుండి ఈజిప్టుకు పారిపోయి అక్కడే నివాసం చేస్తున్న నెబాతు కుమారుడైన యరొబాము ఇది విని, ఈజిప్టు నుండి తిరిగి వచ్చాడు.

3 కాబట్టి ప్రజలు యరొబామును పిలిపించారు. అతడు, ఇశ్రాయేలు సమాజమంతా రెహబాము దగ్గరకు వెళ్లి అతనితో ఇలా అన్నారు:

4 “మీ తండ్రి మామీద బరువైన కాడిని మోపాడు. అయితే మీ తండ్రి పెట్టిన కఠినమైన దాసత్వాన్ని, మామీద ఉంచిన బరువైన కాడిని తేలిక చేయండి, అప్పుడు మేము మీకు సేవ చేస్తాము.”

5 రెహబాము జవాబిస్తూ, “మీరు వెళ్లి, మూడు రోజుల తర్వాత మళ్ళీ రండి” అన్నాడు. కాబట్టి ప్రజలు వెళ్లిపోయారు.

6 అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతనికి సేవలందించిన పెద్దలను సంప్రదించి “ఈ ప్రజలకు ఎలా జవాబివ్వాలో చెప్పండి” అని అడిగాడు.

7 అందుకు వారు, “ఈ రోజు నీవు ఈ ప్రజలకు దాసునిగా ఉంటూ సేవ చేస్తూ, వారికి అనుకూలంగా జవాబు చెప్తే, వారు ఎప్పటికీ నీకు దాసులుగా ఉంటారు” అని చెప్పారు.

8 కాని రెహబాము పెద్దలు ఇచ్చిన సలహాను తిరస్కరించి, తనతో పెరిగి పెద్దవారై తనకు సేవలందిస్తున్న యువకులను సంప్రదించాడు.

9 అతడు వారిని, “మీ సలహా ఏంటి? ‘మీ తండ్రి పెట్టిన కాడిని తేలిక చేయండి’ అని నాతో అంటున్న ఈ ప్రజలకు నేనేమి జవాబివ్వాలి?” అని అడిగాడు.

10 అతనితో పాటు పెరిగి పెద్దవారైన ఆ యువకులు జవాబిస్తూ, “ఈ ప్రజలు నీతో, ‘మీ తండ్రి మామీద బరువైన కాడి ఉంచాడు, కాని మీరు దాన్ని తేలిక చేయండి’ అని అన్నారు. కాని నీవు వారితో, ‘నా తండ్రి నడుముకంటే నా చిటికెన వేలు పెద్దది.

11 నా తండ్రి మీమీద బరువైన కాడి ఉంచాడు; నేను దానిని ఇంకా బరువు చేస్తాను. నా తండ్రి కొరడాలతో కొట్టాడు; నేను తేళ్లతో కొడతాను’ అని చెప్పాలి” అన్నారు.

12 రాజు, “మూడు రోజుల తర్వాత నా దగ్గరకు రండి” అని చెప్పిన ప్రకారం, మూడు రోజుల తర్వాత యరొబాము ప్రజలంతా రెహబాము దగ్గరకు వచ్చారు.

13 రాజు పెద్దలు చెప్పిన సలహాను తిరస్కరించి, ఆ ప్రజలకు కఠినంగా జవాబిచ్చాడు.

14 అతడు యువకులు ఇచ్చిన సలహా ప్రకారం, “నా తండ్రి మీ కాడిని బరువుగా చేశాడు; నేను మరి ఎక్కువ బరువుగా చేస్తాను. నా తండ్రి కొరడాలతో శిక్షించాడు; నేను తేళ్లతో శిక్షిస్తాను” అని అన్నాడు.

15 రాజు ప్రజల మాట వినిపించుకోలేదు, ఎందుకంటే యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో చెప్పిన మాట నెరవేర్చడానికి ఈ సంఘటనలు యెహోవా ఇలా జరిగించారు.

16 రాజు తమ మాట అంగీకరించలేదని తెలుసుకున్న ఇశ్రాయేలీయులంతా రాజుకు ఇలా జవాబిచ్చారు: “దావీదులో మాకేం భాగం ఉంది, యెష్షయి కుమారునిలో మాకేం స్వాస్థ్యం ఉంది? ఇశ్రాయేలీయులారా, మీ గుడారాలకు వెళ్లిపొండి! దావీదూ, నీ సొంత ఇంటి సంగతి చూసుకో!” కాబట్టి ఇశ్రాయేలీయులు తమ గుడారాలకు వెళ్లిపోయారు.

17 కాని యూదా పట్టణాల్లో నివసించే ఇశ్రాయేలీయుల మీద మాత్రం రెహబాము పరిపాలన చేశాడు.

18 రాజైన రెహబాము వెట్టి పనివారి మీద అధికారిగా ఉన్న అదోనిరామును పంపాడు, కాని ఇశ్రాయేలు వారంతా అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. అయితే రాజైన రెహబాము తప్పించుకుని తన రథమెక్కి యెరూషలేముకు పారిపోయాడు.

19 కాబట్టి నేటికీ ఇశ్రాయేలీయులు దావీదు వంశం మీద తిరుగబడుతూనే ఉన్నారు.

20 యరొబాము ఈజిప్టు నుండి తిరిగి వచ్చాడని ఇశ్రాయేలీయులంతా విని, వారు సమావేశమై అతన్ని పిలిపించి, అతన్ని ఇశ్రాయేలంతటి మీద రాజుగా నియమించారు. యూదా గోత్రం వారు మాత్రమే దావీదు వంశానికి నమ్మకంగా ఉన్నారు.

21 రెహబాము యెరూషలేము చేరుకొని యూదా బెన్యామీను గోత్రాల వారినందరిని, అనగా 1,80,000 మంది ఉత్తములైన సైనికులను పోగుచేసుకుని, ఇశ్రాయేలు మీద యుద్ధం చేసి, సొలొమోను కుమారుడైన రెహబాముకు రాజ్యాన్ని తిరిగి సంపాదించాలని అనుకున్నాడు.

22 అయితే దైవజనుడైన షెమయాకు దేవుని నుండి ఈ వాక్కు వచ్చింది:

23 “సొలొమోను కుమారుడును యూదా రాజైన రెహబాముతో, యూదా, బెన్యామీను వారందరితో, మిగితా ప్రజలతో,

24 ‘యెహోవా చెప్పే మాట ఇదే: మీరు మీ సోదరులైన ఇశ్రాయేలీయులతో యుద్ధానికి వెళ్లకండి. ఇది నేను చేస్తున్నది కాబట్టి మీరంతా ఇళ్ళకు వెళ్లండి.’ ” కాబట్టి వారు యెహోవా మాట విని, యెహోవా ఆదేశించినట్లు తమ ఇళ్ళకు తిరిగి వెళ్లారు.


బేతేలు దాను దగ్గర బంగారు దూడలు

25 తర్వాత యరొబాము ఎఫ్రాయిం కొండ సీమలో కోటగోడలు గల షెకెము పట్టణం కట్టించుకుని అక్కడ నివసించాడు. అక్కడినుండి వెళ్లి పెనీయేలు కట్టించాడు.

26 యరొబాము తనలో తాను అనుకున్నాడు, “ఈ రాజ్యం దావీదు వంశానికి తిరిగి దక్కుతుంది.

27 ఒకవేళ ఈ ప్రజలు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరంలో బలులు అర్పించడానికి వెళ్తే, వారు మరల తమ ప్రభు, యూదా రాజైన రెహబాముకు తమ నమ్మకత్వాన్ని చూపుతారు. వారు నన్ను చంపి, రెహబాము రాజు వైపు తిరుగుతారు” అనుకున్నాడు.

28 సలహా తీసుకున్న తర్వాత రాజు రెండు బంగారు దూడలను చేయించాడు. అతడు ప్రజలతో, “యెరూషలేముకు వెళ్లడం మీకు చాలా కష్టము. ఇశ్రాయేలీయులారా, మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించిన మీ దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు” అని చెప్పాడు.

29 అతడు ఒకదాన్ని బేతేలులో, ఇంకొక దానిని దానులో పెట్టాడు.

30 కాని ఇది ఒక పాపంగా మారింది; ప్రజలు బేతేలులో ఉన్నదానిని పూజించారు, దూరమైనా సరే దానుకు వెళ్లి అక్కడ ఉన్నదానిని పూజించారు.

31 యరొబాము ఎత్తైన స్థలాల మీద క్షేత్రాలు కట్టించి, లేవీయులు కాకపోయినా సరే, సాధారణ ప్రజలనే యాజకులుగా నియమించాడు.

32 యూదాలో జరిగిన పండుగలాంటి ఒక పండుగను యరొబాము ఎనిమిదవ నెల పదిహేనవ రోజున ఏర్పాటు చేసి, బలిపీఠం మీద బలులు అర్పించాడు. అలా అతడు బేతేలులో తాను చేయించిన దూడలకు బలి అర్పించుట ద్వార చేశాడు. అంతేకాదు బేతేలులో తాను చేయించిన క్షేత్రాల్లో యాజకులను కూడా నియమించాడు.

33 తాను స్వయంగా నిర్ణయించిన ప్రకారం ఎనిమిదవ నెల పదిహేనవ రోజు బేతేలులో తాను కట్టించిన బలిపీఠం మీద బలులు అర్పించాడు. కాబట్టి అతడు ఇశ్రాయేలీయుల కోసం పండుగను నిర్ణయించి, ధూపం వేయడానికి బలిపీఠం దగ్గరకు వెళ్లాడు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan