Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 రాజులు 10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


షేబ దేశపు రాణి సొలొమోనును దర్శించుట

1 షేబ దేశపు రాణి సొలొమోను యొక్క ఖ్యాతి గురించి యెహోవాతో అతనికి ఉన్న సంబంధం గురించి విని చిక్కు ప్రశ్నలతో సొలొమోనును పరీక్షిద్దామని వచ్చింది.

2 ఆమె ఒంటెల మీద సుగంధ ద్రవ్యాలను, చాలా బంగారం, వెలగల రాళ్లు ఎక్కించి, గొప్ప పరివారంతో బయలుదేరి యెరూషలేముకు చేరింది. ఆమె సొలొమోను దగ్గరకు వచ్చి, తన మనస్సులో ఉన్నదంతా చెప్పింది.

3 సొలొమోను ఆమె ప్రశ్నలన్నిటికి జవాబులిచ్చాడు; వివరించలేనంత కష్టమైనది రాజుకు ఏది లేదు.

4 షేబ రాణి సొలొమోనుకు ఉన్న జ్ఞానమంతటిని, అతడు కట్టించిన రాజభవనాన్ని,

5 అతని భోజనబల్ల మీద ఆహారాన్ని, అతని అధికారుల కూర్చునే విధానాన్ని, ప్రత్యేక వస్త్రాలు ధరించి పరిచారం చేసే దాసులను, అతనికి పాత్ర అందించేవారిని, యెహోవా మందిరం వద్ద అతడు అర్పించే దహనబలులను చూసి ఆమె ఆశ్చర్యపడింది.

6 ఆమె రాజుతో, “మీరు సాధించిన వాటి గురించి, మీ జ్ఞానం గురించి నా దేశంలో నేను విన్నది నిజమే.

7 అయితే నేను వచ్చి కళ్ళారా చూసే వరకు వారి మాటలు నమ్మలేకపోయాను. నిజానికి, ఇక్కడున్న వాటిలో సగం కూడా నాకు చెప్పలేదు; జ్ఞానంలోను, ధనంలోను నేను విన్నదానికంటే మీరు ఎంతో గొప్పగా ఉన్నారు.

8 మీ ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారో! మీ ముందు నిలబడి మీ జ్ఞానాన్ని వింటున్న మీ అధికారులు ఎంత సంతోషంగా ఉంటారో!

9 మీలో ఆనందిస్తూ, మిమ్మల్ని ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెట్టిన మీ దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక! ఇశ్రాయేలు పట్ల ఆయనకున్న నిత్యమైన ప్రేమను బట్టి నీతిన్యాయాల ప్రకారం కార్యాలు జరిగించడానికి యెహోవా మిమ్మల్ని రాజుగా చేశారు” అని అభినందించింది.

10 ఆమె రాజుకు 120 తలాంతుల బంగారం, చాలా సుగంధద్రవ్యాలు, వెలగల రాళ్లు ఇచ్చింది. షేబ రాణి ఇచ్చినంత సుగంధద్రవ్యాలు రాజైన సొలొమోనుకు మరెప్పుడూ రాలేదు.

11 (హీరాము ఓడలు ఓఫీరు నుండి బంగారాన్ని తెచ్చాయి; అక్కడినుండి వారు చాలా ఎర్ర చందనం చెక్కలు, వెలగల రాళ్లు తెచ్చారు.

12 ఆ చందనం వాడి, వాటితో రాజు యెహోవా మందిరానికి, రాజభవనానికి స్తంభాలను, సంగీతకారులకు సితారలు వీణలు చేయించాడు. ఆ రోజు నుండి ఇంతవరకు అలాంటి చందనం దొరకలేదు కనబడలేదు.)

13 రాజైన సొలొమోను షేబ రాణికి తన రాజ నిధి నుండి ఇచ్చింది మాత్రమే కాక, ఆమె కోరిందంతా, అడిగినదంతా ఇచ్చాడు. తర్వాత ఆమె తన పరివారంతో తన స్వదేశానికి వెళ్లిపోయింది.


సొలొమోను వైభవం

14 సొలొమోనుకు సంవత్సరానికి వచ్చే బంగారం బరువు 666 తలాంతులు,

15 అది వర్తకులు, వ్యాపారుల నుండి వచ్చింది కాక, అరేబియా రాజులందరి నుండి, దేశ అధికారుల నుండి కూడా రాబడి వస్తుంది.

16 రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారంతో రెండువందల పెద్ద డాళ్లను చేయించాడు; ప్రతి డాలుకు ఆరువందల షెకెళ్ళ బంగారం వినియోగించారు.

17 సాగగొట్టిన బంగారంతో అతడు మూడువందల చిన్న డాళ్లు కూడా చేయించాడు, ప్రతి డాలుకు మూడు మీనాల బంగారం వినియోగించారు. రాజు వాటిని లెబానోను వనం అనే తన రాజభవనంలో ఉంచాడు.

18 తర్వాత రాజు దంతంతో పెద్ద సింహాసనం చేయించి మేలిమి బంగారంతో పొదిగించాడు.

19 సింహాసనానికి ఆరు మెట్లున్నాయి, దాని వెనుక భాగం గుండ్రంగా ఉంటుంది. సింహాసనానికి రెండు వైపులా చేతులు పెట్టుకోవడానికి ఉన్నాయి. వాటి దగ్గర రెండు సింహాలు నిలబడి ఉన్నాయి.

20 ఆరు మెట్లమీద మెట్టుకు రెండు చొప్పున పన్నెండు సింహాలు ఇరువైపుల నిలబడి ఉన్నాయి. అలాంటిది మరే రాజ్యంలో తయారుచేయబడలేదు.

21 రాజైన సొలొమోను పానపాత్రలన్నీ బంగారంతో చేసినవి, లెబానోను వనపు రాజభవనంలో ఉన్న పాత్రలన్నీ మేలిమి బంగారంతో చేసినవి. వెండితో ఒక్కటి కూడా చేయలేదు, ఎందుకంటే సొలొమోను కాలంలో వెండికి విలువలేదు.

22 రాజుకు సముద్రంలో హీరాము ఓడలతో పాటు తర్షీషు నౌకలు కూడా ఉన్నాయి. అవి మూడేళ్ళకు ఒకసారి బంగారం, వెండి, దంతాలు, కోతులను, నెమళ్ళను తీసుకువస్తుండేవి.

23 రాజైన సొలొమోను సంపదలో, జ్ఞానంలో లోకంలోని రాజులందరికంటే గొప్పవాడు.

24 దేవుడు అతనికిచ్చిన జ్ఞానాన్ని వినడానికి లోకంలోని ప్రజలందరూ సొలొమోనును చూడాలని కోరుకున్నారు.

25 ప్రతీ సంవత్సరం అతని దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరూ కానుకలుగా వెండి పాత్రలు, బంగారు పాత్రలు, వస్త్రాలు, యుద్ధాయుధాలు, సుగంధద్రవ్యాలు, గుర్రాలు, కంచరగాడిదలు తెచ్చేవారు.

26 సొలొమోను రథాలను, గుర్రాలను సమకూర్చుకున్నాడు. అతనికి 1,400 రథాలు, 12,000 గుర్రాలు ఉన్నాయి, వీటిని రథాల పట్టణాల్లో, యెరూషలేములో తన దగ్గర ఉంచాడు.

27 రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారంగా చేశాడు. దేవదారు మ్రానులను కొండ దిగువ ప్రదేశంలోని మేడిచెట్లలా అతి విస్తారంగా ఉంచాడు.

28 సొలొమోను గుర్రాలను ఈజిప్టు నుండి, క్యూ నుండి దిగుమతి చేసుకున్నారు. రాజ వర్తకులు తగిన ధర చెల్లించి వాటిని క్యూ దగ్గర కొనుగోలు చేశారు.

29 వారు ఈజిప్టు నుండి ఒక్కో రథానికి ఆరువందల షెకెళ్ళ వెండిని, ఒక్కో గుర్రానికి నూట యాభై షెకెళ్ళ వెండిని ఇచ్చి దిగుమతి చేశారు. హిత్తీయుల రాజులందరికి, సిరియా రాజులకు వాటిని ఎగుమతి కూడ చేశారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan