Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 యోహాను 2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 నా ప్రియ పిల్లలారా, మీరు పాపం చేయకూడదని మీకు ఇలా వ్రాస్తున్నాను. కాని ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర న్యాయవాదిగా నీతిమంతుడైన యేసు క్రీస్తు మనకు ఉన్నారు.

2 ఆయనే మన పాపాలకు కూడా ఆయనే ప్రాయశ్చిత్త బలి. మన కోసం మాత్రమే కాదు కాని లోకమంతటి పాపాల కోసం కూడా.


తోటి విశ్వాసుల పట్ల ప్రేమ ద్వేషం

3 మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం ఆయనను తెలుసుకున్నామని మనకు తెలుస్తుంది.

4 కాని ఎవరైనా, “నేను ఆయనను తెలుసుకున్నాను” అని చెప్తూ, ఆయన ఆజ్ఞాపించింది చేయనివారు అబద్ధికులు, వారిలో సత్యం ఉండదు.

5 అయితే ఎవరు ఆయన వాక్యానికి లోబడతారో వారిలో దేవుని పట్ల ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుంది. మనం ఆయనలో ఉన్నామని దీనిని బట్టి తెలుసుకుంటాము.

6 ఆయనలో జీవిస్తున్నామని చెప్పేవారు యేసు క్రీస్తులా జీవించాలి.

7 ప్రియ స్నేహితులారా, నేను మీకు క్రొత్త ఆజ్ఞ వ్రాయడం లేదు కాని ప్రారంభం నుండి మీరు కలిగి ఉన్న పాత ఆజ్ఞనే వ్రాస్తున్నాను. ఈ పాత ఆజ్ఞ మీరు విన్న సందేశమే.

8 అయినా నేను ఒక క్రొత్త ఆజ్ఞ వ్రాస్తున్నాను; చీకటి గతించిపోతుంది, ఇప్పటికే నిజమైన వెలుగు ప్రకాశిస్తున్నది కాబట్టి దాని సత్యం ఆయనలో మీలో కనిపిస్తూ ఉంది.

9 తాను వెలుగులో ఉన్నానని చెప్తూ తన సహోదరున్ని సహోదరిని ద్వేషించేవారు ఇంకా చీకటిలోనే ఉన్నారు.

10 తన సహోదరిని సహోదరులను ప్రేమించేవారు వెలుగులో జీవిస్తారు; వారిలో అభ్యంతరం కలిగించేది ఏది ఉండదు.

11 అయితే తన సహోదరిని, సహోదరున్ని ద్వేషించేవారు చీకటిలో ఉండి, చీకటిలోనే తిరుగుతారు. ఆ చీకటి వారిని గ్రుడ్డివారిగా చేస్తుంది, కాబట్టి తాము ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలియదు.


వ్రాయడానికి గల కారణాలు

12 ప్రియ పిల్లలారా, ఆయన నామంలో మీ పాపాలు క్షమించబడ్డాయి, కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.

13 తండ్రులారా, ఆది నుండి ఉన్నవాడు మీకు తెలుసు, కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను. యవ్వనస్థులారా, మీరు దుష్టుని జయించారు, కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.

14 ప్రియ బిడ్డలారా, మీకు తండ్రి తెలుసు, కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను. తండ్రులారా, ఆది నుండి ఉన్నవాడు మీకు తెలుసు, కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను. యవ్వనస్థులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నివసిస్తున్నది; మీరు దుష్టుని జయించారు; కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.


లోకాన్ని ప్రేమించరాదు

15 ఈ లోకాన్ని లోకంలో ఉన్న దేన్ని ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి పట్ల ప్రేమ వారిలో ఉండదు.

16 ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు గర్వం. ఇవి తండ్రి నుండి రాలేదు, ఇవన్నీ లోకం నుండే వచ్చాయి.

17 ఈ లోకం దాని ఆశలు గతించిపోతాయి కాని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు శాశ్వతంగా జీవిస్తారు.


కుమారుని తిరస్కరించినందుకు హెచ్చరికలు

18 ప్రియ పిల్లలారా, ఇది చివరి గడియ; క్రీస్తు విరోధి వస్తున్నాడని మీరు విన్నట్లుగానే, ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులు వచ్చారు. దీనిని బట్టి ఇదే చివరి గడియ అని మనకు తెలుస్తుంది.

19 వారు మనలో నుండి బయలుదేరారు, కాని నిజానికి వారు మనకు సంబంధించినవారు కారు. ఎందుకంటే వారు మనకు సంబంధించినవారైతే మనతోనే నిలిచి ఉంటారు; అయితే వారు అలా వెళ్లిపోవడం వల్ల వారిలో ఒక్కరు కూడా మనకు సంబంధించినవారు కారని తెలుస్తుంది.

20 అయితే, మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందారు, మీ అందరికి సత్యం తెలుసు.

21 మీకు సత్యం తెలియదని నేను మీకు వ్రాయడం లేదు కాని సత్యం మీకు తెలుసు, సత్యం నుండి అబద్ధం పుట్టదని మీకు తెలుసు కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.

22 అయితే అబద్ధికులు ఎవరు? ఎవరైతే యేసును క్రీస్తు కాదంటారో వారే. తండ్రిని కుమారుని తిరస్కరించేవాడే క్రీస్తు విరోధి.

23 ఎందుకంటే, కుమారుని తిరస్కరించిన వారికి తండ్రి లేడు; కుమారుని అంగీకరించినవారికి తండ్రి ఉన్నాడు.

24 మీరైతే, మొదటి నుండి మీరు దేన్ని విన్నారో అది మీలో నిలిచి ఉండేలా చూసుకోండి. అది మీలో నిలిచివుంటే, మీరు కూడా కుమారునిలో తండ్రిలో నిలిచివుంటారు.

25 ఇదే క్రీస్తు మనకు వాగ్దానం చేసిన నిత్యజీవము.

26 మిమ్మల్ని తప్పుత్రోవ పట్టించడానికి ప్రయత్నించే వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాస్తున్నాను.

27 మీరైతే, ఆయన నుండి మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉంటుంది, కాబట్టి ఎవరు మీకు బోధించవలసిన అవసరం లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కాని అబద్ధం కాదు; అదే అన్ని విషయాల గురించి మీకు బోధిస్తుంది. అది మీకు బోధించిన ప్రకారం ఆయనలో మీరు నిలిచి ఉండండి.


దేవుని బిడ్డలు, పాపం

28 కాబట్టి, ప్రియ పిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో ఆయన ముందు మనం సిగ్గుపడకుండా ధైర్యం కలిగి ఉండేలా మీరు ఆయనలో కొనసాగండి.

29 ఆయన నీతిమంతుడని మీకు తెలిస్తే, నీతిని జరిగించే ప్రతి ఒక్కరు ఆయన మూలంగా పుట్టారని మీరు తెలుసుకుంటారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan