1 కొరింథీ 6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంవిశ్వాసుల మధ్యలోని తగాదాలు 1 మీలో ఒకరితో ఒకరికి తగాదాలు ఉన్నప్పుడు దానిని పరిశుద్ధుల ముందుకు వెళ్లడానికి బదులు భక్తిహీనులైనవారి ముందుకు న్యాయం కోసం దాన్ని తీసుకెళ్తారా? 2 పరిశుద్ధులే ఈ లోకానికి న్యాయం తీర్చుతారని మీకు తెలియదా? మీరు లోకానికి తీర్పు తీర్చేవారైతే చిన్న చిన్న తగాదాలను మీరు పరిష్కరించుకోలేరా? 3 మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? అలాంటప్పుడు ఈ లోకసంబంధమైన విషయాలను గురించి మరి బాగా తీర్పు తీర్చవచ్చు కదా! 4 కాబట్టి ఒకవేళ మీకు ఇలాంటి విషయాల్లో తగాదాలు ఉంటే, వాటిని పరిష్కరించమని సంఘంలో తిరస్కరించబడిన వారిని అడుగుతారా? 5 మీరు సిగ్గుపడాలని ఇలా చెప్తున్నాను. విశ్వాసుల మధ్య గల తగాదాలు తీర్చగల జ్ఞానవంతులు మీలో ఎవరు లేరా? 6 అలా కాకుండా, ఒక సోదరుడు మరొక సోదరున్ని న్యాయస్థానానికి తీసుకెళ్తున్నాడు, అది కూడా అవిశ్వాసుల ముందు! 7 నిజానికి, మీ మధ్యలో తగాదాలు ఉన్నాయంటే మీరు ముందే పూర్తిగా ఓడిపోయారని అర్థం కాబట్టి మీరు దోషులుగా లేదా మోసపోయిన వారిగానే ఉండవచ్చు కాదా? 8 అయితే మీరే మోసం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు, మీ సహోదర సహోదరీలకు కూడా అలాగే చేస్తున్నారు. 9 తప్పు చేసినవారు దేవుని రాజ్యానికి వారసులు కారని మీకు తెలియదా? మోసపోకండి: లైంగిక దుర్నీతైనా, విగ్రహారాధికులైనా, వ్యభిచారులైనా, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులైనా, 10 దొంగలైనా, అత్యాశపరులైనా, త్రాగుబోతులైనా, దూషకులైనా, మోసగించేవారైనా దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. 11 మీరు విమోచింపబడక ముందు మీలో కొందరు అలాంటి వారిగా ఉన్నారు. అయితే ప్రభువైన యేసు క్రీస్తు నామంలో, మన దేవుని ఆత్మలో మీరు కడుగబడి పవిత్రపరచబడి, నీతిమంతులుగా తీర్చబడ్డారు. లైంగిక దుర్నీతి 12 “ఏది చేయడానికైనా నాకు స్వాతంత్ర్యం ఉందని” మీరు అనుకోవచ్చు కాని, అన్ని చేయదగినవి కావు. “ఏది చేయడానికైనా నాకు అనుమతి ఉంది అనుకోవచ్చు” కాని, నేను దేనికి లొంగిపోను. 13 “ఆహారం కడుపు కోసం, కడుపు ఆహారం కోసం నియమించబడ్డాయని మీరు చెప్తారు, కానీ దేవుడు రెండింటిని నాశనం చేస్తారు.” మీ శరీరాన్ని లైంగిక దుర్నీతి కోసం కాదు గాని ప్రభువు కొరకే, ప్రభువు శరీరం కొరకే. 14 దేవుడు తన శక్తి వలన ప్రభువును మరణం నుండి సజీవంగా లేపారు. కాబట్టి ఆయన మనల్ని కూడ అలాగే సజీవంగా లేపుతారు. 15 మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయని మీకు తెలియదా? అయితే నేను క్రీస్తు అవయవాలను తీసుకుని వేశ్య అవయవాలుగా చేస్తానా? అలా ఎన్నడు జరుగకూడదు. 16 వేశ్యతో కలిసేవాడు ఆమెతో ఏక శరీరమై ఉన్నాడని మీకు తెలియదా? వాక్యంలో, “వారిద్దరు ఏకశరీరం అవుతారు” అని వ్రాయబడి ఉంది కదా! 17 అయితే ప్రభువుతో ఏకమైనవారు ఆత్మలో ఆయనతో ఒక్కటై ఉంటారు. 18 లైంగిక దుర్నీతికి దూరంగా పారిపోండి. మానవుడు చేసే ఇతర పాపాలన్నీ శరీరానికి బయట చేసేవే, కానీ లైంగిక పాపం చేసేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు. 19 మీ శరీరాన్ని దేవుడే ఇచ్చారు. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు శరీరం ఆలయమై ఉందని మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు. 20 మీరు వెలపెట్టి కొనబడ్డారు. కాబట్టి మీ శరీరాలతో దేవుని మహిమపరచండి. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.