Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 కొరింథీ 11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 నేను క్రీస్తు మాదిరిని అనుసరించినట్లే మీరు నా మాదిరిని అనుసరించండి.


ఆరాధనలో తలపై ముసుగు ధరించుట

2 మీరు అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ, మీకు నేను మీకు అప్పగించిన సంప్రదాయాలను అలాగే కొనసాగిస్తున్నందుకు నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను.

3 అయితే ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అని, స్త్రీకి శిరస్సు పురుషుడని, క్రీస్తుకు శిరస్సు దేవుడని మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను.

4 కాబట్టి ఏ పురుషుడైనా తన తలమీద ముసుగు వేసుకుని ప్రార్థించినా లేదా ప్రవచించినా అతడు తన తలను అవమానిస్తున్నాడు.

5 అయితే ఏ స్త్రీయైనా తలమీద ముసుగు వేసుకోకుండా ప్రార్థించినా లేదా ప్రవచించినా ఆ స్త్రీ తన తలను అవమానపరుస్తున్నట్టే. అలా చేస్తే ఆమె తలను క్షౌరం చేసుకున్నట్టే.

6 స్త్రీ తన తలపై ముసుగు వేసుకోకపోతే, తన వెంట్రుకలను కత్తిరించుకోవాలి. అయితే వెంట్రుకలు కత్తిరించుకోవడం గాని లేదా తల క్షౌరం చేయించుకోవడం స్త్రీకి అవమానంగా అనిపిస్తే ఆమె తలపై ముసుగు వేసుకోవాలి.

7 పురుషుడు దేవుని పోలికగా మహిమగా ఉన్నాడు కాబట్టి అతడు తన తలపై ముసుగు వేసుకోకూడదు; కాని స్త్రీ పురుషునికి మహిమగా ఉంది.

8 ఎందుకంటే, పురుషుడు స్త్రీ నుండి రాలేదు గాని, స్త్రీ పురుషుని నుండి వచ్చింది.

9 పురుషుడు స్త్రీ కోసం సృష్టించబడలేదు గాని, పురుషుని కోసం స్త్రీ సృష్టించబడింది.

10 ఈ కారణంగా, దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తలపై ఉండాలి.

11 అయితే, ప్రభువులో స్త్రీకి వేరుగా పురుషుడు, పురుషునికి వేరుగా స్త్రీ ఉండరు.

12 పురుషుని నుండి స్త్రీ ఎలా కలిగిందో, అలాగే పురుషుడు స్త్రీ నుండి జన్మిస్తున్నాడు. అయితే సమస్తం దేవుని నుండి వచ్చాయి.

13 మీకు మీరే ఆలోచించుకోండి; స్త్రీ తలపై ముసుగు వేసుకోకుండా దేవునికి ప్రార్థన చేయడం సరియైనదేనా?

14 పురుషునికి పొడవైన వెంట్రుకలు ఉండడం అతనికి అవమానమని సహజంగా మీకు అనిపిస్తుంది కదా?

15 అయితే స్త్రీకి పొడవైన జుట్టు ఆమె తలను కప్పుకోడానికి పైటచెంగుగా ఇవ్వబడింది కాబట్టి పొడవైన జుట్టు కలిగి ఉండడం ఆమెకు గౌరవం కాదా?

16 కాని, ఎవరైనా దీని గురించి వాదించాలనుకుంటే, మనలో గాని దేవుని సంఘంలో గాని మరి ఏ ఇతర ఆచారం లేదని గ్రహించాలి.


ప్రభురాత్రి భోజనం యొక్క దుర్వినియోగాన్ని సరిదిద్దుట

17 ఈ ఆజ్ఞలు ఇస్తూ నేను మిమ్మల్ని మెచ్చుకోను, ఎందుకంటే మీ సమావేశాలు మంచి కంటే చెడునే ఎక్కువగా చేస్తున్నాయి.

18 మొదటి విషయం, మీరు దేవుని సంఘంగా ఒకచోట చేరినప్పుడు మీలో విభేదాలు ఉన్నాయని నేను విన్నాను. ఇది కొంతవరకు నిజమని నేను నమ్ముతున్నాను.

19 మీలో ఎవరు దేవుని ఆమోదం పొందారో తెలియడానికి మీ మధ్యలో అభిప్రాయ భేదాలు ఉండవలసిందే.

20 అయితే మీరు సమావేశమైనప్పుడు మీరు తినేది ప్రభువు రాత్రి భోజనం కాదు.

21 ఎందుకంటే, మీరు తింటున్నప్పుడు, మీలో కొందరు తమ భోజనాన్ని ముందుగానే చేసేస్తున్నారు. దాని ఫలితంగా ఒకరు ఆకలితో ఉండగా మరొకరు మత్తులై పోతున్నారు.

22 తినడానికి, త్రాగడానికి మీకు ఇల్లు లేవా? లేదా ఏమి లేనివారిని అవమానించడం ద్వారా మీరు దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? నేను మీకు ఏమి చెప్పాలి? మిమ్మల్ని పొగడాలా? ఈ విషయంలో ఖచ్చితంగా మెచ్చుకోలేను.

23 ఎందుకంటే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు నుండి పొందాను. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి రొట్టెను తీసుకుని,

24 కృతజ్ఞతలు చెల్లించి, దాన్ని విరిచి ఇలా అన్నారు, “ఇది మీ కోసం ఇవ్వబడిన నా శరీరం; నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి.”

25 అలాగే భోజనమైన తర్వాత ఆయన పాత్రను తీసుకుని, “ఈ పాత్ర నా రక్తంతో కూడిన క్రొత్త నిబంధన, దీన్ని మీరు త్రాగిన ప్రతిసారి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి” అని చెప్పారు.

26 కాబట్టి మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోనిది త్రాగిన ప్రతిసారి ప్రభువు వచ్చేవరకు ఆయన మరణాన్ని ప్రకటిస్తారు.

27 కాబట్టి, ఎవరైతే అయోగ్యంగా ప్రభువు రొట్టెను తిని, ఆయన పాత్రలోనిది త్రాగుతారో వారు ప్రభువు శరీరం, ఆయన రక్తం గురించి అపరాధులవుతారు.

28 కాబట్టి, ప్రతి ఒక్కరు ఆ రొట్టెను తినడానికి ఆ పాత్రలోనిది త్రాగడానికి ముందు తనను తాను పరీక్షించుకోవాలి.

29 ఎందుకంటే, ఎవరైనా ప్రభువు శరీరమని వివేచించకుండా ఆ రొట్టెను తిని, పాత్రలోనిది త్రాగితే వారు తమపైకి తామే తీర్పు తెచ్చుకోవడానికే తిని త్రాగుతున్నారు.

30 ఈ కారణంగానే, మీలో చాలామంది వ్యాధిగ్రస్తులుగా, బలహీనులుగా ఉన్నారు, చాలామంది మరణిస్తున్నారు.

31 కాబట్టి మనల్ని మనమే విమర్శించుకుంటే మన మీదికి తీర్పు రాదు.

32 ప్రభువు ద్వారా మనం తీర్పు పొందినప్పుడు, అంతంలో ఈ లోకంతో పాటు శిక్షకు గురి కాకుండా ఉండడానికి మనం క్రమపరచబడుతున్నాము.

33 కాబట్టి, సహోదరీ సహోదరులారా! మీరు భోజనం చేయడానికి చేరినప్పుడు మీరందరు కలిసి భోజనం చేయండి.

34 ఒకవేళ, మీరు ఒకచోట సమావేశమైనప్పుడు మీరు దేవుని తీర్పుకు గురి కాకుండా ఎవరికైనా ఆకలిగా ఉంటే వారు ఇంటి దగ్గరే ఏదైనా తినాలి. నేను అక్కడికి వచ్చినపుడు మరిన్ని సూచనలు ఇస్తాను.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan