Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 కొరింథీ 10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


ఇశ్రాయేలీయుల చరిత్ర నుండి హెచ్చరికలు

1 సహోదరీ సహోదరులారా, మీరు సత్యం తెలియనివారిగా ఉండాలని నేను కోరడంలేదు. మన పూర్వికులందరూ మేఘం క్రింద ఉన్నారు. సముద్రం గుండా ప్రయాణించారు.

2 వారందరు మేఘంలో సముద్రంలో మోషే బట్టి బాప్తిస్మం పొందారు.

3 వారందరు ఒకే ఆత్మీయ ఆహారం తిన్నారు.

4 అందరు ఒకే ఆత్మీయ నీటిని త్రాగారు. ఎందుకంటే తమతో కూడా ఉన్న ఆత్మీయ బండ నుండి వారు త్రాగారు, ఆ బండ క్రీస్తు.

5 అయినాసరే, వారిలో అనేకమంది దేవున్ని సంతోషపరచలేదు; కాబట్టి వారి శవాలు అరణ్యంలో చెల్లాచెదురుగా పడ్డాయి.

6 వారిలా మన హృదయాలను చెడ్డ విషయాలపై నిలుపకుండా ఈ సంగతులు మనకు ఉదాహరణలుగా ఉన్నాయి.

7 వారిలో కొందరిలా మీరు విగ్రహారాధికులుగా ఉండకండి: “ప్రజలు తినడానికి త్రాగడానికి కూర్చుని ఆడడానికి లేచారు,” అని వారి గురించి వ్రాయబడింది.

8 వారిలా మనం లైంగిక దుర్నీతికి పాల్పడకూడదు. వారిలో కొందరు అలా చేయడం వలన ఒక్క రోజులోనే ఇరవై మూడువేలమంది చనిపోయారు.

9 వారిలో కొందరు శోధించినట్లుగా మనం క్రీస్తును శోధించకూడదు, అలా శోధించినవారు సర్పాల వల్ల చనిపోయారు.

10 వారిలా మనం సణుగకూడదు, వారిలో కొందరు సణిగి నాశనం చేసే దూత వలన చనిపోయారు.

11 మనకు ఉదాహరణలుగా ఉండడానికి ఈ సంగతులు వారికి సంభవించి, రాబోయే యుగాంతంలో మనకు హెచ్చరికగా ఉండడానికి వ్రాయబడ్డాయి.

12 కాబట్టి, తాము దృఢంగా నిలిచి ఉన్నామని భావించేవారు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి.

13 సాధారణంగా మనష్యులకు కలిగే శోధనలు తప్ప మరి ఏ ఇతర శోధనలు మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధించబడనివ్వడు. కాని మీరు శోధించబడినప్పుడు దానిని సహించడానికి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే అందిస్తాడు.


విగ్రహపు విందులు, ప్రభువు రాత్రి భోజనం

14 కాబట్టి నా ప్రియ స్నేహితులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి.

15 నేను తెలివిగల వారితో మాట్లాడుతున్నాను; నేను చెప్పిన దాన్ని మిమ్మల్ని మీరే ఆలోచించండి.

16 మనం కృతజ్ఞతలు తెలియజేయడానికి ఆశీర్వాదపు పాత్రలోనిది త్రాగడం క్రీస్తు రక్తంలో పాలుపుచ్చుకోవడమే కదా? మనం రొట్టె విరిచి తినడం క్రీస్తు శరీరంలో పాలుపంచుకోవడమే కదా?

17 మనమందరం ఆ ఒకే రొట్టెను పంచుకుంటున్నాం, రొట్టె ఒక్కటే కాబట్టి అనేకులమైన మనం ఒకే శరీరంగా ఉన్నాము.

18 ఇశ్రాయేలు ప్రజలారా చూడండి: బలి అర్పించిన వాటిని తిన్నవారు బలిపీఠంలో భాగస్థులు కారా?

19 ఇక నేను చెప్పేది ఏంటంటే, విగ్రహాలకు అర్పించిన ఆహారంలో ఏమైన ప్రత్యేకత ఉందా? విగ్రహం ఏమైన ప్రత్యేకమైనదా?

20 కాదు, అయితే దేవుని ఎరుగనివారు అర్పించే బలులు దేవునికి కాదు దయ్యాలకే అర్పిస్తున్నారు. కాని దేవునికి అర్పించినవి కావు, మీరు దయ్యాలతో భాగస్వాములుగా ఉండకూడదని నా కోరిక.

21 మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యపు పాత్రలోనిది ఒకేసారి త్రాగలేరు. ప్రభువు బల్లలో దయ్యపు బల్లలో ఒకేసారి పాల్గొనలేరు.

22 ప్రభువు రోషాన్ని పుట్టించడానికి మనం ప్రయత్నిస్తున్నామా? ఆయన కంటే మనం బలవంతులమా?


విశ్వాసుల స్వాతంత్ర్యం

23 “ఏది చేయడానికైనా నాకు అనుమతి ఉంది” అని మీరు అనుకోవచ్చు, కాని అన్ని ప్రయోజనకరమైనవి కావు. “ఏది చేయడానికైనా నాకు హక్కు ఉంది” కాని అన్నీ అభివృద్ధిని కలిగించవు.

24 ఎవరైనా సరే తమ మంచినే చూసుకోకూడదు ఇతరుల మంచిని కూడా చూడాలి.

25 మనస్సాక్షిని బట్టి ఏ ప్రశ్నలు వేయకుండా మాంసం దుకాణంలో అమ్మే దేనినైనా తినవచ్చును.

26 ఎందుకంటే, “భూమి, దానిలో ఉండే సమస్తం ప్రభువుకు చెందినవే.”

27 ఒక అవిశ్వాసి మిమ్మల్ని భోజనానికి పిలిచినపుడు మీరు వెళ్లాలనుకుంటే, మనస్సాక్షిని బట్టి ఏ ప్రశ్నలు వేయకుండా మీ ముందు ఉంచిన వాటిని తినండి.

28 కాని ఎవరైనా మీతో, “ఇది విగ్రహాలకు అర్పించిన ఆహారం” అని చెబితే దాన్ని తినవద్దు. మీకు చెప్పినవాని కోసం, మనస్సాక్షి కోసం దాన్ని తినవద్దు.

29 మీ మనస్సాక్షి గురించి కాదు గాని ఇతరుల మనస్సాక్షి గురించి నేను ఇలా చెప్తున్నాను, ఎందుకంటే వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్యం ఎందుకు విమర్శించబడాలి?

30 నేను కృతజ్ఞతతో పాలు పంచుకుంటే నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన దాని కోసం నేనెందుకు నిందించబడాలి?

31 నీవు ఏమి తిన్నా, ఏమి త్రాగినా ఏమి చేసినా వాటన్నిటిని దేవుని మహిమ కొరకే చేయాలి.

32 యూదులకైనా, గ్రీసు దేశస్థులకైనా, దేవుని సంఘానికైనా మరి ఎవరికైనా సరే అభ్యంతరంగా ఉండకండి.

33 అలాగే నేను కూడా అందరిని అన్ని విధాలుగా సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. నా స్వలాభాన్ని ఆశించకుండా, అనేకమంది రక్షింపబడాలని వారి మంచి కోరుతున్నాను.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan