Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 కొరింథీ 1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 దేవుని చిత్తం ద్వారా క్రీస్తు యేసుని అపొస్తలునిగా ఉండడానికి పిలువబడిన పౌలు, మన సహోదరుడైన సొస్తెనేసు,

2 క్రీస్తు యేసులో పవిత్రపరచబడి పరిశుద్ధ ప్రజలుగా ఉండడానికి పిలువబడిన వారితో పాటు, మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట ప్రతిచోట ప్రార్థించే కొరింథీలోని దేవుని సంఘస్థులందరికీ శుభమని చెప్పి వ్రాయునది:

3 మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానం కలుగును గాక.


కృతజ్ఞతలు చెల్లించుట

4 క్రీస్తు యేసులో దేవుని కృప మీకు ఇవ్వబడింది కాబట్టి మీ కోసం నా దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

5 దేవుడు క్రీస్తు గురించి మా సాక్ష్యాన్ని మీ మధ్య స్థిరపరస్తున్నారు కాబట్టి,

6 మీరు ఆయనలో సమస్త జ్ఞానంలోను సమస్త ఉపదేశంలోను ఐశ్వర్యవంతులు అయ్యారు.

7 కాబట్టి మీరు ఏ కృపావరంలో లోటు లేకుండా మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షత కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

8 ఆ దేవుడే మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షపరచబడే రోజున, మీరు నిరపరాధులుగా ఉండాలని అంతం వరకు మిమ్మల్ని స్థిరపరుస్తారు.

9 తన కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.


నాయకులను బట్టి సంఘంలో విభేదాలు

10 సహోదరీ సహోదరులారా, మీ మధ్య భేదాలు లేకుండ మీ మనస్సులోను ఆలోచనలోను పరిపూర్ణ ఏకత్వంతో ఉండాలని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.

11 నా సహోదరీ సహోదరులారా, మీలో కలహాలు ఉన్నాయని క్లోయె ఇంటివారిలో కొందరు నాకు తెలియజేశారు.

12 నేను చెప్పేది ఏంటంటే: మీలో “నేను పౌలును అనుసరిస్తున్నానని” ఒకరు, “నేను అపొల్లోను అనుసరిస్తున్నానని” వేరొకరు, “నేను కేఫాను అనుసరిస్తున్నానని” మరొకరు, “నేను క్రీస్తును అనుసరిస్తున్నానని” మరి ఇంకొకరు చెప్పుకుంటున్నారని విన్నాను.

13 క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కోసం సిలువ వేయబడ్డాడా? మీరు పౌలు పేరట బాప్తిస్మం పొందారా?

14-15 నా పేరట బాప్తిస్మం పొందామని మీరు ఎవరూ చెప్పుకోకూడదని క్రిస్పుకు గాయికు తప్ప మరి ఎవరికీ నేను బాప్తిస్మం ఇవ్వనందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.

16 అవును! స్తెఫెను ఇంటివారికి బాప్తిస్మం ఇచ్చాను, దానికి మించి ఎవరికి కూడా బాప్తిస్మం ఇచ్చినట్టు నాకు గుర్తులేదు.

17 ఎందుకంటే, క్రీస్తు నన్ను బాప్తిస్మం ఇవ్వడానికి పంపలేదు కానీ, క్రీస్తు సిలువ తన శక్తి కోల్పోకుండా ఉండాలని, జ్ఞానంతో వాక్చాతుర్యంతో కాకుండ సువార్తను ప్రకటించడానికే ఆయన నన్ను పంపించారు.


సిలువవేయబడిన క్రీస్తే దేవుని శక్తి జ్ఞానము

18 ఎందుకంటే సిలువను గురించిన సువార్త నశించేవారికి పిచ్చితనంగా ఉంది, కానీ రక్షించబడే మనకు అది దేవుని శక్తి.

19 దీని గురించి వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది, “జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను; వివేకవంతుల తెలివిని వ్యర్థం చేస్తాను.”

20 జ్ఞాని ఎక్కడ? ధర్మశాస్త్ర బోధకుడు ఎక్కడ? ఈ కాలపు పండితుడు ఎక్కడ? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు కదా?

21 దేవుని జ్ఞానం ప్రకారం, లోకం తన జ్ఞానంతో దేవునిని తెలుసుకోలేదు. సువార్తను ప్రకటించే వెర్రితనం ద్వారా నమ్మినవారిని రక్షించడం దేవునికి ఇష్టమైనది.

22 యూదులు సూచనలు అడుగుతారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం కోసం వెదుకుతారు.

23 అయితే మేము సిలువవేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాం: ఆయన యూదులకు ఆటంకంగా యూదేతరులకు వెర్రితనంగా ఉన్నారు.

24 అయితే యూదులలో గ్రీసు దేశస్థులలో దేవునిచే పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిగా, దేవుని జ్ఞానంగా ఉన్నారు.

25 ఎందుకంటే, దేవుని వెర్రితనం మనుష్యుల జ్ఞానం కంటే జ్ఞానవంతమైనది, దేవుని బలహీనత మనుష్యుల బలం కంటే బలమైనది.

26 సహోదరీ సహోదరులారా, మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఎలా ఉన్నారో ఆలోచించండి. లోకపు దృష్టిలో మీలో చాలామంది జ్ఞానులు కారు, ఘనులు కారు, గొప్ప వంశంలో పుట్టిన వారు కారు.

27 అయితే, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలోని బుద్ధిహీనులను దేవుడు ఎన్నుకున్నారు; బలవంతులను సిగ్గుపరచడానికి లోకంలోని బలహీనులను దేవుడు ఎన్నుకున్నారు.

28-29 ఎవరూ దేవుని ముందు తనను తాను హెచ్చించుకోకుండా ఉండడానికి, ఎన్నికచేయబడిన వారిని వ్యర్థం చేయడానికి ఈ లోకంలో నీచమైన వారిని, నిర్లక్ష్యం చేయబడిన వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నారు.

30 దేవుడు చేసిన కార్యాలను బట్టి మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. ఇప్పుడు క్రీస్తే దేవుని ద్వారా మనకు జ్ఞానంగా ఉన్నారు అనగా ఆయనే మన నీతిగా, పరిశుద్ధతగా, విమోచనగా ఉన్నారు.

31 కాబట్టి, “గర్వించేవారు ప్రభువులోనే గర్వించాలి” అని వ్రాయబడి ఉంది.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan